భూములు లాక్కొని.. పరిహారం ఎగ్గొట్టి.. | very sad news to solar victims in np kunta | Sakshi
Sakshi News home page

భూములు లాక్కొని.. పరిహారం ఎగ్గొట్టి..

Published Thu, Jun 15 2017 11:23 PM | Last Updated on Mon, Oct 22 2018 8:40 PM

భూములు లాక్కొని.. పరిహారం ఎగ్గొట్టి.. - Sakshi

భూములు లాక్కొని.. పరిహారం ఎగ్గొట్టి..

- ఎన్‌పీకుంట సోలార్‌ బాధిత రైతులకు తీరని అన్యాయం
- మూడేళ్లు పూర్తయినా అందని పరిహారం
- ప్రకటించింది అరకొరే.. దాన్నీ ఎగ్గొడుతున్న ప్రభుత్వం!
- సర్వం కోల్పోయిన సాగుదారులు
- పరిహారం రాదన్న ఆవేదనతో ఇటీవల ఓ రైతు ఆత్మహత్య
- అయినా చలనం లేని సర్కారు


సోలార్‌ ప్లాంటు కోసం సేకరించిన భూములు
భూమి వివరము     ఎకరాలు    
ప్రభుత్వ భూమి    4,581.84 ఎకరాలు    
పట్టా భూమి     290.11 ఎకరాలు    
అసైన్డ్‌ భూమి    2,302.30 ఎకరాలు    
సాగుభూమి        1840.77 ఎకరాలు    
మొత్తం        9,015.02 ఎకరాలు    


వారంతా కష్టజీవులు. వ్యవసాయం తప్ప మరో పని తెలీదు. అనేక ఏళ్లుగా నేలతల్లినే నమ్ముకున్నారు. కష్టమైనా, నష్టమైనా పంటల సాగుపైనే ఆధారపడ్డారు. అలాంటి రైతుల్లో ఒక్కసారిగా కుదుపు. ‘భూములు మీవి కాదు..సర్కారువి’ అంటూ నిర్ధాక్షిణ్యంగా లాగేసుకున్నారు. అయ్యా..తరతరాలుగా సాగు చేస్తున్నామని రైతులు మొత్తుకున్నా..అధికారులు విన్పించుకోలేదు. ‘రికార్డు ప్రకారం మీవి కాదు..అయినా ఎంతోకొంత ఇస్తాం లే..’ అంటూ ‘ఉదారత’ ప్రదర్శించారు. తీరా భూములు లాగేసుకున్నాక, వాటిలో సోలార్‌ప్లాంటు కూడా ఏర్పాటు చేశాక..ఇప్పుడు పరిహారం ఊసే ఎత్తడం లేదు. దీంతో జీవనాధారం కోల్పోయిన రైతులు తీవ్ర మానసిక వేదనతో కుంగిపోతున్నారు.

కదిరి : ఎన్‌పీకుంటకు చెందిన మౌలాసాబ్‌ (68)కు అదే పంచాయతీ పరిధిలోని కావమ్మ ఆలయానికి సమీపంలో పదెకరాల సాగుభూమి ఉండేది. అందులో బోరు వేయించి.. వేరుశనగతో పాటు పలు రకాల పంటలు పండించేవాడు. ఆ భూమికి పట్టాతో పాటు పాసుపుస్తకాలు కూడా మంజూరు చేయాలని అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు కోసమని ఆ భూమి మొత్తం ప్రభుత్వం లాగేసుకుంది. మౌలాసాబ్‌ను సాగుదారుడిగా గుర్తించి.. పదెకరాలకు కలిపి రూ.లక్ష పరిహారం ఇస్తామని ప్రకటించింది. అయితే.. మూడేళ్లు గడిచినా చిల్లి గవ్వ కూడా చెల్లించలేదు. గతంలో వరుస పంట నష్టాలతో అప్పుల పాలు కావడంతో పాటు పరిహారం అందక, కుటుంబ పోషణ సైతం భారమై మౌలాసాబ్‌ చివరకు ఇల్లు కూడా అమ్మేశాడు. అయినా అప్పులు తీరలేదు. తనకు వేరేదారి లేక ఈ నెల 9వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్క మౌలాసాబ్‌ మాత్రమే కాదు.. ఎన్‌పీకుంట సోలార్‌ ప్లాంటు బాధిత రైతులలో చాలామంది పరిస్థితి దయనీయంగా మారింది. సాగుభూములు కోల్పోయి పరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతులు 1,156 మంది ఉన్నట్లు అధికారిక రికార్డులే చెబుతున్నాయి. ఇక పరిహారం అందేది అనుమానమేనని సంబంధిత అధికారులే అంటుండడంతో రైతులు కుంగిపోతున్నారు.

         ఎన్‌పీకుంట మండల కేంద్రానికి సమీపాన దేశంలోనే పెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంటు నిర్మిస్తున్నారు. ఇప్పటికే పనులు చాలావరకు పూర్తయ్యాయి. వెయ్యి మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు ఉద్దేశించిన ఈ ప్లాంటు బా«ధ్యతను నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) తీసుకుంది. దీనికోసం ఎన్‌పీకుంట పంచాయతీ పరిధిలో 2,079.38 ఎకరాలు, పి.కొత్తపల్లి పరిధిలో 5,094.87 ఎకరాలు కలిపి మొత్తం 7,174.25 ఎకరాలను మూడు విడతల్లో సేకరించారు. ఇందులో ప్రభుత్వ భూమి 4,581.84 ఎకరాలు, రైతు పట్టా భూమి 290.11 ఎకరాలు, అసైన్డ్‌ భూమి 2,302.30 ఎకరాలు ఉంది. ఇది కాకుండా మరో 1,840.77 ఎకరాల రైతుల సాగుభూమిని బలవంతంగా లాక్కున్నారు.

    నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా ప్రభుత్వం ఇస్తోంది. ఎన్‌పీకుంటలో మాత్రం తీరని అన్యాయం చేసింది. పట్టా భూమికి రూ.3 లక్షల నుంచి రూ.3.20 లక్షలు, అసైన్డ్‌ భూమికి రూ.2 లక్షల నుంచి రూ.2.10 లక్షల చొప్పున మొత్తం 741 మంది రైతులకు రూ.44.44 కోట్లు చెల్లించారు. ఇంకా పట్టా, అసైన్డ్‌ భూములు కోల్పోయిన 103 మంది రైతులకు రూ.6.91 కోట్లు చెల్లించాల్సి ఉంది. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో పెండింగ్‌లో పెట్టారు. ఇదంతా ఓ ఎత్తయితే.. ఏళ్ల తరబడి భూములు సాగుచేసుకుంటూ  వివిధ కారణాలతో పట్టాలు పొందని 1,156 మంది రైతుల పరిస్థితి మరో ఎత్తు. ఈ రైతులకు ఇప్పటి దాకా ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేదు. ఎకరాలతో సంబంధం లేకుండా ఎన్ని ఎకరాలు సాగు చేసుకుంటున్నప్పటికీ సాగు రైతులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చెల్లిస్తామని ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ డబ్బు కూడా ఎగ్గొట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

6 ఎకరాలు బలవంతంగా లాక్కున్నారు – రైతు కేశవరెడ్డి, పి.కొత్తపల్లి, ఎన్‌పీకుంట మండలం
మాకు పి.కొత్తపల్లి పరిధిలో ఆరెకరాల సాగుభూమి ఉంది. ఈ భూమి మొత్తం సోలార్‌ ప్రాజెక్టు కోసమని ప్రభుత్వం బలవంతంగా లాక్కుంది. అంతటికీ కలిపి రూ.లక్ష ఇస్తామన్నారు కానీ.. ఇప్పటి దాకా ఒక్క రూపాయి చెల్లించలేదు. ఉన్న భూమిని లొక్కొని, పరిహారం కూడా ఇవ్వకపోతే మా గతి ఏం కావాలి?రైతుల ఉసురు  ఈ ప్రభుత్వానికి తగలక తప్పదు.

సాగుభూమికి పరిహారం రాకపోవచ్చు – ఎ.వెంకటేశు, ఆర్డీఓ, కదిరి
నాకు తెలిసి పట్టా, అసైన్డ్‌ భూములకు పరిహారం వస్తుంది కానీ ఎటువంటి పత్రాలూ లేని సాగుభూములకు పరిహారం చెల్లించిన దాఖలాలు ఎక్కడా లేవు. గతంలో అధికారులు ఏం చెప్పారో నాకు తెలియదు. ఎన్‌పీకుంట సోలార్‌ ప్రాజెక్టు బాధిత రైతులకు పరిహారం చెల్లించే విషయం ఇప్పుడు నా పరిధిలో లేదు. జిల్లా కలెక్టర్‌ పరిధిలో ఉంది.

మెడలు వంచి ఇప్పిస్తాం - డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి, వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త
సోలార్‌ ప్లాంటు కోసం తీసుకున్న భూములు బాగా సారవంతమైనవి. వాటికి ఎగువన పెడబల్లి ప్రాజెక్టు, దిగువన వెలిగల్లు ప్రాజెక్టు ఉన్నాయి. ఆ భూముల మధ్యలోనే హంద్రీ-నీవా కాలువ కూడా వెళ్తోంది. అలాంటి భూములను బలవంతంగా లాక్కున్నదే కాకుండా ఇప్పుడు సాగుదారులకు పరిహారం ఇవ్వకపోతే ఎలా? ఈ సర్కారు మెడలు వంచైనా పరిహారం ఇప్పిస్తాం. రైతుల కోసం అవసరమైతే న్యాయ పోరాటానికీ సిద్ధం. సాగురైతు మౌలాసాబ్‌ మృతికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement