గత మూడు రోజులుగా కాస్తంత తగ్గిన ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం జిల్లా అంతటా వేసవితాపం కొనసాగింది.
అనంతపురం అగ్రికల్చర్ : గత మూడు రోజులుగా కాస్తంత తగ్గిన ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం జిల్లా అంతటా వేసవితాపం కొనసాగింది. శింగనమల మండలం తరిమెల, ఎన్‌పీ కుంటలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. యల్లనూరు, చెన్నేకొత్తపల్లి 40 డిగ్రీలు, తాడిపత్రి, పుట్టపర్తి, తాడిమర్రి, పుట్లూరు, పామిడి, నార్పల, కదిరిలో 39 డిగ్రీలు ఉండగా మిగతా మండలాల్లో 36 నుంచి 38 డిగ్రీలుగా కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 65 నుంచి 85, మధ్యాహ్నం 35 నుంచి 45 శాతం మధ్య రికార్డయింది.
గంటకు 6 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. కాగా శుక్రవారం రామగిరి, కనగానపల్లి, కనేకల్లు, బొమ్మనహాల్, రాయదుర్గం, చెన్నేకొత్తపల్లి, కంబదూరు తదితర మండలాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. రానున్న నాలుగు రోజుల్లో వర్షం కురిసే సూచనలు లేవని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.