అనంతపురం అగ్రికల్చర్ : మండుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారు. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు అధికమవుతుండడంతో ‘అనంత’ నిప్పులకొలిమిలా మండుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా పెరగడంతో ఉక్కపోత అధికమైంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఎండవేడికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం కూడా శింగనమల మండలం తరిమెలలో 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత పామిడి 44.3 డిగ్రీలు, నార్పల 43.1 డిగ్రీలు, యాడికి 43.1 డిగ్రీలు, తాడిమర్రి 43 డిగ్రీలు, యల్లనూరు 43 డిగ్రీలు, బుక్కరాయసముద్రం 43 డిగ్రీలు, విడపనకల్ 42.8 డిగ్రీలు, పుట్లూరు 42.7 డిగ్రీలు కొనసాగింది. ప్రధాన పట్టణాలైన అనంతపురం 42.2 డిగ్రీలు, ధర్మవరం 41.8 డిగ్రీలు, ఉరవకొండ 42.5 డిగ్రీలు, కళ్యాణదుర్గం 42.4 డిగ్రీలు, గుంతకల్లు 42.4 డిగ్రీలు, కదిరి 41.1 డిగ్రీలు, పుట్టపర్తి 40.3 డిగ్రీలు నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 23 నుంచి 29 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 46 నుంచి 76, మధ్యాహ్నం 14 నుంచి 24 శాతం మధ్య రికార్డయ్యింది. గంటకు 6 నుంచి 14 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. వచ్చే నాలుగు రోజులూ ఎలాంటి వర్షం వచ్చే సూచనలు లేవని, ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో స్థిరంగా కొనసాగనున్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్ర్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి తెలిపారు.