దేశంలోనే తొలిసారిగా సంపూర్ణమైన సోలార్ గ్రామంగా గుజరాత్‌లోని మొడేరా గ్రామాన్ని తీర్చిదిద్దడానికి పోయిన ఏడాది కార్యాచరణ మొదలైంది. అభివృద్ధి, పరిణామాలపై సమీక్ష జరగాల్సివుంది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ బృహత్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 24×7 అన్నట్లుగా అన్నివేళలా అంతటా సౌరశక్తి వెలుగాలన్నది లక్ష్యం.
ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న కాలుష్యం, భయానకంగా మారుతున్న పర్యావరణం, ప్రబలుతున్న వింత వింత వ్యాధులు, అంతకంతకు పెరుగుతున్న విద్యుత్ ధరలు, తరిగిపోతున్న సహజవనరుల నడుమ సౌరశక్తిని సద్వినియోగం చేసుకొనే దిశగా వేసే ప్రతి అడుగూ ప్రశంసాపాత్రమే. దేశంలో సూర్యదేవాలయాలున్న అతి కొద్ది గ్రామాల్లో మొడేరా ఒకటి.
సౌర దీప్తులు దేశంలోని ప్రతి గ్రామంలో విరగబూసినప్పుడే జాతి జ్యోతి మరింతగా వెలుగుతుంది. గుజరాత్ అభివృద్ధి నమూనాను అన్ని రాష్ట్రాలలో ప్రతిస్పందించేలా కేంద్రం కార్యాచరణ చేపట్టాలి. ప్రధాని సొంత రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాలలోనూ సౌర గ్రామాల సంఖ్య పెరగాలి.
2014లో మోదీని దేశ ప్రజలు ప్రధానమంత్రిగా ఎన్నుకున్న కారణాలలో గుజరాత్ అభివృద్ధి కూడా ఒక ముఖ్యమైన అంశం. 2014, 2019లో వరుసగా రెండు సార్లు ప్రధానిగా ఆయనకు ప్రజలు పట్టం కట్టారంటే ఆయనపై పెట్టుకున్న విశ్వాసం మరో ముఖ్య కారణం. దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనపై నేడు మరింతగా వుంది. మరి కొన్ని నెలలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈలోపు అనుకున్న అభివృద్ధిని సాధించి, ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల్లో భరోసా నింపడం కీలకం.
ఈ తొమ్మిదేళ్లలో దేశంలోని అనేక రాష్ట్రాలు కూడా బిజెపి వశమయ్యాయి. దానికి కారణాలు అనేకం ఉండవచ్చు, తమకు గెలుపునిచ్చిన ప్రజలు కూడా జీవితంలో గెలిచేట్లు, జీవనాలు వెలిగేట్లు చూడడం ఏలికల ముఖ్య బాధ్యత. చాలా వరకూ సహజవనరులను మనిషి తన ఆర్ధిక స్వార్థంతో మట్టుపెట్టాడు. అయినా ఇంకా ఎంతో అమూల్యమైన సహజ సంపద మన చుట్టూ వుంది.
ప్రణాళికా బద్ధంగా దానిని సద్వినియోగం చేస్తే జాతి ప్రగతి వేగం ఎన్నోరెట్లు ఊపందుకుంటుంది. సహజ వనరులను సద్వినియోగం చేసుకొని పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం అత్యంత ముఖ్యం. ఇప్పటికీ విద్యుత్ సమస్యలు తీరడం లేదు. ముఖ్యంగా ఎండాకాలం వచ్చినా, వర్షాలు పెరిగినా పల్లెలు చీకట్లోనే మగ్గుతున్నాయి. విద్యుత్ సంస్కరణలు జరగాలని నిపుణులు మొరపెట్టుకుంటున్నా అది అరణ్యరోదనగానే మిగులుతోంది. ఈ క్రమంలో సౌరశక్తిని సద్వినియోగం చేసుకుంటూ సౌరవిద్యుత్ వాడకం పెరిగితే ఖర్చులు కూడా అదుపులోకి వస్తాయి. వృధా డబ్బు ఆదా అవుతుంది.
సౌర శక్తి వాడకంపై ఇంకా చాలినంత అవగాహన ప్రజల్లో రాలేదు. సూర్యరశ్మి నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను సౌరవిద్యుత్ అంటారు. 1980దశకం నుంచే సౌర విద్యుత్ వినియోగంపై అడుగులు పడడం మొదలయ్యాయి. ఉత్పత్తి చేసే ప్లాంట్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి.ఇందులో కర్ణాటకలోని పావగడ ప్రాంతం తలమానికంగా నిలుస్తోంది. మనిషి మొదలు అనేక జీవరాసులకు అందే శక్తిలో ఎక్కువ భాగం సూర్యుడిదే.ఈ శక్తి అపారమైంది. దీనిని ఇంకా ఎన్నో రెట్లు వాడుకోవాల్సివుంది. సౌరశక్తిని సద్వినియోగం చేసుకోవడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కుతాయి. కాలుష్యం తగ్గిపోతుంది. పర్యావరణం పచ్చగా ఉంటుంది.
ఈ ప్రపంచంలో మనం ఒక సంవత్సరం పాటు ఉపయోగించే శక్తి కంటే ఒక గంటలో వెలువడే సౌరశక్తి ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. సోలార్ వస్తువుల ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఉత్పత్తుల వినియోగం పట్ల ఎక్కువమంది శ్రద్ధ చూపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. దీనిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. సోలార్ కార్లు, బైకులు పెరగాలని నిపుణులు సూచిస్తున్నారు.
సౌరశక్తిని నిల్వవుంచే వ్యవస్థలు పెరగాలి. పారిశ్రామికవేత్తలను, శాస్త్రవేత్తలను, రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రజలను సౌరశక్తి వినియోగం దిశగా అనుసంధానం చేయడంలో కేంద్రం మరింతగా కదలాలి. ఉత్పాదకతకు ప్రోత్సాహకాలను పెంచాలి. గుజరాత్ లోని మొడేరా తరహా గ్రామాలను దేశంలో పెద్ద స్థాయిలో తయారు చెయ్యాలి.ముఖ్యంగా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మరింత ఆరోగ్యకరంగా సాగాలి. ప్రత్యక్ష నారాయణుడి ప్రభ దేశంలో ప్రకాశమాన మయ్యేలా గట్టి అడుగులు పడాలి
-మా శర్మ, సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment