సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల విద్యాసంస్థల్లో సోలార్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. వీటికి అదనంగా గీజర్ సౌకర్యం కూడా కల్పించనుండడంతో విద్యార్థులకు నిరంతరం వేడి నీరు కూడా అందించే వీలుంటుంది. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించిన గిరిజన గురుకుల సొసైటీ.. తాజాగా టెండర్లు పిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 110 గిరిజన గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజీల్లో ముందుగా వీటిని ఏర్పాటు చేయనున్నారు.
కరెంటు చార్జీల పొదుపు: వేసవి సీజన్ మినహాయిస్తే.. మిగతా రోజుల్లో గురుకుల విద్యాసంస్థల్లో వేడినీటి వినియోగం ఎక్కువే. శీతాకాలంలో వాడకం మరింత పెరుగుతుంది. ఈ క్రమంలో కరెంటుతో నడిచే గీజర్లతో విద్యుత్ చార్జీల భారం తడిసి మోపెడవుతోంది. కొన్ని స్కూళ్లలో నెలకు వచ్చే కరెంటు బిల్లుల్లో గిజర్ వినియోగానికే రూ.25 వేలకుపైగా చెల్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ బిల్లుల భారాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో సోలార్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా కొన్ని పాఠశాలల్లో సోలార్ ప్లాంట్లు, గీజర్లను ఏర్పాటు చేయడంతో విద్యుత్ బిల్లుల్లో దాదాపు 30 శాతం ఆదా అయ్యింది. దీంతో అన్ని స్కూళ్లలో వీటిని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వారంలోగా టెండర్లు ఖరారైతే పక్షం రోజుల గడువు విధించి వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు గిరిజన గురుకుల సొసైటీ అధికారి ఒకరు తెలిపారు. విద్యా సంస్థలు ప్రారంభమయ్యే నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment