రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో భారీ జలాశయాలపై సుమారు 800 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సింగరేణి సీఎండీ ఎన్ బలరాం తెలిపారు. ఇటీవల సింగరేణి భవన్‌లో విద్యుత్ విభాగానికి చెందిన సంస్థ ఎలక్ట్రికల్ మెకానికల్ శాఖ డైరెక్టర్ డి.సత్యనారాయణ రావుతోపాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
భారీ జలాశయాలపై సౌర ఫలకల ఏర్పాటుతో విద్యుదుత్పత్తి పెంపునకు కృషి చేయాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోయర్ మానేరు డ్యాం నీటిపై 300 మెగావాట్లు, మల్లన్న సాగర్ నీటిపై 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎండీ ఆదేశించారు. అయితే లోయర్ మానేరు డ్యాంపై 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
మల్లన్న సాగర్ జలాశయంపైనా రెండు 250 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు డీపీఆర్‌ను వెంటనే రూపొందించాలని అధికారులకు సీఎండీ సూచించారు. మరోవైపు రాజస్థాన్‌లో సింగరేణి ఏర్పాటు చేయాలనే యోచనలో భాగంగా 500 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌పై కూడా అధికారులతో చర్చించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్మించే 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను పూర్తిచేసి నిర్మాణం మొదలుపెట్టాలన్నారు.
ఇదీ చదవండి: విమానం కంటే వేగంగా వెళ్లే రైలు.. ప్రత్యేకతలివే..
మరోవైపు వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో పవన విద్యుదుత్పత్తి కేంద్రాలకు అనువైన ప్రాంతాలను సందర్శించాలని, దీనికి సంబంధించి ఒక నివేదికనూ రూపొందించాలని అధికారులను సంస్థ సీఎండీ బలరాం ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment