సాక్షి, హైదరాబాద్: ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న సింగరేణికి చెందిన భూములిప్పుడు సౌరకాంతులు విరజిమ్మనున్నాయి. సింగరేణి వ్యాప్తంగా మూసేసిన భూగర్భ గనులు, ఓపెన్ కాస్టులు, నిరుపయోగంగా ఉన్న భూముల్లో ఆ సంస్థ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. దీంతో 1,500 ఎకరాల భూమి వినియోగంలోకి రానుంది. విద్యుత్ అవసరాల కోసం సంస్థ ఏటా రూ.486 కోట్లు ఖర్చు చేస్తోంది. 300 మెగావాట్ల సౌర విద్యుత్ వినియోగంలోకి వస్తే ఏటా రూ.300 కోట్ల భారం తగ్గనుంది. 25 ఏళ్ల జీవిత కాలంతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్లకు మొత్తం రూ.1,399 కోట్ల పెట్టుబడి అవుతోంది. అయితే.. ఏటా రూ.300 కోట్ల ఆర్జనతో మొదటి ఐదేళ్లలోనే ఈ పెట్టుబడి తిరిగి రానుంది. మొదటి దశ బీహెచ్‌ఈఎల్ నిర్మాణ పనులు చేస్తుండగా.. మిగతా రెండు దశల ప్లాంట్ల నిర్మాణం అదాని సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. వచ్చే 25 ఏళ్లు ఈ సంస్థలే ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలు చూడనున్నాయి.
సింగరేణి సౌర్యం
సౌర విద్యుత్ ఉత్పాదనలో కొత్తపుంతలు తొక్కుతున్న ‘సింగరేణి’.. వచ్చే రెండేళ్లలో మూడు దశల్లో 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా పనులు ముమ్మరం చేసింది. రెండేళ్ల క్రితం మొదలైన ఈ పనుల్లో ఈ ఏడాది కరోనాతో జాప్యం జరగగా.. మళ్లీ పనులు పుంజుకున్నాయి. మొదటి దశలో మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)లోని 50 ఎకరాల్లో 10 మెగావాట్లు, మణుగూరులో 150 ఎకరాల్లో 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో చాలాచోట్ల పనులు పూర్తయి ఉత్పత్తికి సిద్ధంగా ఉండగా.. రెండు, మూడో దశ పనులు కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పరిధిలో జేకే–5 ఓపెన్ కాస్ట్ పరిసరాల్లో 230 ఎకరాల్లో 39 మెగావాట్లకు గాను 15 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. మరో 24 మెగావాట్లు ఈ నెలాఖరులో పూర్తి కానుంది.
ప్రాజెక్టులపై 500 మెగావాట్లు
ఈ మూడు దశలు విజయవంతమైతే సాగునీటి ప్రాజెక్టుల్లో నీటిపై తేలియాడే (ఫ్లోటింగ్ సోలార్) ఫలకాలతో 500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ ప్రణాళిక రూపొందించింది. గోదావరి, అనుబంధ నదులపై భారీ ప్రాజెక్టులు, రిజర్వాయర్లపై సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ఆలోచనలున్నాయి. ప్రయోగాత్మకంగా మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని థర్మల్ పవర్ ప్లాంట్‌లో మూడు టీఎంసీల సామర్థ్యం ఉన్న రెండు రిజర్వాయర్లపై 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి పనులు మొదలయ్యాయి. వీటితో పాటు ఓసీపీల్లో నీటి ఉపరితలాల పైనా తేలియాడే సౌర ఫలకాలు బిగించి సౌర విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment