‘ఈనాడు, ఆంధ్రజ్యోతి’పై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా | Delhi High Court Responds To YS Jagan Defamation Suit On Eenadu And Andhra Jyothi, Check More Details Inside | Sakshi
Sakshi News home page

‘ఈనాడు, ఆంధ్రజ్యోతి’పై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా

Published Tue, Dec 10 2024 4:41 AM | Last Updated on Tue, Dec 10 2024 10:00 AM

Delhi High Court responds to YS Jagan defamation suit on Eenadu Andhra Jyothi

‘సెకీ’తో విద్యుత్తు కొనుగోలు ఒప్పందంపై ఆ మీడియాల్లో వాస్తవాల వక్రీకరణ  

నాపై ప్రచురించిన, ప్రసారం చేసిన కథనాలను తొలగించేలా వాటిని ఆదేశించండి

బేషరతుగా క్షమాపణలు చెప్పి ప్రముఖంగా ప్రచురించేలా ఆదేశాలివ్వండి

ఢిల్లీ హైకోర్టును అభ్యర్ధించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

జగన్‌ పరువు నష్టం దావాపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు 

ఈనాడు, ఆంధ్రజ్యోతికి సమన్లు.. ఆ కథనాలు, పోస్టులు తొలగించే వ్యవహారంలో నోటీసులు  

ఈ ఉత్తర్వుల తర్వాత ఏ కథనాలు ప్రచురించినా తెలిసే ప్రచురించినట్లు భావిస్తామన్న కోర్టు

తదుపరి విచారణ ఈ నెల 16కి వాయిదా 

అది.. కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం 

సెకీ నుంచి అత్యంత చౌకగా యూనిట్‌ రూ.2.49కే సౌర విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం 

ప్రత్యేక ప్రోత్సాహకం కింద అంతర్రాష్ట్ర పంపిణీ చార్జీల నుంచి సైతం సెకీ మినహాయింపు 

సెకీ ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.. ఇందులో మూడో పార్టీ ప్రమేయం లేదు 

దీనివల్ల 25 ఏళ్లలో ఖజానాకు రూ.లక్ష కోట్లకుపైగా ఆదా.. అతి తక్కువ ధరకే సౌర విద్యుత్‌ 

రైతులకు నిరాటంకంగా ఉచిత విద్యుత్తు అందించేలా చర్యలు తీసుకున్నాం 

ఆ నేరారోపణల్లో ఎక్కడా నాకు లంచం ఇచ్చినట్లుగానీ.. నేను తీసుకున్నట్లుగానీ లేదు 

తప్పుడు కథనాలతో నా హక్కులను హరించారు 

పరువు నష్టం దావాలో న్యాయస్థానానికి నివేదించిన వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) నుంచి సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ప్రచురించిన తప్పుడు, దురుద్దేశపూ­ర్వక కథనాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం దావాపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. 

తప్పుడు కథనాలు ప్రచురించిన, ప్రసారం చేసిన ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పబ్లిషర్, దాని ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు, ఆమోద పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పబ్లిషర్, దాని ఎడిటర్‌ ఎన్‌.రాహుల్‌ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. తనపై ప్రచురించిన, ప్రసా­రం చేసిన తప్పుడు కథనాలను, ఆర్టికల్స్, పోస్టులు, వీడియోలు, పోస్టులను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్‌ అనుబంధ పిటిషన్‌లో కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలకు న్యాయ­స్థానం నోటీసులు జారీ చేసింది. 

అంతేకాక ఇకపై అలాంటి తప్పుడు కథనాలు ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్‌ అభ్యర్థనను పరిగణ­నలోకి తీసుకున్న హైకోర్టు, ఆ మేరకు ఈనాడు, ఆంధ్రజ్యోతికి నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇస్తూ జారీ చేసిన ఈ ఉత్తర్వుల తరువాత మీరు ఏ కథ­నాలు ప్రచురించినా, ప్రసారం చేసినా వాటిని కోర్టు ఉత్తర్వుల గురించి తెలిసీ ప్రచురించినట్లుగానే భావి­స్తామని ఈనాడు, ఆంధ్రజ్యోతికి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్రమోణియమ్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు.


రూ.100 కోట్లకు పరువు నష్టం దావా
సౌర విద్యుత్‌ ఒప్పందం కొనుగోళ్లలో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన, ప్రసారం చేసిన తప్పుడు, అసత్య కథనాలపై వైఎస్‌ జగన్‌ ఢిల్లీ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు. తనపై ప్రచురించిన, ప్రసారం చేసిన తప్పుడు కథనాలను, ఆర్టికల్స్, పోస్టులు, వీడియోలు, పోస్టులను తొలగించేలా ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఆదేశించాలని దావాలో కోరారు. 

తనకు కలిగిన పరువు నష్టానికి రూ.వంద కోట్లు చెల్లించేలా ఆదేశించాలని కోరారు. ఇకపై తన విషయంలో ఎలాంటి తప్పుడు, అసత్య, దురుద్దేశపూర్వక కథనాలు ప్రచురించకుండా, ప్రకటనలు ఇవ్వకుండా, నిందారోపణలు చేయకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఆదేశిస్తూ శాశ్వత నిషేధ ఉత్తర్వులు జారీ చేయాలని దావాలో కోర్టును అభ్యర్థించారు. 

తనపై తప్పుడు కథనాలను ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతూ, దానిని ప్రముఖంగా ప్రచురించేలా, ప్రసారం చేసేలా ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఆదేశించాలని దావాలో హైకోర్టును అభ్యర్థించారు. తనపై ప్రచురించిన, ప్రసారం చేసిన కథనాలు, ఆర్టికల్స్, పోస్టులు, వీడియోలు, ట్వీట్లు, ఇతర లింకులను గూగుల్‌ దృష్టికి తెచ్చిన వెంటనే వాటిని తొలగించేలా ఆ సంస్థకు సైతం ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

జగన్‌ పరువు నష్టం దావాపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు

జగన్‌ ప్రస్తావన ఎక్కడా లేదు
ఈ పరువు నష్టం దావాపై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. వైఎస్‌ జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దయాన్‌ కృష్ణన్, న్యాయవాదులు అమిత్‌ అగర్వాల్, సాహిల్‌ రావిన్, రాహుల్‌ కుక్రేజా వాదనలు వినిపించారు. సెకీ నుంచి సౌర విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంలో జగన్‌మోహన్‌రెడ్డికి ముడు­పులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచు­రించిన, ప్రసారం చేసిన కథనాలు నిరాధారమైనవ­న్నారు. 

రాజకీయ కారణాలతో ఉద్దేశపూర్వకంగా ఈ తప్పుడు కథనాలను ప్రచురించారన్నారు. యూఎస్‌ కోర్టులో దాఖలు చేసిన నేరారోపణలను ఉటంకిస్తూ తప్పుడు కథనాలను ప్రచురించారని తెలిపారు. ఆ నేరారోపణల్లో ఎక్కడా జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావన గానీ, ఆయనకు ముడుపులు ఇచ్చినట్లు­గానీ, ఆయన తీసుకున్న­ట్లుగా గానీ లేనే లేదని వారు కోర్టు దృష్టికి తెచ్చారు. 

ఈ వ్యవహారంలో యూఎస్‌ కోర్టు నుంచి జగన్‌ ఎలాంటి నోటీసు అందుకోలేదని తెలిపారు. అయినా కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి తమ కథనాల్లో జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావన తెస్తూ తప్పుడు కథనాలు ప్రచురించాయని నివేదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయ­మూర్తి జస్టిస్‌ సుబ్రమోణియమ్‌ ప్రసాద్‌... తప్పుడు కథనాలు ప్రచురించిన, ప్రసారం చేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతికి సమన్లు జారీ చేశారు.

దావాలో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..
కేంద్ర ప్రభుత్వ చొరవతోనే సెకీతో ఒప్పందం..
ఈ మొత్తం వివాదం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభు­త్వం, విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు), సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) మధ్య కుదిరిన ఒప్పందానికి సంబంధించినది. వాస్తవానికి ఈ ఒప్పందం కేంద్ర ప్రభుత్వం చొరవతో జరిగింది. ఇందులో మూడో పార్టీ ప్రమేయం లేదు. సెకీ స్వయంగా 15.9.2021న ఈ ఒప్పందం ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఇందులో సెకీ క్రియాశీలకంగా వ్యవహరించింది. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం భారీగా లబ్ధి పొందేందుకు సెకీ అద్భుతమైన ఆఫర్‌ ఇచ్చింది. సెకీ ఆఫర్‌ వల్ల రాష్ట్రానికి కలిగే లాభాలు ఏమిటంటే... రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఇప్పటి వరకు కొన్న సౌర విద్యుత్‌ ధరల కంటే సెకీ అందించే విద్యుత్‌ ధరే అతి తక్కువగా ఉంది. అంతేకాకుండా ఇంటర్‌స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ చార్జీ (ఐఎస్‌టీసీ)­లను కూడా ప్రత్యేక ప్రోత్సాహం కింద 25 ఏళ్ల పాటు మినహాయించింది. దీనివల్ల ఏటా రూ.4,420 కోట్ల చొప్పున 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ.లక్ష కోట్లకుపైనే ఆదా అవుతుంది.

ఆ తప్పుడు కథనాల వెనుక టీడీపీ రాజకీయ ప్రయోజనాలు..
నేను ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే పరమావధిగా నిర్ణయాలు తీసుకున్నా. వాస్తవాలను వక్రీకరిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి నవంబర్‌ 21 నుంచి తప్పుడు కథనాలు వెలువరించడం మొదలు­పెట్టాయి. అమెరికా కోర్టులోని ప్రొసీడింగ్స్‌లో.. నాకు ముడుపులు ఇచ్చినట్లు, నేను తీసుకున్నట్లు పేర్కొన్నారని, సెకీ అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ చార్జీలను మినహాయించలేదని, సెకీతో ఒప్పందాన్ని హడావుడిగా 7 గంటల్లోనే పూర్తి చేశామంటూ తప్పుడు కథనాలను వండి వార్చారు. వాస్తవానికి సెకీతో ఒప్పందంలో ఎలాంటి నేరం జరగలేదు. అమెరికా కోర్టుల్లో దాఖలు చేసిన నేరారోపణలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 

ఆ కోర్టుల్లో జరుగుతున్న ప్రొసీడింగ్స్‌లో ఎక్కడా కూడా నాకు లంచాలు ఇచ్చినట్లుగానీ, నేను తీసుకున్నట్లు గానీ లేదు. అలాగే అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ చార్జీలను సెకీ మినహాయించలేదన్న వాటి కథనాలు అసత్యం. నాపై మోపిన నిందారోపణలు, సాగిస్తున్న దుష్ప్రయో­జనాల వెనుక తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. ఆ తప్పుడు కథనాలపై సామాజిక మాధ్యమాల వేదికగా వైఎస్సార్‌సీపీ  ఖండన కూడా ఇచ్చింది.

రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందం..
అది రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందం. అందులో ఏపీ ప్రభుత్వం, డిస్కంలు, సెకీ మినహా మరెవరూ లేరు. రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత లబ్ధి చేకూర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అందించిన అవకాశాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా విస్మరిస్తుందా? వదులుకుంటుందా? ఒకవేళ ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అలాంటి అవకాశాన్ని వదులుకుంటే అది కచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమే అవుతుంది. 

అంతేకాక అలా వదులుకుంటూ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు రావా? దురుద్దేశాలు ఆపాదించరా? సెకీతో ఒప్పందానికి సంబంధించిన ప్రతిపాదనను అధికారుల కమిటీ క్షుణ్నంగా అధ్యయనం చేసిన అనంతరం సమర్పించిన నివేదిక ప్రకారం మంత్రిమండలి 28.10.2021న ఆమోదించింది. 11.11.2021న ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) సైతం తన ఆమోదాన్ని తెలిపింది. 

ఈ సౌర విద్యుత్‌ ప్రాజెక్టుకు ప్రోత్సాహకం కింద అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ చార్జీలను మినహాయించాలని కేంద్ర విద్యుత్‌ శాఖ 30.11.2021న కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలికి ఆదేశాలిచ్చింది. ఆ తరువాతే 1.12.2021న సెకీతో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో సెకీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు మాత్రమే ఉన్నాయి. ఈ మూడూ మినహా ఈ ఒప్పందంలో మరెవరూ లేరు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్లే ఈ ఒప్పందం కుదిరింది.

టీడీపీ హయాంలో యూనిట్‌ గరిష్టంగా రూ.6.99
నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సౌర విద్యుత్‌ ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నా. ఈ విషయం ఈనాడు, ఆంధ్రజ్యోతిలతో పాటు అందరికీ తెలుసు. 2014–19 మధ్య తెలుగుదేశం పార్టీ హయాంలో సౌర విద్యుత్‌ యూనిట్‌ ధర రూ.6.99 వరకు ఉంది. 

టీడీపీ హయాంలో డిస్కంలు చేసుకున్న విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాల వల్ల పవన విద్యుత్‌ యూనిట్‌ ధర రూ.4.70 నుంచి రూ.4.84 వరకు ఉండేది. నేను సీఎం అయిన తరువాత ఈ ధరలను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు తీసుకున్నా. అందులో భాగంగానే రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా సౌర విద్యుత్‌ కొనుగోలు విషయంలో సెకీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం వల్ల యూనిట్‌ రూ.2.49కే అందే అవకాశం కలిగింది.

యూనిట్‌ రూ.2.49కే అందించేందుకు సెకీ ముందుకొచ్చింది...
రాష్ట్రంలో రైతాంగానికి నిరాటంకంగా 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్తు అందించేందుకు వీలుగా సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. అయితే దానిపై న్యాయ వివాదం నెలకొంది. దీనిపై మేం న్యాయ పోరాటాలు చేశాం. మేం న్యాయ పోరాటంలో ఉండగానే 2021 సెప్టెంబర్‌ 15న సెకీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. 

రాష్ట్ర చరిత్రలో తక్కువ ధరకే సౌర విద్యుత్‌ను యూనిట్‌ రూ.2.49కే అందించేందుకు సెకీ ముందుకొచ్చింది. ఇçప్పటి వరకు కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో కెల్లా ఇదే అతి తక్కువ ధర. దీనివల్ల వచ్చే 25 ఏళ్ల పాటు నిరాటంకంగా సౌర విద్యుత్‌ అందుతుంది. రాష్ట్రంలో రైతులకు మేలు చేస్తూ దూరదృష్టితో ప్రభుత్వం చేపట్టిన చర్యలను అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వం సైతం లేఖ రాసింది.

వారు రాసినవేవీ యూఎస్‌ కోర్టు నేరారోపణల్లో లేవు...
యూఎస్‌ కోర్టులో జరిగిన లీగల్‌ ప్రొసీడింగ్స్‌ను ఈనాడు, ఆంధ్రజ్యోతి వక్రీకరించి నాపై తప్పుడు, అవాస్తవ కథనాలను ప్రచురించాయి. నాపై తప్పుడు నిందారోప­ణలు మోపారు. వారు రాసిన తప్పుడు కథనాల్లోని అంశాలేవీ యూఎస్‌ కోర్టులో దాఖలైన నేరారోపణల్లో లేవు.

నా కుటుంబం పట్ల వారి శతృత్వ భావాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి
ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు, అసత్య కథనాలు నా పట్ల, నా కుటుంబం పట్ల వారికున్న శతృత్వ భావాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. గత 20 ఏళ్లుగా వారు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రయోజనాలను కాపా­డుతూ వస్తున్నారు. 

ఇదే సమయంలో నా పట్ల ఎలాంటి దాపరికం లేని తీవ్ర వ్యతిరేక భావాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. సౌర విద్యుత్‌ కొనుగోలుకు సంబంధించిన వాస్తవాలు ప్రజా బాహుళ్యంలో ఉన్నప్పటికీ వారు అసత్యాలు, నిరాధార ఆరోపణలతో తప్పుడు కథనాలు ప్రచురించారు. వీటి వెనుక విస్తృత రాజకీయ అజెండా ఉండేందుకు ఆస్కారం ఉంది. వారికి ఇప్ప­టికే లీగల్‌ నోటీసులు కూడా ఇచ్చా. 

బేషరతుగా క్షమాపణలు చెబుతూ, మొదటి పేజీలో దానిని ప్రముఖంగా ప్రచురించాలని సూచించినా వారు తప్పుడు కథనాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇతరుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరికీ హక్కు లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ టుడే నెట్‌వర్క్‌ తప్పుడు కథనాలను ప్రచురించడం, ప్రసారం చేయడం ద్వారా రాజ్యాంగం నాకు కల్పించిన హక్కులకు విఘాతం కలిగించాయి. ఆ కథనాలు నా జీవితానికి, హుందాతనానికి భంగం కలిగించాయి.

సమగ్ర అధ్యయనం తర్వాతే ఒప్పందం
రూ.2.49కే యూనిట్‌ చొప్పున విద్యుత్‌ సరఫరా చేస్తామని 2021 సెప్టెంబర్‌ 15న సెకీ నుంచి లెటర్‌ వచ్చింది. ముందే నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్‌ 16న కేబినెట్‌ మీటింగ్‌ ఉన్నందున సెకీ ప్రతిపాదనను టేబుల్‌ అజెండాగా చేర్చి మంత్రివర్గ సహచరులతో చర్చించారు. అయితే ఆ కేబినెట్‌ మీటింగ్‌లో నిర్ణయా­లేమీ తీసుకోలేదు. ఆమోదాలు తెలప­లేదు. 

కేవలం సెకీ నుంచి వచ్చిన లెటర్‌లో పేర్కొన్న అంశాలపై లోతుపాతులను అధ్యయనం చేసి వచ్చే కేబినెట్‌ సమావేశం నాటికి ప్రతిపాద­నలు సిద్దం చేయాలని ఆదే­శించారు. దీనిపై విద్యుత్‌ శాఖ అధికారుల కమిటీ ఏకంగాæ 40 రోజుల పాటు అధ్య­యనం చేసిన అనంతరం 2021 అక్టోబర్‌ 25వ తేదీన నివేదిక సమర్పించింది. అక్టోబర్‌ 28న కేబినెట్‌ దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏపీఈఆర్సీ నుంచి కూడా ఆమోదం తీసు­కోవాలని సూచిస్తూ తీర్మానం చేసింది. 

నవంబర్‌ 11న ఏపీఈ­ఆర్సీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో డిసెంబర్‌ 1వ తేదీన సెకీతో ఒప్పందంపై ఏపీ ప్రభుత్వం, డిస్కమ్‌లు సంతకాలు చేశాయి. ఎక్కడా థర్డ్‌ పార్టీ ఎవరూ లేరు. ఇది కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన పవర్‌ సేల్‌ అగ్రిమెంట్‌. ఈ అగ్రిమెంట్‌ 3.2 క్లాజ్‌లో 25 ఏళ్లపాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మి­షన్‌ ఛార్జీలు నుంచి మినహాయింపు వర్తిస్తుందని స్పష్టంగా ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement