గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ పేరు మార్మోగుతోంది. బొగ్గు, పెట్రోల్, డీజిల్ లాంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని శాస్త్రవేత్తలు పదే పదే చెబుతున్నారు. సౌర, పవన, అలల శక్తి లాంటి పునరుత్పాదక ఇంధనాల వాడకం పెంచాలంటున్నారు. మరి ఆ ప్రకారమే విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే సహారా ఎడారిని సౌర విద్యుత్ ఉత్పత్తికి వాడుకుంటే? ఎడారంతా సోలార్ ప్యానళ్లు పెట్టేసి కరెంటు ఉత్పత్తి చేస్తే? కనీసం కొంతభాగంలోనైనా ప్యానళ్లు పెడితే? ఇసుకలో ఇదంతా అయ్యే పనేనా? ఒకవేళ అయితే ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయగలం? ఎన్ని దేశాలకు సరిపోతుంది? లాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ మీ కోసం..
ఇంతకీ ఎడారి విస్తీర్ణమెంత?
ప్రపంచంలోని అతి పెద్ద ఎడారి సహారా. ఆఫ్రికాలోని 11 దేశాల్లో విస్తరించి ఉంది. ఒకవేళ సహారా కనుక దేశమైతే ప్రపంచంలోనే ఐదో పెద్ద దేశమయ్యేది. ఈ ఏడారి విస్తీర్ణం 90 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే మన ఇండియాకు మూడింతలు పెద్దది. బ్రెజిల్ కన్నా పెద్దది. చైనాతో పోలిస్తే కాస్త చిన్నది.
చదవండి: గంటల్లో దిగిపోయినా మళ్లీ స్వీడన్ పీఠంపై ఆండర్సన్
ప్రపంచానికంతా 254 చ.కి.మీ.లు చాలు
సహారా ఎడారి ప్రతి సంవత్సరం 22 బిలియన్ గిగావాట్స్ అవర్ సూర్యశక్తిని గ్రహిస్తుంది. అంటే ప్రతి చదరపు మీటర్‌కు 2 వేల నుంచి 3 వేల కిలోవాట్ అవర్ శక్తి అన్నమాట. సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే జర్మనీ దేశం పూర్తి విద్యుత్ అవసరాలు తీర్చడానికి సహారాలోని కేవలం 45 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని సూర్యశక్తిని వాడుకుంటే చాలు. యూరప్‌లోని 25 దేశాల విద్యుత్ అవసరాలకు 110 చదరపు కిలోమీటర్లు చాలు. ఇక ప్రపంచమంతా కావాల్సిన విద్యుత్ కోసం 254 చదరపు కిలోమీటర్ల ప్రాంతం సరిపోతుంది. 2005 నాటి నడిన్ రీసెర్చ్‌లో ఇవన్నీ వివరించారు. 350 వాట్ల సోలార్ ప్యానళ్లను సహారాలోని 1.2 శాతం ప్రాంతంలో ఏర్పాటు చేయాలంటే 5,100 కోట్ల ప్యానళ్లు కావాలి. ఈ 1.2 శాతం న్యూ మెక్సికో ప్రాంతం విస్తీర్ణంతో సమానం.
మొత్తం సహారానే ప్యానళ్లతో కప్పేస్తే?
సహారాలో ఏర్పాటు చేసిన ప్యానళ్లన్నీ 20 శాతం సామర్థ్యం వరకే పని చేసినా ఏడాదికి 2,760 ట్రిలియన్ కిలోవాట్ అవర్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రపంచ అవసరాలకు మాత్రం ఏడాదికి 23 ట్రిలియన్ల కిలోవాట్ అవర్ విద్యుత్ సరిపోతుంది. సహారాతో చాలా పెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు కదా. నిపుణులు కూడా సహారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అంచనా వేశారు. ప్రస్తుత ప్రపంచ అవసరాలకు 4 రెట్లు ఎక్కువగా ఎడారి ఉత్పత్తి చేయగలదని అంటున్నారు.
చదవండి: Parag Agrawal: సీఈవోగా చిన్నవయస్సే! కానీ..
మరి ప్యానళ్లు పెట్టడానికి ఇబ్బందేంటి?
ఇంతలా సహారాను వాడుకోవచ్చు కదా? మరి విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అంటే తొలి కారణం రాజకీయపరమైన చిక్కులు. రెండోది భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేసే సోలార్ ప్యానళ్ల నిర్వహణ కష్టంతో కూడున్నపని. ఇక ఎడారిలో రోడ్లు వేయడమంటే సాహసమే. అయితే ప్రయత్నాలు మాత్రం మొదలయ్యాయి. సహారా వ్యాప్తంగా సోలార్ జనరేటర్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని డిసర్టిక్ ఫౌండేషన్ ప్రతిపాదించింది. కానీ అందుకు ముందడుగు పడలేదు. అయితే సహారాలో రోడ్లు వేయడం మాత్రం ఆ ఫౌండేషన్ మొదలుపెట్టింది.
మనతో పాటు సహారాకూ ప్లస్సే..
సహారాలో భారీ స్థాయిలో సోలార్ ప్యానళ్లు, గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే టర్బైన్లు ఏర్పాటు చేస్తే ఇంకో ఉపయోగం కూడా ఉందండోయ్! మనం గనక ఈ పని చేస్తే ఆ ప్రాంతంలో వర్షపాతం ఎక్కువవుతుందంట. వృక్ష సంపద కూడా 20 శాతం పెరుగుతుందట.
– సాక్షి, సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment