africa country
-
ఆఫ్రికాపై చైనాకు ఎందుకంత ప్రేమ?
ఆఫ్రికా దేశాలపై చైనా ఎన్నో వరాలు కురిపించింది. 51 బిలియన్ డాలర్ల ఆర్థిక సహకారం, పది లక్షల ఉద్యోగాలు, సైనిక శిక్షణ... ఇలా అనేక హమీల వరదను పారించింది. ఒక వైపు చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంతో సాగుతోంది. మరో వైపు అమెరికా సహా పశ్చిమ దేశాలతో భౌగోళిక, రాజకీయ ఘర్షణలు, వ్యాపార ఆంక్షలు ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్ కుంచించుకుపోతోంది. చైనా దౌత్యానికి, ఆర్థిక వ్యవస్థకు ఊపు తేవటానికి ఆఫ్రికా దోహదకారి అవుతుందని భావించింది. ఈ పూర్వరంగంలో ‘బీజింగ్ సమ్మిట్ ఆఫ్ ది ఫోరమ్ ఆన్ చైనా–ఆఫ్రికా కోఆపరేషన్’ (ఎఫ్ఓసీఏసీ) అనే సదస్సును మూడు రోజుల పాటు (2024,సెప్టెంబర్ 4–6) చైనాలో నిర్వహించింది. కోవిడ్ అనంతరం చైనా నిర్వహించిన అతి పెద్ద కార్యక్రమం ఇదే.ఈ సదస్సు ద్వారా ప్రధానంగా రెండు లక్ష్యాలను సాధించాలని భావించింది. మొదటిది గ్లోబల్ సౌత్‌లో తన ప్రభావాన్ని పెంచుకోవటం. రెండోది చైనా ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేలా చూసుకోవటం. గ్లోబల్ సౌత్ లో ఆఫ్రికా అత్యంత ముఖ్యమైంది. అందుకే ఈ ఖండం మనసు గెలుచుకోవటానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సర్వశక్తులు వెచ్చించారు. ఆఫ్రికాలో మొత్తం దేశాలు 54 ఉంటే 53 దేశాలు సదస్సులో పాల్గొన్నాయి. 2023 నాటికి, అమెరికాను అధిగమించి 282 బిలి యన్ డాలర్లతో చైనా ఆఫ్రికాకు అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది. ఆఫ్రికా మినరల్స్, ఫ్యూయల్స్, మెటల్స్ చైనాకు ఎగుమతి అవుతున్నాయి. మరో వైపు ఆఫ్రికా రుణదాతల్లో చైనా అగ్రగామిగా ఉంది. గత 20 ఏళ్లలో అది అందించిన రుణం 696 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు ప్రకటించిన 51 బిలియన్ డాలర్లు (360 బిలియన్ యువాన్లు) పెద్ద ఎక్కువేం కాదు అంటున్న వాళ్లూ ఉన్నారు. ఇందులో రుణాలుగా కొంత (210 బిలి యన్ల యువాన్లు), సహాయంగా కొంత (80 బిలియన్ల యువాన్లు), పెట్టుబడులుగా కొంత (70 బిలియన్ల యువాన్లు) అందించాలని బీజింగ్ నిర్ణయించింది. ఇదంతా వచ్చే మూడేళ్ల కాలంలో చేయాలనేది చైనా ఆలోచన. జిన్‌పింగ్ తన ప్రసంగంలో ఎక్కడా రుణం అన్న మాట వాడకుండా జాగ్రత్తగా ఆర్థిక సాయం అన్న పదాన్ని మాత్రమే ఉపయోగించారు. ఆఫ్రికాతో కేవలం వాణిజ్య సంబంధాలను మాత్రమే కాదు, రాజకీయంగా, ఆర్థికంగా సంబంధాలను ఉన్నతీకరించుకోవాలని భావిస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ‘మనం అంతా కలిసి రైళ్లు, రోడ్లు, వంతెనలు, స్కూళ్లు, హాస్పిటళ్లు, స్పెషల్ ఎకనమిక్ జోన్లు నిర్మించుకున్నాం. ఈ ప్రాజెక్టులు ఎంతో మంది ప్రజల జీవితాలను, వారి అదృష్టాన్ని మార్చి వేశాయి’ అని జిన్‌పింగ్ గుర్తు చేశారు. ఈ దఫా ఆర్థిక సాయం డాలర్లలో కాకుండా చైనా యువాన్ల రూపంలో ఉంటుందని బీజింగ్ ప్రకటించింది. చైనా కరెన్సీని అంతర్జాతీయం చేయాలనేది దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం. ఆఫ్రికాలో పది లక్షల మందికి ఉద్యోగాలను కల్పిస్తారు. ఇందుకోసం కనెక్టివిటీని పెంచేందుకు ప్రత్యే కంగా 30 ప్రాజెక్టులను చేపడతారు. మరో వెయ్యి చిన్న ప్రాజెక్టులను చేపడతారు. 140 మిలియన్ డాలర్లతో సైన్యా నికి ఆర్థిక సహకారం, శిక్షణ అందిస్తారు. ఆరువేల మంది సైనికులకు, వెయ్యి మంది పోలీసు అధికారులకు శిక్షణ అందిస్తారు. ఆఫ్రికా పారిశ్రామికీకరణకు అవరోధంగా నిలిచిన ఇంధన సమస్యను కూడా పరిష్కరిస్తామని చైనా హామీ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి అతి తక్కువ అభివృద్ధి సాధించిన దేశాలుగా పేర్కొన్న 33 ప్రాంతాల్లో ఓపెన్ మార్కెట్లు ప్రారంభిస్తామని (జీరో టారిఫ్‌లతో) ప్రకటించింది. ఇవన్నీ బీజింగ్‌కు ఉపయోగపడే అంశాలు. మా సంగతి కూడా ఆలోచించండి అని అడిగారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామ్‌ఫోసా. బదులుగా ‘వాణిజ్య మిగులు 64 బిలియన్ డాలర్లు ఉంది. మీ దగ్గర నుంచి రా మెటీరియల్, డెయిరీ ప్రోడక్ట్స్ మేము కొనుగోలు చేస్తాం’ అని చైనా హామీ ఇచ్చింది. అంతే తప్ప మరే రకమైన ప్రకటనలు చేయలేదు. అప్పుల ఊబిలోకి ఆఫ్రికా దేశాలు రుణమాఫీ చేసి తమకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని చాలా ఆఫ్రికా దేశాలు కోరుతున్నాయి. మైనింగ్, ఇంధన రంగంలో ప్రైవేటు పెట్టుబడుల పోర్టుఫోలియోను వికేంద్రీకరించమని కోరుతున్నాయి. ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ పెద్ద ప్రాజెక్టులను నిభాయించగలిగే పరిస్థితిలో లేదు. చైనా చేపట్టే మౌలిక వసతుల ప్రాజెక్టులు ఆఫ్రికా దేశాలను అప్పుల ఊబిలోకి లాగేస్తు న్నాయి. దాదాపు ఆరు బిలియన్ డాలర్ల అప్పుతోజాంబియా ఎగవేతదారుల్లో ఉంది. అలాగే ఘనా, ఆంగోలాలు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఇదే విషయాన్ని సదస్సులో చెప్పారు. ‘ఆఫ్రికా రుణాలనేవి భరించలేని దశకు చేరాయి, ఆర్థిక సుస్థిరత దెబ్బతింటోంది’ అని ప్రకటించారు. బీజింగ్ మాత్రం దీనికి స్పందించలేదు. రుణామాఫీ కాదు, కనీసం రుణాలను పునర్వ్యవస్థీకరిస్తుందని ఆఫ్రికా దేశాలు ఆశించాయి. కానీ చైనాది పెట్టుబడి దారు మనస్తత్వం. అది తన వ్యాపార ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తుంది. మరి తాజా హామీలు ఆఫ్రికా దేశాలపై ఏ రకమైన ప్రభావం చూపుతాయో భవిష్యత్తులో కానీ ప్రపంచానికి అర్థం కాదు.– డా‘‘ పార్థసారథి చిరువోలు ‘ సీనియర్ జర్నలిస్ట్ -
బొట్స్వానా గనిలో 2,492 క్యారెట్ల వజ్రం
గబొరోన్(బొట్స్వానా): ఆఫ్రికా దేశం బొట్స్వానా గనిలో అతిపెద్దదిగా భావిస్తున్న వజ్రం లభ్యమైంది. తమ గనుల్లో ఇంతటి భారీ వజ్రం దొరకడం ఇదే మొదటిసారని బొట్స్వానా ప్రభుత్వం తెలిపింది. దీని బరువు 2,492 కేరట్లని వివరించింది. కెనడాకు చెందిన లుకారా డైమండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే కరోవె గనిలో ఈ అరుదైన ముడి వజ్రం లభించింది. ఎక్స్‌రే సాంకేతికతను ఉపయోగించి అధిక నాణ్యతతో, చెక్కు చెదరకుండా ఉన్న ఈ వజ్రాన్ని కనుగొన్నట్లు లుకారా తెలిపింది. ఇంత పెద్ద వజ్రం లభించడం వందేళ్లలో ఇదే మొదటిసారని పేర్కొంది. గతంలో 1905లో దక్షిణాఫ్రికాలోని ఓ గనిలో కల్లినాన్ డైమండ్ బయటపడింది.3,106 కేరట్లున్న ఆ భారీ వజ్రాన్ని 9 భాగాలు చేశారు. వాటిలో కొన్ని భాగాలను బ్రిటిష్ రాజవంశీకుల ఆభరణాల్లో వాడారు. అంతకుపూర్వం, 1800లో బ్రెజిల్లో అతిపెద్ద బ్లాక్ డైమండ్ దొరికింది. అయితే, ఇది భూ ఉపరితలంలోనే లభించింది. ఇది ఉల్కలో భాగం కావొచ్చని నమ్ముతున్నారు. బొట్స్వానా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రాల ఉత్పత్తిదారు. మొత్తం 20 శాతం వరకు వాటా బొట్స్వానా గనులదే. ఇటీవలి సంవత్సరాల్లో ఇక్కడి గనుల్లో భారీ వజ్రాలు లభించాయి. 2019లో కరోవె గనిలోనే 1,758 కేరట్ల సెవెలో వజ్రాన్ని తవ్వి తీశారు. దీనిని ఫ్రాన్సుకు చెందిన ప్రఖ్యాత ఫ్యాషన్ సంస్థ లూయిస్ విట్టన్ కొనుగోలు చేసింది. అయితే, ధరను వెల్లడించలేదు. కరోవె గనిలోనే 1,111 కేరట్ల లెసెడి లా రొనా అనే డైమండ్ లభ్యమైంది. దీనిని, బ్రిటిష్ ఆభరణాల సంస్థ 2017లో 5.30 కోట్ల డాలర్ల(సుమారు రూ.440 కోట్లు)కు దక్కించుకుంది. -
మండేలా పార్టీకి ఎందుకీ ఎదురుదెబ్బ?
1994లో స్థాపితమైనప్పటినుంచీ 30 ఏళ్లపాటు అప్రతిహతంగా దక్షిణాఫ్రికాను ఏలిన ‘ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్’(ఏఎన్సీ) తొలిసారి పూర్తి మెజారిటీని అందుకోలేకపోయింది. ఇప్పటికీ అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ అదే అయినప్పటికీ(400కు 159) క్రమంగా తగ్గుతున్న ఓట్ల శాతం ప్రజల్లో పెరుగుతున్న నిరాదరణకు రుజువు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ నెల్సన్ మండేలా నెలకొల్పిన ఈ పార్టీ ప్రభుత్వాల అధినేతల అవినీతి, అసమర్థ పాలన ప్రజల్లో అసంతృప్తికి కారణమయ్యాయి. ఒకప్పుడు మొత్తం ఆఫ్రికాలోనే మొదటి స్థానంలో ఉండిన ఆర్థిక వ్యవస్థ నైజీరియా తర్వాత రెండవ స్థానానికి పడిపోయింది. ఈ పరిణామాలను గమనించినప్పుడు ఈరోజున ఏఎన్సీ తన మెజారిటీని కోల్పోవటంలో ఆశ్చర్యం కనిపించదు.దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) పార్టీ ఓటమి ఆశ్చర్యంగా తోచవచ్చు గానీ, ముందుగా ఊహించనిదేమీ కాదు. శ్వేతజాతీయుల వర్ణ వివక్ష వ్యవస్థ (అపార్థీడ్) మీద సుదీర్ఘ ఉద్యమం విజయవంతమైన తర్వాత 1994లో అధికారానికి వచ్చిన ఏఎన్సీ, తన వైఫల్యాల కారణంగా ప్రజాదరణను కోల్పోవటం ఒక దశాబ్ద కాలమైనా తిరగకముందే మొదలైంది. ఇప్పటికి సరిగ్గా 16 సంవత్సరాల క్రితం 2003 జూన్‌లో నేను దక్షిణాఫ్రికాను సందర్శించే నాటికే ఈ అసంతృప్తి వివిధ వర్గాలలో కనిపించసాగింది. కానీ ఆ తర్వాత మరొక అయిదేళ్లు జీవించి ఉండిన నెల్సన్ మండేలా గానీ, తన ఉద్యమ సహచరులుగా పోరాటాలు జరిపి ప్రభుత్వ నాయకత్వాలలోకి వచ్చినవారు గానీ పరిస్థితిని సరిదిద్దలేదు. దేశాధ్యక్ష పదవిని 1999లో వదులుకున్న మండేలా ఏకాంత జీవితంలోకి వెళ్ళిపోగా, ప్రభుత్వాలను నడిపినవారు అవినీతి మార్గాలను పట్టారు. ఉద్యమ కాలంలో హామీ ఇచ్చిన జనరంజక పాలనను, సంస్కరణలను కాగితాలపై తప్ప ఆచరణలో చూపించింది స్వల్పం. అందుకు ప్రజల నిరసన కనిపించటం కొంతకాలం క్రితమే మొదలుకాగా, ఇపుడది 30 ఏళ్ళలో మొదటిసారిగా అసలు మెజారిటీయే కోల్పోయింది.దక్షిణాఫ్రికా గురించి బయటికి బాగా ప్రచారం పొందిన సమస్య వర్ణ వివక్ష. అటు వివక్ష తెల్లవారు పాలించిన ఇతర ఆఫ్రికన్ వలస దేశాలలో కూడా ఉండగా, ఇక్కడ దానిని చట్టబద్ధంగా వ్యవస్థీకృతం చేశారు. అదే సమయంలో దేశంలోని భూమి, గనులు, పరిశ్రమలు, వ్యాపారాలు, ఉద్యోగాల వంటి సమస్త వనరులు తెల్లవారి అధీనంలోనే ఉండిపోయాయి. అటువంటి స్థితిలో, అపార్థీడ్ వ్యవస్థ రద్దయినప్పటికీ ఈ వనరులపై తెల్లవారి ఆధిపత్యం పోయి, ఆర్థిక సంస్కరణలు జరిగి, నల్లవారికి తమ జనాభాకు తగినట్లు అవకాశాలు లభిస్తే తప్ప పేదరికం పోదు, అపార్థీడ్ వ్యతిరేక పోరాటానికి నిజమైన సార్థకత లభించదు. వాస్తవానికి ఉద్యమకాలంలో ఈ లక్ష్యాలన్నీ ఏఎన్సీ అజెండాలో ఉన్నవే. ఆ పార్టీపై తమ సొంత ఆలోచనలతో పాటు వివిధ ప్రజాస్వామిక దేశాలు, సోషలిస్టు దేశాల అభ్యుదయ భావాల ప్రభావాలు ఉండేవి. కానీ అధికారానికి వచ్చిన అనంతరం ఎక్కువకాలం గడవకుండానే పరిస్థితులు మరొకవిధంగా మారసాగాయి. నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే మండేలా స్వయంగా అధ్యక్షునిగా ఉండిన 1994–99 కాలంలో సైతం ప్రభుత్వ బాధ్యులలో పలువురి తీరు మారటం, మండేలా తన మెతకదనం వల్ల నిస్సహాయునిగా మిగిలిపోవటం జరిగింది. ఆయన తన శేష జీవితం అయిదేళ్లు ఒంటరిగా గడపటం అందువల్లనేనన్నది కొందరి పరిశీలకుల అభిప్రాయం. అపార్థీడ్ వ్యవస్థ రద్దయిన మాట నిజం. అందువల్ల నల్లవారు స్వేచ్ఛగా తిరగగలగటంతో పాటు బీచ్‌లు, క్లబ్బులు, హోటళ్ల వంటి ప్రదేశాలలోకి వారి ప్రవేశంపై నిషేధాలు తొలగిపోయాయి. పోలీస్ నిర్భంధాలు లేని కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నల్లవారి పిల్లలకు విద్యావకాశాలు లభించటం మొదలైంది. కొంత వైద్యం, చదువులతో పాటు ఉద్యోగాలలో రిజర్వేషన్లు వచ్చాయి. నల్లవారికి తెల్లవారు తమ వ్యాపారాలలో చిన్న చిన్న ఉద్యోగాలు ఇవ్వసాగారు. అపార్థీడ్తో పాటు తమ రాజ్యం పోయిందనీ, అందువల్ల కొన్ని రాజీలు తప్పవనీ వారికి అర్థమైంది. నల్లవారు కూడా కొద్దిస్థాయిలో వ్యాపారాలు మొదలుపెట్టారు. పెద్ద హోదా గల ప్రభుత్వ ఉద్యోగాలు కొన్నింటిని తెల్లవారికి, నల్లవారికి మధ్య రొటేట్ చేయసాగారు. ఈ మార్పులు నల్లవారిలో ఒక చిన్న మధ్యతరగతి సృష్టికి అవకాశం కల్పించాయి. ఈ విధంగా వారికి క్రమంగా ఆత్మవిశ్వాసం రావటం మొదలైంది. అపార్థీడ్ రద్దువల్ల ఇప్పుడు రాజకీయాధికారమంతా తమదే కావటం సరేసరి. ఇటువంటివి సానుకూల పరిణామాలని వేరే చెప్పనక్కరలేదు. కానీ ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయాలు మూడున్నాయి. ఒకటి, యథాతథంగా నల్లవారి సమస్యలతో, వారి జనాభాతో పోల్చినపుడు ఈ మార్పులు చాలా స్వల్పం. రెండవది, మొదట చెప్పుకున్నట్లు ఆర్థిక వనరులన్నీ, ఆర్థిక కార్యకలాపాలన్నీ అత్యధిక భాగం తెల్లవారి అధీనంలోనే ఉండిపోవటం. ఉదాహరణకు నేనక్కడ ఉండినపుడు చూసిన అధికారిక ప్రచురణల ప్రకారం, గ్రామీణ భూములు నల్లవారి నుంచి తెల్లవారి చేతిలోకి అపార్థీడ్ రద్దయిన తర్వాత సైతం ఇంకా బదిలీ అవుతూనే ఉన్నాయి. నల్లవారికి తమ వ్యవసాయం కోసం ఎటువంటి సహాయాలు లభించకపోవటం, గ్రామాలలో ఇతరత్రా ఉపాధి అవకాశాలు సన్నగిల్లటంతో వారు భూములు అమ్ముకొని, పొట్ట పోసుకునేందుకు నగరాలకు తరలిపోతున్నారు. నేను స్టెల్లెన్ బాష్ అనే నగరం వద్ద గల ఒక షాంటీ టౌన్‌ను చూశాను. నగరంలో నల్లవారు రోజంతా పనులు చేసుకుని సాయంత్రానికి వెళ్లిపోయి ఉండే ప్రాంతాన్ని షాంటీ టౌన్ అంటారు. అక్కడ అన్ని నివాసాలు, ఆ ప్రాంతం చుట్టు కట్టే కంచె అన్నీ ఇనుప రేకులతోనే. కొన్ని వేలమంది నివసిస్తారు. స్టెల్లెన్ బాష్‌కు దక్షిణాఫ్రికాలో గాంధీజీ కార్యకలాపాలతోనూ సంబంధం ఉండేది. ఇటువంటి టౌన్‌షిప్‌లు గతంలోనూ ఉండగా, అపార్థీడ్ ముగిసిన తర్వాత ఇంకా పెరుగుతున్నాయి. నల్లవారు అధికారానికి వచ్చిన తర్వాత, టూరిజానికి ప్రోత్సాహం పేరిట ఒక్కొక్క కంపెనీకి వేలకు వేల హెక్టార్లు స్థానిక తెల్లవారికి, విదేశీయులకు దీర్ఘకాలపు లీజుకు అప్పగించారు. ఆ భూములన్నీ స్థానిక తెగలవి. వారు భూములు కోల్పోయి ఈ కంపెనీలలో కూలీలుగా పని చేస్తున్నారు. ఇది నా ప్రత్యక్షానుభవం. దేశానికి ఉత్తర ప్రాంతాలలో విస్తారమైన భూములు ఆ విధంగా నల్లవారికి నష్టమయ్యాయి. నేను చూసిన ఉదాహరణ ఇండియాకు చెందిన విజయ్ మాల్యా 20,000 ఎకరాలకు పైగా భూమిలో నిర్వహిస్తున్న మబూలా లాడ్జ్ రిసార్ట్. దాని వివరాలు అనేకం ఉన్నా ఇక్కడ అప్రస్తుతం. ఇక మూడవ విషయం, ప్రభుత్వ నేతల అదుపులేని అవినీతి. అది చాలదన్నట్లు అసమర్థ పాలన. వీరంతా ఉద్యమ కాలపు అగ్రనేతలే. రెండు ఉదాహరణలు చూడండి. స్వయంగా మండేలా భార్య విన్నీ మండేలా ఉద్యమకాలం నుంచే అవినీతికి పాల్పడి, అపార్థీడ్ రద్దు తర్వాత జైలుకు వెళ్లింది. ప్రస్తుత అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు ముందు అధ్యక్షుడిగా ఉండిన జేకబ్ జుమా కూడా జైలుకు వెళ్లినవాడే. ఇతర పదవులలో ఉన్నవారి సంఖ్యకు లెక్కలేదు. ప్రస్తుత అధ్యక్షుడు వ్యక్తిగతంగా అవినీతిపరుడు కాకున్నా ఆ సమస్యను అరికట్టలేదు. మొత్తంమీద వీరందరి అసమర్థ పాలన కారణంగా విద్యుత్, మంచినీళ్లు, విద్యావైద్యాలు, తీవ్ర నిరుద్యోగం, వివిధ పౌర సదుపాయాల సమస్యలు పెరగటం మొదలైంది. ఆర్థిక వ్యవస్థ కూడా బలహీనపడుతుండటం వల్ల, ఒకప్పుడు మొత్తం ఆఫ్రికాలోనే మొదటి స్థానంలో ఉండిన వ్యవస్థ కొన్నేళ్ల క్రితమే నైజీరియా తర్వాత రెండవ స్థానానికి పడిపోయింది. ఈ పరిణామ క్రమాలను గమనించినపుడు ఈరోజున ఏఎన్సీ తన మెజారిటీని కోల్పోవటంలో ఆశ్చర్యం కనిపించదు. ఏఎన్సీ ఓట్లశాతం 57.5 (2019) నుంచి 40.2కు తగ్గింది. 400 బలం గల నేషనల్ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 230 నుంచి 159కు పడిపోయింది. కనుక ఇతరులతో పొత్తు తప్పదు. రెండవ స్థానంలో గల డెమోక్రటిక్ అలయన్స్ తెల్లవారిది. అందువల్ల విధానాల సమస్య ఉంటుంది. మూడవ స్థానంలో గల మాజీ అధ్యక్షుడు జేకబ్ జుమా(ఏఎన్సీ తరఫున దేశాధ్యక్షుడిగా ఉండిన జుమా మద్దతుతో కొత్త పార్టీ ఏర్పడింది) అవినీతి కేసులో జైలుకు వెళ్లినవాడు. అనగా, ప్రభుత్వ ఏర్పాటుకు పొత్తులు కూడా సమస్య కానున్నాయన్నమాట. అంతిమంగా తేలుతున్నది దక్షిణాఫ్రికా ప్రజల సమస్యలు సమీప భవిష్యత్తులో తీరేవి కాదని!టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
సహారా ఎడారిలో సౌర విద్యుత్ ఉత్పత్తి .. ఇదంతా అయ్యే పనేనా?
గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ పేరు మార్మోగుతోంది. బొగ్గు, పెట్రోల్, డీజిల్ లాంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని శాస్త్రవేత్తలు పదే పదే చెబుతున్నారు. సౌర, పవన, అలల శక్తి లాంటి పునరుత్పాదక ఇంధనాల వాడకం పెంచాలంటున్నారు. మరి ఆ ప్రకారమే విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే సహారా ఎడారిని సౌర విద్యుత్ ఉత్పత్తికి వాడుకుంటే? ఎడారంతా సోలార్ ప్యానళ్లు పెట్టేసి కరెంటు ఉత్పత్తి చేస్తే? కనీసం కొంతభాగంలోనైనా ప్యానళ్లు పెడితే? ఇసుకలో ఇదంతా అయ్యే పనేనా? ఒకవేళ అయితే ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయగలం? ఎన్ని దేశాలకు సరిపోతుంది? లాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ మీ కోసం.. ఇంతకీ ఎడారి విస్తీర్ణమెంత? ప్రపంచంలోని అతి పెద్ద ఎడారి సహారా. ఆఫ్రికాలోని 11 దేశాల్లో విస్తరించి ఉంది. ఒకవేళ సహారా కనుక దేశమైతే ప్రపంచంలోనే ఐదో పెద్ద దేశమయ్యేది. ఈ ఏడారి విస్తీర్ణం 90 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే మన ఇండియాకు మూడింతలు పెద్దది. బ్రెజిల్ కన్నా పెద్దది. చైనాతో పోలిస్తే కాస్త చిన్నది. చదవండి: గంటల్లో దిగిపోయినా మళ్లీ స్వీడన్ పీఠంపై ఆండర్సన్ ప్రపంచానికంతా 254 చ.కి.మీ.లు చాలు సహారా ఎడారి ప్రతి సంవత్సరం 22 బిలియన్ గిగావాట్స్ అవర్ సూర్యశక్తిని గ్రహిస్తుంది. అంటే ప్రతి చదరపు మీటర్‌కు 2 వేల నుంచి 3 వేల కిలోవాట్ అవర్ శక్తి అన్నమాట. సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే జర్మనీ దేశం పూర్తి విద్యుత్ అవసరాలు తీర్చడానికి సహారాలోని కేవలం 45 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని సూర్యశక్తిని వాడుకుంటే చాలు. యూరప్‌లోని 25 దేశాల విద్యుత్ అవసరాలకు 110 చదరపు కిలోమీటర్లు చాలు. ఇక ప్రపంచమంతా కావాల్సిన విద్యుత్ కోసం 254 చదరపు కిలోమీటర్ల ప్రాంతం సరిపోతుంది. 2005 నాటి నడిన్ రీసెర్చ్‌లో ఇవన్నీ వివరించారు. 350 వాట్ల సోలార్ ప్యానళ్లను సహారాలోని 1.2 శాతం ప్రాంతంలో ఏర్పాటు చేయాలంటే 5,100 కోట్ల ప్యానళ్లు కావాలి. ఈ 1.2 శాతం న్యూ మెక్సికో ప్రాంతం విస్తీర్ణంతో సమానం. మొత్తం సహారానే ప్యానళ్లతో కప్పేస్తే? సహారాలో ఏర్పాటు చేసిన ప్యానళ్లన్నీ 20 శాతం సామర్థ్యం వరకే పని చేసినా ఏడాదికి 2,760 ట్రిలియన్ కిలోవాట్ అవర్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రపంచ అవసరాలకు మాత్రం ఏడాదికి 23 ట్రిలియన్ల కిలోవాట్ అవర్ విద్యుత్ సరిపోతుంది. సహారాతో చాలా పెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు కదా. నిపుణులు కూడా సహారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అంచనా వేశారు. ప్రస్తుత ప్రపంచ అవసరాలకు 4 రెట్లు ఎక్కువగా ఎడారి ఉత్పత్తి చేయగలదని అంటున్నారు. చదవండి: Parag Agrawal: సీఈవోగా చిన్నవయస్సే! కానీ.. మరి ప్యానళ్లు పెట్టడానికి ఇబ్బందేంటి? ఇంతలా సహారాను వాడుకోవచ్చు కదా? మరి విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అంటే తొలి కారణం రాజకీయపరమైన చిక్కులు. రెండోది భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేసే సోలార్ ప్యానళ్ల నిర్వహణ కష్టంతో కూడున్నపని. ఇక ఎడారిలో రోడ్లు వేయడమంటే సాహసమే. అయితే ప్రయత్నాలు మాత్రం మొదలయ్యాయి. సహారా వ్యాప్తంగా సోలార్ జనరేటర్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని డిసర్టిక్ ఫౌండేషన్ ప్రతిపాదించింది. కానీ అందుకు ముందడుగు పడలేదు. అయితే సహారాలో రోడ్లు వేయడం మాత్రం ఆ ఫౌండేషన్ మొదలుపెట్టింది. మనతో పాటు సహారాకూ ప్లస్సే.. సహారాలో భారీ స్థాయిలో సోలార్ ప్యానళ్లు, గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే టర్బైన్లు ఏర్పాటు చేస్తే ఇంకో ఉపయోగం కూడా ఉందండోయ్! మనం గనక ఈ పని చేస్తే ఆ ప్రాంతంలో వర్షపాతం ఎక్కువవుతుందంట. వృక్ష సంపద కూడా 20 శాతం పెరుగుతుందట. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
బెంగళూరులో పోలీసుల కస్టడీలో ఆఫ్రికన్ మృతి
యశవంతపుర: డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన ఆఫ్రికన్ పౌరుడు అనుమానాస్పద రీతిలో మరణించాడు. జేసీ నగర పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఆఫ్రికన్ పౌరున్ని పోలీసులు అరెస్ట్ చేసి 5 గ్రాములు ఎండీఎంఏ అనే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకుని లాకప్‌లో నిర్బంధించారు. అతనికి ఆరోగ్యం బాగాలేదని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చనిపోయాడు. దీంతో పెద్దసంఖ్యలో ఆఫ్రికన్ పౌరులు పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు పోలీసులపై దాడికి దిగడంతో లాఠీచార్జి చేశారు. మృతుని వివరాలు వెల్లడించలేదు. వీసా కాలపరిమితి ముగిసినా బెంగళూరులో అక్రమంగా ఉంటూ పట్టుబడిన 38 మందిలో అతడు కూడా ఒకడని పోలీసులు తెలిపారు. -
============
-
విదేశీ నోట గ్రేటర్ మాట
సాక్షి,సిటీబ్యూరో: మహానగరానికి విదేశీ విద్యార్థులు వెల్లువెత్తుతున్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం అనేక దశాబ్దాలుగా నగరానికి పలు దేశాల నుంచి వలస వస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఏటా సుమారు పదివేల మంది విదేశీ విద్యార్థులు నగరంలోని ఉస్మానియా, జేఎన్టీయూ విశ్వవిద్యాలయ కళాశాలలు, అనుబంధ కాలేజీల్లో చేరుతుండడం విశేషం. ఇలా సుమారు 63 దేశాలకు చెందిన విద్యార్థులు నగరంలో విద్యనభ్యసిస్తున్న వారిలో ఉన్నారంటే ఇక్కడి చదువుపై వారికున్న మక్కువను అర్థం చేసుకోవచ్చు. వీరిలో అత్యధికులు ఆఫ్రికా ఖండానికి చెందిన 50కి పైగా దేశాల వారే కావడం విశేషం. ఇక అమెరికా, కెనడా, యూకే, చైనాకుచెందిన విద్యార్థులు వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ కోర్సులకు డిమాండ్ అధికం ఇక్కడి ఉస్మానియా, జేఎన్టీయూ పరిధిలోని క్యాంపస్ కళాశాలలతో పాటు అనుబంధ కళాశాలలు, డీమ్డ్ వర్సిటీలు విదేశీ విద్యాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని ఉద్యోగ అవకాశాలున్న ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తి చేసుకున్నవారికి వెంటనే జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో తేలికగా ఉద్యోగవకాశాలు లభిస్తుండడంతో పలువురు విదేశీ విద్యార్థులు ఈ కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా ఎమ్మెస్సీ, ఎంటెక్, బీబీఏ, బీసీఏ, ఇంజినీరింగ్, బీఎస్సీ కోర్సుల్లో ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు కూడా ఈ కోర్సులు బాట వేస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో నగరంలోని పలు కళాశాలలు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండే ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. విదేశీ విద్యార్థుల సంఖ్య ఇలా.. గతేడాది వివిధ కోర్సులు అభ్యసించేందుకు నగరానికి వలస వచ్చినవారిలో అత్యధికంగా సోమాలియా దేశానికి చెందిన విద్యార్థులే ఉన్నారు. ఆ దేశం నుంచి 430 మంది విద్యార్థులు నగరంలోని పలు కళాశాలల్లో వివిధ కోర్సుల్లో సీట్లు పొందారు. ఇక ఆఫ్గనిస్తాన్‌కు చెందిన 182 మంది, యెమన్ నుంచి 168 మంది, సూడాన్‌కు చెందిన 131 మంది, ఇరాక్ నుంచి 107 మంది, జిబుటీకి చెందిన 59 మంది, అమెరికా నుంచి 14 మంది, యూకే నుంచి ముగ్గురు, కెనడా నుంచి ఐదుగురు, చైనాకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు నగరంలో చదువుకొనేందుకు రావడం గమనార్హం. తక్కువ ఖర్చే కారణం దక్కన్ పీఠభూమిలో అత్యతంత అనుకూల భౌగోళిక, శీతోష్ణస్థితులున్న గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యనభ్యసించేందుకు విదేశీ విద్యార్థులు అత్యధికంగా మక్కువ చూపుతున్నారు. అంతర్జాతీయంగా పలు దేశాలతో పాటు.. మన దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి కళాశాలల్లో ఫీజులు, జీవనవ్యయం మధ్యతరగతి వారికి సైతం అత్యంత అందుబాటులో ఉన్నాయి. దీంతో పలువురు నగరానికి వలస వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తేలింది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అత్యధికంగా ఉండే ఇంటిగ్రేటెడ్ కోర్సులు మరిన్ని అందుబాటులోకి వస్తే విదేశీ విద్యార్థులు నగరానికి క్యూ కడతారని అంచనా వేస్తున్నారు. -
సూడాన్
ఖండం: ఆఫ్రికా వైశాల్యం: 18,86,068 చదరపు కిలోమీటర్లు జనాభా: 3,72,89,406 (తాజా అంచనాల ప్రకారం) రాజధాని: ఖార్టూమ్ ప్రభుత్వం: డామినంట్ పార్టీ ఫెడరల్ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ కరెన్సీ: సూడాన్ పౌండ్ భాషలు: అరబిక్, ఇంగ్లిష్, నూబియన్, స్థానిక భాషలు మతం: 73 శాతం ఇస్లాం, 18 శాతం ఆటవిక తెగలు, 9 శాతం క్రైస్తవులు వాతావరణం: జనవరి 15 నుండి 32 డిగ్రీలు, జూన్ 26 నుండి 41 డిగ్రీలు. పంటలు: పత్తి, ఖర్జూరం, వేరుశనగ, నువ్వులు, గోధుమ, బీన్స్, జొన్నలు. పరిశ్రమలు: చమురుశుద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంటు స్వాతంత్య్రం: 1956, జనవరి 1 సరిహద్దులు: ఈజిప్టు, లిబియా, చాద్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, జైరీ, ఉగాండా, కెన్యా, ఇథియోపియా, ఎర్రసముద్రం. చరిత్ర ఆఫ్రికా ఖండంలో సూడాన్ అతిపెద్ద స్వతంత్ర దేశం. వైశాల్యంలో పెద్దగా ఉన్నా, నైలు నది ప్రవహిస్తున్నా దేశంలో ఎప్పుడూ ఆహారకొరత, కరువు, ఆర్థికమాంద్యం, రాజకీయ అస్థిరత మొదలైనవి దేశాన్ని పట్టి కుదిపేస్తూ ఉన్నాయి. ఉత్తర సూడాన్‌లో ముస్లింలు, దక్షిణ సూడాన్‌లో నలుపు ఆఫ్రికన్లు మధ్య భాగంలో స్థానిక తెగల ప్రజలు... ఇలా అనేక రకాల సాంప్రదాయాల ప్రజలు ఈ దేశంలో నివసిస్తూ తమ స్వంత అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఒక్కొక్కసారి యుద్ధాలు చేస్తున్నారు. ఒకప్పుడు సూడాన్‌లో రెండు ప్రత్యేకమైన నాగరికతలు వెల్లివిరిసాయి. ఒకటి నూబియా, రెండవది కుశ్. ఆరవ శతాబ్దంలో సూడాన్ ప్రాంతాన్ని పరిపాలించిన మూడు గొప్ప సామ్రాజ్యాలు క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నాయి. వారు దేశంలోకి ఇస్లాం మతం ప్రవేశించకుండా నిరోధించారు. అయితే 18వ శతాబ్దంలో ఈజిప్టు రాజు ముహమ్మద్ అలీ సూడాన్ ఉత్తర భాగాన్ని ఆక్రమించుకొని సూడాన్‌లో ఇస్లాం మతాన్ని వ్యాప్తిచేశాడు. ఇస్మాయిల్ పాషా అనే రాజు సూడాన్‌లో అన్ని భాగాలనూ ఆక్రమించి ఆ ప్రాంతానికి బ్రిటిష్ జాతీయుడిని గవర్నర్ జనరల్‌గా నియమించాడు.క్రీ.శ.1881లో దైవదూత అనబడే ముహమ్మద్ అహమది సూడాన్‌లో ఇస్లాం మతాన్ని పటిష్టం చేసి దేశంలో ఉన్న విదేశీయులను బయటికి తరిమేశాడు. అయితే 1898లో బ్రిటిషర్లు ఇక్కడి రాజులను ఓడించి దేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. చివరికి 1956లో దేశానికి స్వతంత్రం సిద్ధించింది. పరిపాలనా పద్ధతి దేశపాలన రాష్ట్రపతి చేతుల్లో ఉంటుంది. దేశంలో 18 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు. ఈ రాష్ట్రాలను తిరిగి 133 జిల్లాలుగా విభజించారు. ఆ 18 రాష్ట్రాలు... అల్ జజీరా, అల్ ఖదారిఫ్, బ్లూనైల్, రివర్నైత్, వైట్‌నైల్, సెంట్రల్ డర్ఫర్, ఈస్ట్ డర్ఫర్, నార్త్ డర్ఫర్, సౌత్ డర్ఫర్, వెస్ట్ డర్ఫర్, కస్సాలా, కార్టూమ్, నార్తర్న్ రెడ్సీ, నార్త్ ఖుర్దుఫాన్, సౌత్ ఖుర్దూప్రాన్, వెస్ట్ ఖుర్దూఫ్రాన్, సెన్నార్లు. ప్రజలు-సంస్కృతి సూడాన్ దేశంలో దాదాపు 597 తెగల ప్రజలు ఉన్నారు. వీరు 400కు పైగా భాషలను మాట్లాడతారు. అధికశాతం ఇస్లాం మత ప్రజలే కాబట్టి వీరంతా అరబ్బీ భాషను మాట్లాడతారు. పురుషులు సాధారణంగా పాదాల వరకు ఉండే పొడవాటి స్కర్ట్లాంటి దుస్తులు ధరిస్తారు. దీనిని జులాబియా అంటారు. మహిళలు కూడా ఇలాంటి స్కర్టునే ధరిస్తారు. అలాగే తలను కప్పుతూ మరో గుడ్డ చుట్టుకుంటారు. ముఖాన్ని పూర్తిగా కప్పుకోరు. వీరు రంగురంగుల దుస్తులు ధరిస్తారు. పురుషులు తలకు ప్రత్యేకమైన తలపాగా ధరిస్తారు. యువతీ యువకులు మాత్రం షర్టు, ప్యాంటు ధరిస్తారు. పంటలు-పరిశ్రమలు దేశ దక్షిణ భాగంలో పత్తి పంట అధికంగా పండుతుంది. వేరుశనగ, నువ్వులు, గోధుమ, జొన్న, బీన్స్ పంటలు కూడా ఈ దక్షిణ భాగంలోనే అధికంగా పండుతాయి. ఉత్తరభాగంలో నూబియన్, సహరా ఎడారులు ఉన్నాయి. ఇక్కడే నైలు నది ఈజిప్టు దేశంలోకి ప్రవేశిస్తుంది. సూడాన్ దేశంలో గమ్ అరబిక్ ప్రపంచంలోనే అధిక స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. దీనిని మందులు, ఇంకు తయారీలో ఉపయోగిస్తారు. వేరుశనగ కూడా బాగా పండుతుంది.బెంటియు ప్రాంతంలో చమురు, సహజ వాయువులను కనుగొన్నారు. దేశంలో సిగరెట్లు, భవన నిర్మాణ పరికరాలు, పెట్రోలియం ఉత్పత్తులు, చక్కెర, దుస్తుల పరిశ్రమలు ఉన్నాయి. ఆహారం సూడాన్ దేశస్థులు సాధారణంగా గోధుమ, జొన్న పిండితో చేసిన దళసరిగా వుండే రొట్టెలను తింటారు. బ్రెడ్డు, గొర్రె, మేక మాంసం అధికంగా తింటారు. ఫుల్ మెడమిస్ అనే ఆహారం దేశ వ్యాప్తంగా వాడుకలో ఉంది. ఇక దేశంలో బీరు, బ్రాందీ లాంటి మత్తుపానీయాలు పూర్తిగా నిషిద్ధం. అయితే ఖర్జూరపండ్లతో తయారుచేసే పానీయం చాలా మంది తాగుతారు. కిస్రా, అసీదా, గురస్సా, అనే పేర్లతో బ్రెడ్డు తయారుచేస్తారు. ఖార్టూమ్ నగరం దేశ రాజధాని ఖార్టూమ్ నగరం వైట్‌నైల్, బ్లూనైల్ నదుల మధ్య ప్రదేశంలో ఉంది. ఈ రెండు నదులు విక్టోరియా సరస్సు నుండి ప్రారంభమవుతాయి. అయితే బ్లూనైల్ జన్మస్థలం ఇథియోపియా. ఈ రెండు నదులు అల్ మోగ్రాన్ అనే ప్రదేశంలో కలుస్తాయి. ఒకప్పటి ఈజిప్టు రాజు ఈ ఖార్టూమ్ నగరాన్ని అభివృద్ధిపరిచాడు. జులై, ఆగస్ట్ నెలలలో ఇక్కడ బాగా వేడిగా ఉంటుంది. నగరంలో పారే నైలునది మీద అనేక బ్రిడ్జిలు నిర్మించారు. నగరం చుట్టూ ఉన్న మరో నాలుగు నగరాలు నెలకొని ఉన్నాయి. వీటిని నైలునది బ్రిడ్జిలు కలుపుతూ ఉంటాయి. నగరంలో ఉన్న నేషనల్ మ్యూజియంలో సూడాన్ దేశ గత చరిత్రను తెలియజేసే వస్తువులు, పరికరాలు ఆనవాళ్ళతో నిండి ఉంది. ప్యాలెస్ మ్యూజియం, రాష్ట్రపతి భవనం చూడదగిన నిర్మాణాలు. గ్రేట్ మాస్క్‌తో పాటు ఓమ్ డుర్మన్లో జరిగే ఒంటెల మార్కెట్ చూడదగినవి. చూడదగిన ప్రదేశాలు మేరో పిరమిడ్స్ పిరమిడ్లు అనగానే ఈజిప్టు గుర్తొస్తుంది. అయితే దేశంలో ఉన్న మేరో నగరంలో కూడా అద్భుతమైన పిరమిడ్లు ఉన్నాయి. ఈ నగరం నైలు నది తీరంలో ఉంది. ఈ నగరం ఒకప్పుడు కుష్ రాజులకు రాజధానిగా వెలుగొందింది. ఇక్కడ 200కు పైగా పిరమిడ్లు ఉన్నాయి. వీటిని మూడు గ్రూప్‌లుగా విబజించారు. ఈ పిరమిడ్లను నూబియన్ పిరమిడ్లు అనికూడా అంటారు. నూబియా ప్రాంతంలో కట్టారు కాబట్టి అలా పిలుస్తారు. ఈ ప్రాంతం ఒకప్పుడు ఈజిప్టు దేశంలో భాగంగా ఉండేది. పిరమిడ్లు కట్టడం అనే సాంప్రదాయం ఈజిప్టు రాజుల వంశంలో ఉండింది. అందుకే ఈ ప్రాంతంలో కూడా పిరమిడ్ల నిర్మాణం ఆ కాలంలో జరిగింది. ప్రస్తుతం చాలా పిరమిడ్లు శిథిల దశలో ఉన్నాయి. ఈ పిరమిడ్లు ఆరు నుండి ముప్పై ఫీట్ల ఎత్తులో నిర్మించబడ్డాయి. ఈ పిరమిడ్లలో ఆ కాలం నాడు మరణించిన వారి శవంతోపాటు ఎంతో బంగారం, ధనం ఉంచేవారు. వాటికోసం ఈ పిరమిడ్లను కొల్లగొట్టి ఆ ధనాన్ని దొచుకుపోయారు. గెబెల్ బర్కల్ పిరమిడ్లు గెబెల్ బర్కల్ ఒక చిన్న కొండ. ఇది దేశ ఉత్తర భాగంలో ఉంది. ఇది నైలు నది తీరంలో ఉంది. ఇక్కడ 200కు పైగా పిరమిడ్లు ఉన్నాయి. వీటిని కుష్ పిరమిడ్లు అని కూడా అంటారు. ఈజిప్టులో ఉన్న పిరమిడ్ల కన్నా ఇవి పొట్టిగా ఉంటాయి. ఈ ప్రాంతంలో ఈ పిరమిడ్లతోపాటు 13 దేవాలయాలు, మూడు రాజభవనాలు ఉన్నాయి. వీటిని 18వ శతాబ్దంలో కనుగొన్నారు. ఇవన్నీ పూర్వం ఈజిప్టు రాజులు నిర్మించినవే. ఈజిప్టు రాజు టుట్ మోస్-ఐఐఐ వీటిని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతాన్ని తప్పక సందర్శిస్తారు. పోర్ట్ సూడాన్ ఈ ఓడరేవు సూడాన్ ఎర్ర సముద్ర తీరంలో ఉంది. 1909లో ఈ ఓడరేవును నిర్మించారు. అందమైన బీచ్‌లు ఇక్కడ ఉన్నాయి. స్వచ్ఛమైన నీళ్ళు, రకరకాల జలచరాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడి నుండి అనేక రకాల ఆహార ధాన్యాలు ఇక్కడి నుండి ఎగుమతి అవుతాయి. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం హజ్‌యాత్రకు వెళ్ళే వారికి ఈ పోర్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడే పెట్రోలియం శుద్ధి కేంద్రం ఉంది. ఇక్కడి నుండి పెట్రోలియం ఉత్పత్తులు నేరుగా రాజధాని ఖార్టూమ్ చేరడానికి పైపులైను నిర్మించబడింది. ఇక్కడ వాతావరణం అంతా దాదాపు ఎడారి వాతావరణాన్ని పోలి ఉంటుంది. అయితే సముద్రంలో ఈత కొట్టడానికి, స్కూబా డ్రెవింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఎర్ర సముద్రాన్ని చూడడానికి ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. మృతనగరం-మెరోవే మెరోవే నగరం ఇసుక కొండలకు ప్రసిద్ధి. పూర్వకాలంలో ఈ ప్రాంతంలోనే విశాలమైన శ్మశానం ఉండేది. దానితో ఇప్పుడు ఈ నగరానికి మృత నగరంగా పేరు వచ్చింది. ఈ నగరం రాజధాని ఖార్టూమ్ నుండి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే అమున్ దేవాలయం ఉంది. అలాగే పిరమిడ్ల ఎన్‌క్లోజర్ ఉంది. నైలునది మీద నిర్మించిన గొప్ప బ్రిడ్జి ఒక పెద్ద ఆకర్షణ. వేలసంఖ్యలో పర్యాటకులు ఈ బ్రిడ్జిని చూడడానికి వస్తుంటారు. ఇక్కడ ఇసుక కొండలతోబాటు పిరమిడ్లు కూడా ఉన్నాయి. పిరమిడ్లను చూడాలంటే ఈ మెరోవె ప్రాంతానికి తప్పక రావాల్సిందే. -
తుంగభద్ర తీరంలో అరుదైన అతిథులు
కర్ణాటక (బళ్లారి) : బళ్లారి జిల్లా హువినహడగలి నియోజకవర్గ పరిధిలో తుంగభద్ర నదీ తీరాన ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన విదేశీ వలస పక్షులు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. హువినహడగలి సమీపంలోని బన్నిగోళ గ్రామ పరిసరాల్లోని తుంగభద్ర నదీ పరివాహకంలోని డ్యాం బ్యాక్ వాటర్ ఉన్న ప్రాంతంలో రంగు రంగుల పక్షులు వేలాదిగా తరలిరావడంతో ఆ ప్రాంతం అంతా ఎంతో అందంగా కనిపిస్తోంది. రాజహంస అనే పక్షి గులాబీ, తెలుపు, నలుపు తదితర అందమైన రంగులు కలిగి ఉండటంతో ఎగురుతూ ఉన్నప్పుడు ఎంతో అందంగా కనిపించడంతో వాటిని చూడడానికి పెద్ద ఎత్తున పక్షిప్రేమికులు తరలి వస్తున్నారు. దాదాపు 15 వేల నుంచి 20 వేలకు పైగా రాజహంస అనే విదేశీ పక్షులు తరలి వచ్చినట్లు తెలుస్తోంది. వేలాది పక్షులు ఒకేసారి తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో విహరిస్తుండటంతో ఎంతో చూడముచ్చటగా ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అందమైన రాజహంస విదేశీ పక్షులు ఆకాశంలో విహరిస్తున్నప్పుడు రంగురంగుల దృశ్యాలు కనిపిస్తుండటంతో వాటిని చూస్తూ పక్షి ప్రేమికులు తనివి తీరా ఆనందిస్తున్నారు. ప్రప్రథమంగా వేలాది విదేశీ పక్షులు ఈ ప్రాంతానికి తరలి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. రాజహంస అనే పక్షులు ఆఫ్రికా దేశానికి చెందిన వలస పక్షులు. ఇవి ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేటి సరస్సు, ఒడిసా, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా ఇదే సమయంలో అప్పుడప్పుడు కనిపిస్తాయని పలువురు పక్షి ప్రేమికులు తెలిపారు. వేలాది అందమైన రాజహంస పక్షులు తరలి రావడంతో వాటిని కొందరు పట్టుకుని తినడానికి ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నందువల్ల సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేస్తూ అందమైన పక్షులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.