ఆఫ్రికా దేశాలపై చైనా ఎన్నో వరాలు కురిపించింది. 51 బిలియన్ డాలర్ల ఆర్థిక సహకారం, పది లక్షల ఉద్యోగాలు, సైనిక శిక్షణ... ఇలా అనేక హమీల వరదను పారించింది. ఒక వైపు చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంతో సాగుతోంది. మరో వైపు అమెరికా సహా పశ్చిమ దేశాలతో భౌగోళిక, రాజకీయ ఘర్షణలు, వ్యాపార ఆంక్షలు ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్ కుంచించుకుపోతోంది. చైనా దౌత్యానికి, ఆర్థిక వ్యవస్థకు ఊపు తేవటానికి ఆఫ్రికా దోహదకారి అవుతుందని భావించింది. ఈ పూర్వరంగంలో ‘బీజింగ్ సమ్మిట్ ఆఫ్ ది ఫోరమ్ ఆన్ చైనా–ఆఫ్రికా కోఆపరేషన్’ (ఎఫ్‌ఓసీఏసీ) అనే సదస్సును మూడు రోజుల పాటు (2024,సెప్టెంబర్ 4–6) చైనాలో నిర్వహించింది. కోవిడ్ అనంతరం చైనా నిర్వహించిన అతి పెద్ద కార్యక్రమం ఇదే.
ఈ సదస్సు ద్వారా ప్రధానంగా రెండు లక్ష్యాలను సాధించాలని భావించింది. మొదటిది గ్లోబల్ సౌత్‌లో తన ప్రభావాన్ని పెంచుకోవటం. రెండోది చైనా ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేలా చూసుకోవటం. గ్లోబల్ సౌత్ లో ఆఫ్రికా అత్యంత ముఖ్యమైంది. అందుకే ఈ ఖండం మనసు గెలుచుకోవటానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సర్వశక్తులు వెచ్చించారు. ఆఫ్రికాలో మొత్తం దేశాలు 54 ఉంటే 53 దేశాలు సదస్సులో పాల్గొన్నాయి. 2023 నాటికి, అమెరికాను అధిగమించి 282 బిలి యన్ డాలర్లతో చైనా ఆఫ్రికాకు అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది. ఆఫ్రికా మినరల్స్, ఫ్యూయల్స్, మెటల్స్ చైనాకు ఎగుమతి అవుతున్నాయి. మరో వైపు ఆఫ్రికా రుణదాతల్లో చైనా అగ్రగామిగా ఉంది.
గత 20 ఏళ్లలో అది అందించిన రుణం 696 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు ప్రకటించిన 51 బిలియన్ డాలర్లు (360 బిలియన్ యువాన్లు) పెద్ద ఎక్కువేం కాదు అంటున్న వాళ్లూ ఉన్నారు. ఇందులో రుణాలుగా కొంత (210 బిలి యన్ల యువాన్లు), సహాయంగా కొంత (80 బిలియన్ల యువాన్లు), పెట్టుబడులుగా కొంత (70 బిలియన్ల యువాన్లు) అందించాలని బీజింగ్ నిర్ణయించింది. ఇదంతా వచ్చే మూడేళ్ల కాలంలో చేయాలనేది చైనా ఆలోచన. జిన్‌పింగ్ తన ప్రసంగంలో ఎక్కడా రుణం అన్న మాట వాడకుండా జాగ్రత్తగా ఆర్థిక సాయం అన్న పదాన్ని మాత్రమే ఉపయోగించారు. ఆఫ్రికాతో కేవలం వాణిజ్య సంబంధాలను మాత్రమే కాదు, రాజకీయంగా, ఆర్థికంగా సంబంధాలను ఉన్నతీకరించుకోవాలని భావిస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ‘మనం అంతా కలిసి రైళ్లు, రోడ్లు, వంతెనలు, స్కూళ్లు, హాస్పిటళ్లు, స్పెషల్ ఎకనమిక్ జోన్లు నిర్మించుకున్నాం.
ఈ ప్రాజెక్టులు ఎంతో మంది ప్రజల జీవితాలను, వారి అదృష్టాన్ని మార్చి వేశాయి’ అని జిన్‌పింగ్ గుర్తు చేశారు. ఈ దఫా ఆర్థిక సాయం డాలర్లలో కాకుండా చైనా యువాన్‌ల రూపంలో ఉంటుందని బీజింగ్ ప్రకటించింది. చైనా కరెన్సీని అంతర్జాతీయం చేయాలనేది దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం. ఆఫ్రికాలో పది లక్షల మందికి ఉద్యోగాలను కల్పిస్తారు. ఇందుకోసం కనెక్టివిటీని పెంచేందుకు ప్రత్యే కంగా 30 ప్రాజెక్టులను చేపడతారు. మరో వెయ్యి చిన్న ప్రాజెక్టులను చేపడతారు. 140 మిలియన్ డాలర్లతో సైన్యా నికి ఆర్థిక సహకారం, శిక్షణ అందిస్తారు.
ఆరువేల మంది సైనికులకు, వెయ్యి మంది పోలీసు అధికారులకు శిక్షణ అందిస్తారు. ఆఫ్రికా పారిశ్రామికీకరణకు అవరోధంగా నిలిచిన ఇంధన సమస్యను కూడా పరిష్కరిస్తామని చైనా హామీ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి అతి తక్కువ అభివృద్ధి సాధించిన దేశాలుగా పేర్కొన్న 33 ప్రాంతాల్లో ఓపెన్ మార్కెట్లు ప్రారంభిస్తామని (జీరో టారిఫ్‌లతో) ప్రకటించింది. ఇవన్నీ బీజింగ్‌కు ఉపయోగపడే అంశాలు. మా సంగతి కూడా ఆలోచించండి అని అడిగారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామ్‌ఫోసా. బదులుగా ‘వాణిజ్య మిగులు 64 బిలియన్ డాలర్లు ఉంది. మీ దగ్గర నుంచి రా మెటీరియల్, డెయిరీ ప్రోడక్ట్స్ మేము కొనుగోలు చేస్తాం’ అని చైనా హామీ ఇచ్చింది. అంతే తప్ప మరే రకమైన ప్రకటనలు చేయలేదు.
అప్పుల ఊబిలోకి ఆఫ్రికా దేశాలు
రుణమాఫీ చేసి తమకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని చాలా ఆఫ్రికా దేశాలు కోరుతున్నాయి. మైనింగ్, ఇంధన రంగంలో ప్రైవేటు పెట్టుబడుల పోర్టుఫోలియోను వికేంద్రీకరించమని కోరుతున్నాయి. ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ పెద్ద ప్రాజెక్టులను నిభాయించగలిగే పరిస్థితిలో లేదు. చైనా చేపట్టే మౌలిక వసతుల ప్రాజెక్టులు ఆఫ్రికా దేశాలను అప్పుల ఊబిలోకి లాగేస్తు న్నాయి. దాదాపు ఆరు బిలియన్ డాలర్ల అప్పుతోజాంబియా ఎగవేతదారుల్లో ఉంది.
అలాగే ఘనా, ఆంగోలాలు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఇదే విషయాన్ని సదస్సులో చెప్పారు. ‘ఆఫ్రికా రుణాలనేవి భరించలేని దశకు చేరాయి, ఆర్థిక సుస్థిరత దెబ్బతింటోంది’ అని ప్రకటించారు. బీజింగ్ మాత్రం దీనికి స్పందించలేదు. రుణామాఫీ కాదు, కనీసం రుణాలను పునర్వ్యవస్థీకరిస్తుందని ఆఫ్రికా దేశాలు ఆశించాయి. కానీ చైనాది పెట్టుబడి దారు మనస్తత్వం. అది తన వ్యాపార ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తుంది. మరి తాజా హామీలు ఆఫ్రికా దేశాలపై ఏ రకమైన ప్రభావం చూపుతాయో భవిష్యత్తులో కానీ ప్రపంచానికి అర్థం కాదు.
– డా‘‘ పార్థసారథి చిరువోలు ‘ సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment