బొట్స్‌వానా గనిలో 2,492 క్యారెట్ల వజ్రం | Worlds second largest diamond found in Botswana | Sakshi
Sakshi News home page

బొట్స్‌వానా గనిలో 2,492 క్యారెట్ల వజ్రం

Published Fri, Aug 23 2024 8:24 AM | Last Updated on Fri, Aug 23 2024 8:36 AM

Worlds second largest diamond found in Botswana

గబొరోన్‌(బొట్స్‌వానా): ఆఫ్రికా దేశం బొట్స్‌వానా గనిలో అతిపెద్దదిగా భావిస్తున్న వజ్రం లభ్యమైంది. తమ గనుల్లో ఇంతటి భారీ వజ్రం దొరకడం ఇదే మొదటిసారని బొట్స్‌వానా ప్రభుత్వం తెలిపింది. దీని బరువు 2,492 కేరట్లని వివరించింది. కెనడాకు చెందిన లుకారా డైమండ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నడిచే కరోవె గనిలో ఈ అరుదైన ముడి వజ్రం లభించింది. ఎక్స్‌రే సాంకేతికతను ఉపయోగించి అధిక నాణ్యతతో, చెక్కు చెదరకుండా ఉన్న ఈ వజ్రాన్ని కనుగొన్నట్లు లుకారా తెలిపింది. ఇంత పెద్ద వజ్రం లభించడం వందేళ్లలో ఇదే మొదటిసారని పేర్కొంది. గతంలో 1905లో దక్షిణాఫ్రికాలోని ఓ గనిలో కల్లినాన్‌ డైమండ్‌ బయటపడింది.

3,106 కేరట్లున్న ఆ భారీ వజ్రాన్ని 9 భాగాలు చేశారు. వాటిలో కొన్ని భాగాలను బ్రిటిష్‌ రాజవంశీకుల ఆభరణాల్లో వాడారు. అంతకుపూర్వం, 1800లో బ్రెజిల్‌లో అతిపెద్ద బ్లాక్‌ డైమండ్‌ దొరికింది. అయితే, ఇది భూ ఉపరితలంలోనే లభించింది. ఇది ఉల్కలో భాగం కావొచ్చని నమ్ముతున్నారు. బొట్స్‌వానా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రాల ఉత్పత్తిదారు. మొత్తం 20 శాతం వరకు వాటా బొట్స్‌వానా గనులదే. ఇటీవలి సంవత్సరాల్లో ఇక్కడి గనుల్లో భారీ వజ్రాలు లభించాయి. 2019లో కరోవె గనిలోనే 1,758 కేరట్ల సెవెలో వజ్రాన్ని తవ్వి తీశారు. దీనిని ఫ్రాన్సుకు చెందిన ప్రఖ్యాత ఫ్యాషన్‌ సంస్థ లూయిస్‌ విట్టన్‌ కొనుగోలు చేసింది. అయితే, ధరను వెల్లడించలేదు. కరోవె గనిలోనే 1,111 కేరట్ల లెసెడి లా రొనా అనే డైమండ్‌ లభ్యమైంది. దీనిని, బ్రిటిష్‌ ఆభరణాల సంస్థ 2017లో 5.30 కోట్ల డాలర్ల(సుమారు రూ.440 కోట్లు)కు దక్కించుకుంది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement