జెనీవాలో అరుదైన మూడు వరుసల నెక్లెస్ నవంబర్‌లో వేలం
18వ శతాబ్దికి చెందిన ఈ నగలో 500 వజ్రాలు
అవి గోల్కొండ గనుల్లోవే అయ్యి ఉంటాయని ప్రకటించిన వేలం సంస్థ
గతంలోనూ అధిక ధరలు పలికిన ‘మన వజ్రాలు’
సాక్షి, హైదరాబాద్: ‘అసలు సిసలైన వజ్రం కావాలంటే గోల్కొండ గనుల్లోనే దొరకాలి’ఇది ఒకప్పుడు ప్రపంచం మాట. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విస్తరించిన గోల్కొండ గనుల్లో లభించే వజ్రాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వజ్రం అనగానే గుర్తుకొచ్చే ‘కోహినూర్’ఇక్కడ దొరికిందే. ఇప్పుడు మరోసారి గోల్కొండ వజ్రాల అంశం తెరపైకి వచ్చింది. బ్రిటిష్ రాజకుటుంబం నగల కలెక్షన్లలో భాగంగా ఉన్న 18వ శతాబ్దం నాటి అరుదైన నెక్లెస్ నవంబర్‌లో వేలానికి వస్తోంది.
వేలం నిర్వహణలో ఖ్యాతిగాంచిన సోథెబైస్ జెనీవాలో దీనిని వేలం వేస్తోంది. మూడు వరుసలతో ఉన్న ఈ నెక్లెస్‌లో దాదాపు 500 వజ్రాలున్నాయి. అవి ప్రఖ్యాత గోల్కొండ గనుల నుంచి సేకరించినవే అయ్యి ఉంటాయంటూ తాజాగా వేలం నిర్వహణ సంస్థ సోథేబైస్ ప్రకటించింది.
ఈ నెక్లెస్‌కు వేలంలో 2.8 మిలియన్ డాలర్ల గరిష్ట ధర పలుకుతుందని వేలం సంస్థ అంచనా వేస్తోంది. గోల్కొండ వజ్రాల స్వచ్ఛత ఆధారంగా వాటికి వేలం పాటల్లో అధికంగా ధరలు పలుకుతాయి. దీంతో ఇప్పు డు మరోసారి గోల్కొండ వజ్రాలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గోల్కొండ వజ్రాలు ప్రజలను విపరీతంగా అకట్టుకుంటున్నాయి.
కోహినూర్‌తో..
గోల్కొండ వజ్రాలకు అంతగా ఖ్యాతి రావటానికి కోహినూర్ వజ్రం ప్రధాన భూమిక పోషించింది. ప్రపంచం మొత్తానికి రెండున్నర రోజుల పాటు భోజన ఏర్పాట్లు చేసినందుకు ఎంత ఖర్చవుతుందో కోహినూర్ వజ్రం విలువ అంత ఉంటుందని మొఘల్ చక్రవర్తులు వ్యాఖ్యానించారట. గత పదేళ్లలో కొల్లాపూర్, నారాయణపేటలో జీఎస్‌ఐకి ముడి వజ్రాలుండే కింబర్‌లైట్ డైక్స్ లభించాయి.
ఈ ప్రాంతాల్లో వజ్రాలుంటాయనటానికి ఇది ఓ ఆధారం. మూసీ పరీవాహకంలో కూడా వజ్రాలు భూగర్భంలో ఉన్నాయని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. బ్రిటిష్ పాలన కాలంలో గుంతకల్ సమీపంలోని వజ్రకరూరులో భారీ వజ్రాల గని తవ్వారు. ఇప్పటికీ అక్కడ 90 మీటర్ల లోతుతో భారీ గుంత నీటితో నిండి ఉంటుంది.
» కుతుబ్‌షాహీల కాలంలో వజ్రాల వ్యాపారం ముమ్మరంగా సాగింది. విస్తారంగా గనులు తవ్వి వజ్రాలు వెలికితీశారు. దాదాపు లక్ష మంది కార్మికులు ఈ గనుల్లో పనిచేసేవారట.
» ఈ గనులు స్థానిక సుబేదారుల అధ్వర్యంలో రోజువారీగా లీజుకు తీసుకొని హైదరాబాద్‌లోని వ్యాపారులు వజ్రాలు వెలికి తీసేవారు. ఒక క్యారెట్ కంటే ఎక్కువ బరువు తూగే వజ్రం లభిస్తే రాజుకు చెందుతుంది అన్న విధానం అమలులో ఉండేది. అలా కుతుబ్‌షాహీలు చాలా విలువైన, పెద్ద సైజు వజ్రాలు సొంతం చేసుకున్నారు.
» గోల్కొండ వజ్రాల్లో నైట్రోజన్, బోరాన్ ఉండదు. ఈ కారణంగా వజ్రం అధిక కాంతివంతంగా ఉంటుంది.
» కోహినూర్ తర్వాత అతిపెద్ద వజ్రం నిజాం జాకబ్ వజ్రమే. ఇది 420 క్యారెట్ బరువు ఉండేది.
» గోల్కొండ గనుల నుంచి 12 మిలియన్ క్యారెట్ల వజ్రాలు తవ్వారని బ్రిటిష్ కాలంలో నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికీ గోల్కొండ గనుల ప్రాంతంలో చిన్నసైజు వజ్రాలు లభిస్తూనే ఉన్నాయి.
» గోల్కొండ డైమండ్స్ అన్నీ ఇప్పుడు యూరోపియన్ రాజకుటుంబాల సేకరణలో భాగంగా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇరాన్ ట్రెజరీలో ఉన్నాయి. ఒకటి రెండు నైజాం కలెక్షన్లలో ఉన్నాయి
టైప్ టూ ఏ కేటగిరీ..
» అసలైన వజ్రం స్వచ్ఛతకు మారుపేరుగా ఉంటుందని, ‘గోల్కొండ వజ్రాలు కన్నీళ్లంత స్వచ్ఛమైనవి’అని నిపుణులు చెబుతారు. వజ్రాల వ్యాపారంలో టైప్ టూ ఏ కేటగిరీని అత్యంత అరుదైన, స్వచ్ఛమైనదిగా భావిస్తారు. అందుకే గోల్కొండ వజ్రాలను ఆ కేటగిరీకి చెందినవిగా పేర్కొంటారు. కాకతీయుల కాలంలో గోల్కొండ వజ్రాలను వెలికితీయటం ప్రారంభించారు. ప్రస్తుతం కర్ణాటకలోకి రాయచూరు నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ వరకు ఉన్న ప్రాంతాన్ని గోల్కొండ గనులుగా పరిగణిస్తారు.
కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వజ్రాలు లభించేవి. ఈ వజ్రాలు అధికంగా ఉన్న ప్రాంతాలను తన పరిధిలో ఉంచుకునేందుకు నిజాం తహతహలాడేవాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని భూభాగాన్ని అప్పట్లో నిజాం ఆంగ్లేయుల పరం చేశాడు. ఆ సమయంలో ప్రస్తుతం ఆంధ్రాప్రాంతంలో ఉన్న పరిటాల ప్రాంతాన్ని నిజాం తన పరిధిలోకి వచ్చేలా చేసుకున్నాడు.
అక్కడ వజ్రాలు అధికంగా లభిస్తుండటమే దీనికి కారణం. ప్రస్తుతం తెలంగాణలో భాగంగా ఉన్న మునగాలను నిజాం సర్కారు బ్రిటిష్ పరిధిలోకి మార్చింది. రాష్ట్రాల పునరి్వభజన సమయంలో భౌగోళికంగా ఈ తీరు సరిగ్గా లేకపోవటంతో పరిటాలను ఆంధ్రప్రదేశ్‌కు, మునగాలను తెలంగాణకు కేటాయించారు.
ఇప్పటి వరకు వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన మూడు ప్రధాన వజ్రాలు
2008: విట్టెల్స్‌బాచ్ డైమండ్ - 23.7 మిలియన్ డాలర్లు
1995: ఓర్లోవ్ డైమండ్ - 20.7 మిలియన్ డాలర్లకు
1995: జాకబ్ డైమండ్ - 13.4 మిలియన్ డాలర్లు
ప్రధాన గోల్కొండ వజ్రాల నమూనాలు
ప్రజలు సందర్శించేందుకు వీలుగా కొన్ని ప్రధాన గోల్కొండ వజ్రాలకు నమూనాలు రూపొందించారు.
» లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో కోహినూర్ నకలు వజ్రం ఉంది
» మాస్కోలోని క్రెమ్లిన్ ఆర్మరీలో ఓర్లోవ్ డైమండ్ నమూనా ఉంది
» టెహరాన్స్ నేషనల్ మ్యూజియంలో దరియా–ఇ–నూర్ వజ్రం నమూనా ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment