
ఈ నెల 25న బాండ్ల వేలం ద్వారా సమకూర్చుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే ఆఖరు బహిరంగ మార్కెట్ రుణం
2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ ద్వారా రూ.56 వేల కోట్ల సమీకరణ
చివరి మూడు నెలల్లో రూ.30 వేల కోట్లకు షెడ్యూల్ ఇచ్చినా రూ.15వేల కోట్లకే పరిమితం
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి రుణాన్ని ఈనెల 25న రాష్ట్ర ప్రభుత్వం సేకరించుకోనుంది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి ఈ అప్పును సమకూర్చుకోనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం 27 సంవత్సరాల కాలపరిమితితో రూ.1000 కోట్లు, 30 సంవత్సరాల కాలపరిమితితో మరో రూ.500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. కాగా, ఈ రూ.1500 కోట్ల రుణంతో బహిరంగ మార్కెట్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.55,800 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకున్నట్టు అవుతుంది.
2024–25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా గత ఏడాది జూలై నెలలో రూ.8 వేల కోట్లు, ఆగస్టులో రూ.6 వేల కోట్లు, ఈ ఏడాది జనవరిలో రూ.5,800 కోట్లు ఆర్‌బీఐ ద్వారా రుణంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, మార్చి నెలలో ఇప్పటికే రూ. 5 వేల కోట్లను సమకూర్చుకుంది. ఈనెల 4న రూ.2 వేల కోట్లు, 11న రూ.3 వేల కోట్లు తీసుకున్న ప్రభుత్వం.. ఈనెల 25న మరో రూ.1,500 కోట్లు తీసుకోనుంది.

షెడ్యూల్‌లో సగమే!
అయితే, తొలి మూడు త్రైమాసికాల్లో రూ. 40వేల కోట్లకు పైగా రుణాన్ని ఆర్‌బీఐ ద్వారా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. చివరి త్రైమాసికంలో మరో రూ.30 వేల కోట్లు తీసుకోవాలని భావించింది. ఈ మేరకు గత ఏడాది డిసెంబర్‌లోనే ఆర్‌బీఐకి షెడ్యూల్ ఇచ్చింది. కానీ, చివరి మూడు నెలల్లో కేవలం రూ.15,300 కోట్ల రుణాలకు మాత్రమే పరిమితమైంది. అదే షెడ్యూల్ మేరకు రుణాలు తీసుకొని ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై మరో రూ.14,700 కోట్ల రుణభారం పడేది.
కానీ, ప్రభుత్వం మాత్రం ఆ మేరకు రుణ సేకరణ జరపలేదు. ఈ విషయమై ఆర్థికశాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ‘చివరి మూడు నెలల అవసరాలను బట్టి రూ.30 వేల కోట్లు అప్పులు అనివార్యమనే ఉద్దేశంతో ఆర్‌బీఐకి షెడ్యూల్ ఇచ్చాం. కానీ అనివార్యం కాకపోవడంతో తీసుకోలేదు. షెడ్యూల్‌లో పెట్టినా అవసరమైనప్పుడు మాత్రమే బిడ్డింగ్‌కు వెళ్లే వెసులుబాటు ఆర్‌బీఐ కలి్పస్తుంది.’అని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment