botswana
-
నీటి కాలుష్యమే పొట్టన పెట్టుకుంది... వీడిన 350 ఏనుగుల మృతి మిస్టరీ
బోట్స్వానాలో 2020లో ఏనుగుల మూకు మ్మడి మరణం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒకేసారి ఏకంగా 350 ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమ య్యాయి. ఈ ఉదంతంపై లండన్‌లోని కింగ్స్ కాలేజీ పరిశోధనలు జరిపింది. ఆ ఏనుగుల మరణాల వెనుక మిస్టరీ నాలుగేళ్లకు వీడింది. అడవిలోని నీటి గుంతలు కలుషితమవడమే ఏనుగుల మృతికి కారణమని అధ్యయన బృందం తెలిపింది. ‘‘సైనో బ్యాక్టీరియా విడుదల చేసిన సైనో టాక్సిన్లు నీటిపై విషపూరిత నురగకు కారణమయ్యాయి. అదే ఏనుగుల మరణానికి దారి తీసింది’’ అని వెల్లడించింది.వర్షాధారిత గుంతల వల్లే.ఒకవాంగో డెల్టాలోని 6 వేల చదరపు కిలోమీట ర్ల పరిధిలో 20 నీటి గుంతలు కలుషితమైనట్టు అధ్యయనంలో తేలింది. ఆ నీటిని తాగాక 88 గంటల్లోనే ఏనుగులు చనిపోయినట్టు అంచనా వేసింది. అవి శాశ్వత నీటి వనరులు కావు. కేవ లం వర్షాధారిత గుంతలు. వాటివల్లే ప్రమాదం జరిగిందని అధ్యయన సారథి శాస్త్రవేత్త డేవిడే లోమియో చెప్పారు. చనిపోయిన ఏనుగులు వేర్వేరు వయసులవి. పైగా వాటి దంతాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. కనుక వాటిని వేటాడారన్న వాదన సరికాదు’’ అని తెలిపారు.ఆల్గే పెరుగుదలకు కారణం?సైనో బాక్టీరియాగా పిలిచే నీలం–ఆకుపచ్చ ఆల్గే లో అన్నిరకాలూ విషపూరితం కావు. కొన్నిరకాల సైనోబాక్టీరియా నిలకడగా ఉన్న నీటిలో ఒక రకమైన ప్రాణాంతక ఆల్గల్ బ్లూమ్స్ (హెచ్ఎబి) ను ఉత్పత్తి చేస్తుంది. బోట్స్వానాలో 2019లో అస్సలు వానల్లేవు. 2020లోనేమో విపరీతంగా వానలు పడ్డాయి. ‘‘అధిక వర్షపాతంతో భూమి నుంచి భారీ అవక్షేపాలతో పాటు పోషకాల పునరుత్పత్తి విపరీతంగా జరిగింది. అదే ఆల్గల్ పెరుగుదలకు కారణమైంది’’ అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో ఇలాంటివి తరచూ జరగవచ్చని హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల అతివృష్టి, అనావృష్టితో ఆఫ్రికా దక్షిణ భాగం వైరుధ్య వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటోందని వారంటున్నారు. ‘‘ఇదే నీటిపై ప్రభా వం చూపుతోంది. దాంతో జంతువులు విపత్కర పరిణామాలను ఎదుర్కొంటున్నాయి’’ అని తెలిపారు. అడవులు, పార్కుల్లోని నీటి వనరుల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం చాలా అవసరమన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బొట్స్వానా గనిలో 2,492 క్యారెట్ల వజ్రం
గబొరోన్(బొట్స్వానా): ఆఫ్రికా దేశం బొట్స్వానా గనిలో అతిపెద్దదిగా భావిస్తున్న వజ్రం లభ్యమైంది. తమ గనుల్లో ఇంతటి భారీ వజ్రం దొరకడం ఇదే మొదటిసారని బొట్స్వానా ప్రభుత్వం తెలిపింది. దీని బరువు 2,492 కేరట్లని వివరించింది. కెనడాకు చెందిన లుకారా డైమండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే కరోవె గనిలో ఈ అరుదైన ముడి వజ్రం లభించింది. ఎక్స్‌రే సాంకేతికతను ఉపయోగించి అధిక నాణ్యతతో, చెక్కు చెదరకుండా ఉన్న ఈ వజ్రాన్ని కనుగొన్నట్లు లుకారా తెలిపింది. ఇంత పెద్ద వజ్రం లభించడం వందేళ్లలో ఇదే మొదటిసారని పేర్కొంది. గతంలో 1905లో దక్షిణాఫ్రికాలోని ఓ గనిలో కల్లినాన్ డైమండ్ బయటపడింది.3,106 కేరట్లున్న ఆ భారీ వజ్రాన్ని 9 భాగాలు చేశారు. వాటిలో కొన్ని భాగాలను బ్రిటిష్ రాజవంశీకుల ఆభరణాల్లో వాడారు. అంతకుపూర్వం, 1800లో బ్రెజిల్లో అతిపెద్ద బ్లాక్ డైమండ్ దొరికింది. అయితే, ఇది భూ ఉపరితలంలోనే లభించింది. ఇది ఉల్కలో భాగం కావొచ్చని నమ్ముతున్నారు. బొట్స్వానా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రాల ఉత్పత్తిదారు. మొత్తం 20 శాతం వరకు వాటా బొట్స్వానా గనులదే. ఇటీవలి సంవత్సరాల్లో ఇక్కడి గనుల్లో భారీ వజ్రాలు లభించాయి. 2019లో కరోవె గనిలోనే 1,758 కేరట్ల సెవెలో వజ్రాన్ని తవ్వి తీశారు. దీనిని ఫ్రాన్సుకు చెందిన ప్రఖ్యాత ఫ్యాషన్ సంస్థ లూయిస్ విట్టన్ కొనుగోలు చేసింది. అయితే, ధరను వెల్లడించలేదు. కరోవె గనిలోనే 1,111 కేరట్ల లెసెడి లా రొనా అనే డైమండ్ లభ్యమైంది. దీనిని, బ్రిటిష్ ఆభరణాల సంస్థ 2017లో 5.30 కోట్ల డాలర్ల(సుమారు రూ.440 కోట్లు)కు దక్కించుకుంది. -
ఆఫ్రికాలో దొరికిన అరుదైన మూడో అతిపెద్ద వజ్రం
ప్రపంచంలో మూడో అతిపెద్ద వజ్రం ఆఫ్రికాలోని బోట్స్వానా దేశంలో కనుగొన్నారు. ఇది 1,098 క్యారెట్ల వజ్రం. ఆంగ్లో అమెరికన్(ఎఎఎల్), బీర్స్, స్థానిక ప్రభుత్వం జాయింట్ వెంచర్ లో జరిపిన తవ్వకాలలో ఇది దొరికింది. ఈ వజ్రాన్ని డెబ్స్వానా డైమండ్ కంపెనీ తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్ లినెట్ ఆర్మ్ స్ట్రాంగ్ ఆ దేశ అధ్యక్షుడు మోక్వీట్సీ మాసిసీకి అప్పగించారు. గతంలో దొరికిన అతిపెద్ద వజ్రాలలో మొదటి రెండు కూడా ఆఫ్రికాలోనే దొరికాయి. మొదటి అతిపెద్ద 3,106 క్యారెట్ల వజ్రం 1905లో దక్షిణాఫ్రికాలో దొరికింది. దీనికి కుల్లినన్ స్టోన్ అని పేరు పెట్టారు. 2015లో బోట్స్వానాలో లుకారా డైమండ్స్ 1,109 క్యారెట్ల "లెసెడి లా రోనా" అనే రెండవ అతిపెద్ద వజ్రాన్ని వెలికి తీసింది. గత 50 సంవత్సరాల చరిత్రలో డెబ్స్వానా స్వాధీనం చేసుకున్న అతిపెద్ద వజ్రం ఇది అని ఆర్మ్ స్ట్రాంగ్ చెప్పారు. ప్రాథమిక విశ్లేషణ తర్వాత ఇది ప్రపంచంలోని మూడవ అతిపెద్ద వజ్రం అని పేర్కొన్నారు. 73 మి.మీ పొడవు, 52 మి.మీ వెడల్పు, 27 మి.మీ మందం కలిగిన ఈ వజ్రానిక్ ఇంకా పేరు పెట్టలేదు. 2020లో కోవిడ్-19 మహమ్మారి వల్ల వజ్రాల అమ్మకాలు క్షీణించాయి. ఇప్పుడు ఈ వజ్రం దొరకడంతో మళ్లీ మంచి రోజు వచ్చినట్లు ఖనిజాల శాఖ మంత్రి లెఫోకో మోగి తెలిపారు. డివిడెండ్లు, రాయల్టీలు, పన్నుల ద్వారా డెబ్స్వానా అమ్మకాల రూపంలో ప్రభుత్వం 80 శాతం ఆదాయాన్ని అందుకుంటుంది. ఉత్పత్తి 2020లో డెబ్స్వానా 29 శాతం పడిపోయి 16.6 మిలియన్ క్యారెట్లకు పడిపోయింది. ఈ మహమ్మారి ప్రభావం ఉత్పత్తి, డిమాండ్ రెండింటి మీద పడటంతో అమ్మకాలు 2.1 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. 2021లో ప్రపంచ వజ్రాల మార్కెట్ కోలుకోవడంతో 38 శాతం ఉత్పత్తిని పెంచాలని యోచిస్తోంది. చదవండి: Gold Price: బంగారం కొనుగోలుదారులకు భారీ ఊరట! -
వైరల్: సింహానికే వణుకు పుట్టించాడు
బోట్స్వానా: అడవికి రారాజైన సింహాన్ని చూస్తేనే సగం చస్తాం. అలాంటిది అది నేరుగా మన మీదకు పంజా విసిరితే ఇంకేమైనా ఉందా? ఊహించడానికి కూడా కష్టంగా ఉంది కదూ..! కానీ ఇక్కడ చెప్పుకునే వ్యక్తి దగ్గర మాత్రం సింహం ఆటలు సాగలేవు. ఆకలితో అతడిని చంపుకుని తినాలనుకున్న దాని తల మీద పిడిగుద్దులు కురిపించి సింహానికే వణుకు పుట్టించాడు. అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్న ఈ సంఘటన ఆఫ్రికా ఖండంలోని బోట్స్వానా దేశంలో జరిగింది. వన్యజాతుల అధ్యయనకారుడు గోట్స్ నీఫ్.. ఒకవాంగో డెల్టాలో టెంట్ వేసుకుని నిద్రిస్తున్నాడు. ఇంతలో ఏదో పెద్ద శబ్ధం అతడికి చేరువ అవుతూ వచ్చింది. అదేంటని లేచి చూసేలోపే సింహం తన ఆకలిని తీర్చుకునేందుకు అతడి మీదకు పంజా విసిరింది. (చదవండి: మీ వెంట లక్షల మందిమి ఉన్నాం: వైరల్) అతడి కేకలు విన్న నీఫ్ స్నేహితులు రైనర్ వాన్ బ్రాండీస్, టొమాలెట్స్ సెటబోష వారి ప్రాణాలను పణంగా పెట్టి సింహంతో పోరాడారు. చెట్టు కొమ్మలను విసురుతూ, చేతికందిన వస్తువులను విసురుతూ దాన్ని బెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా సరే అది నీఫ్‌ను వదిలేయకపోవడంతో అతడు దాని ముఖం మీద పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆగ్రహించిన సింహం అతడి తలను నోట కరుచుకునేందుకు ప్రయత్నించగా చాకచక్యంగా తప్పించుకున్నాడు. కానీ అతడి మోచేతిని మాత్రం తన కోర పళ్లతో కొరకడంతో తీవ్ర గాయమైంది. అయినా సరే నీఫ్, అతడి స్నేహితులు ధైర్యంగా సింహంతో పోరాడి దాన్ని అక్కడ నుంచి పారిపోయేలా చేశారు. తీవ్ర గాయాలతో ప్రాణాలతో బతికి బయటపడ్డ నీఫ్ ఆస్పత్రిలో చేరగా అతడి మోచేతి ఎముకలు విరిగినట్లు తెలిపారు. డిసెంబర్ 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంలోకి వెలుగులోకి వచ్చింది. సింహాంతో పోరాడిన నీఫ్‌ను జనాలు ధైర్యశాలి అని మెచ్చుకుంటున్నారు. (చదవండి: ఎలుగుబంటితో యుద్ధం.. చివరికి) -
ఈ ఏడాది దాదాపు 300 ఏనుగులు మృతి
బోట్స్వానా : నీటిలోని సైనోబాక్టీరియా ఉత్పత్తి చేసే టాక్సిన్స్ వల్ల ఈ ఏడాది దాదాపు 300 ఏనుగులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వరుసగా ఏనుగులు చనిపోతుండటంపై విచరణ చేపట్టిన దర్యాప్తు సంస్థ ఈ మేరకు షాకింగ్ విషయాలను వెల్లడించింది. సాధారణంగా సైనోబాక్టీరియా అనేది నీటిలో, మట్టిలోనూ ఉండే సూక్షజీవి. వీటి వల్ల ప్రమాదం లేకపోయినా వాతావరణ మార్పుల వల్ల విషతుల్యం అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. అత్యధిక ఉష్ణోగ్రత వల్ల ఈ సూక్ష్మజీవులు విషంగా మారాయని, ఈ నీళ్లు తాగడంతో ఏనుగులు చనిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మే నెల ప్రారంభం అయినప్పటినుంచి ఇప్పటిదాకా 330 ఏనుగులు చనిపోయినట్లు జాతీయ వన్యప్రాణి, ఉద్యానవనాల డిప్యూటీ డైరెక్టర్ సిరిల్ టావోలో పేర్కొన్నారు. వీటిలో అత్యధికంగా జూలై మాసంలోనే 281 ఏనుగులు చనిపోయినట్లు తెలిపారు. (అరుదైన మగ కప్పల భీకర పోరు ) అయితే మిగతా వన్యప్రాణులకు సైతం ఈ పరిస్థితి ముప్పుగా మారుతుందనడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ఎందుకంటే ఈ టాక్సాన్స్ వల్ల ఇప్పటివరకు ఏనుగులు మాత్రమే చనిపోయాయి. మిగతా జంతువులన్నీ క్షేమంగానే ఉన్నాయి. కాబట్టి పరిస్థితుల్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఏనుగల జనాభా అధికంగా ఉండే ఆఫ్రికాలో మూడింట ఒకవంతు ఏనుగులు బోట్స్వానాలో ఉంది. ఇక దక్షిణాఫ్రికాలో ఉష్ణోగ్రతలు ప్రపంచ సగటు కంటే రెండు రెట్లు ఎక్కువ. పొరుగున ఉన్న జింబాబ్వేలోని అతిపెద్ద గేమ్ పార్క్ సమీపంలో సుమారు 25 ఏనుగులు చనిపోయాయి. అయితే బొట్స్వానా ఘటనతో దీన్ని లింక్ చేయలేమని అధికారులు పేర్కొన్నారు. ఇక్కడి ఏనుగు మృతదేహాలను పరిశీంచాకే నీటిలోని టాక్సిన్ వల్ల చనిపోయినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. కాకపోతే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగానే ఇవి మృత్యువాత పడి ఉండొచ్చేమో అని విక్టోరియా ఫాల్స్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్‌లోని పశువైద్యుడు క్రిస్ ఫాగ్గిన్ అన్నారు. (ట్రంప్ వైపు ఇండియన్ అమెరికన్లు మొగ్గు) -
వావ్.. నెటిజన్ల ప్రేమను దోచేశారు
-
వావ్.. నెటిజన్ల ప్రేమను దోచేశారు
లండన్: మానవత్వం పరిమళించింది. తప్పిపోయిన ఓ గున్న ఏనుగు పిల్లను ఆదుకునేందుకు రోడ్డుపై వెళుతున్నవారు చాలా ఓర్పును ప్రదర్శించారు. అది ఏం కోరుకుంటుందో గుర్తించి దానికి తగిన సహాయం చేసి నెటిజన్లతో శబాష్ అనిపించుకున్నారు. బోట్స్వానాలోని ఓ జాతీయ రహదారిపై కార్లోస్ శాంతోస్, జోహాన్ గ్రోన్వాల్డ్, పీటర్ రూసో అనే ముగ్గురు వ్యక్తులు మూడు ట్రక్కుల్లో వెళుతున్నారు. అలా వెళుతున్నవారికి మిట్టమధ్యాహ్నం మండుటెండలో పక్కనే ఉన్న గుబురులో నుంచి బయటకొచ్చి రోడ్డుపై నిల్చున్న చిన్న ఏనుగుపిల్ల కనిపించింది. దానికి సరిగ్గా మూడు వారాలు మాత్రమే ఉంటాయి. అది దాహంతో ఉన్నట్లు గమనించారు. వెనుకాముందు ఆలోచించకుండా కిందికి తమ వద్ద ఉన్న వాటర్ బాటిల్స్‌తో నీళ్లుతాగించారు. అనంతరం ఏనుగుల గుంపు ఆ సమీపంలో ఎక్కడైనా ఉందా అని వెతికి చూశారు. ఎక్కడా కనిపించకపోవడంతో ఆలోచించి తమ ప్రయాణాన్ని కాసేపు వాయిదా వేసుకొని ఆ గున్న ఏనుగు పిల్లను తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు. నేరుగా తీసుకెళ్లి బోట్స్వానాలోని అటవీ వన్యమృగ ప్రాణుల సంరక్షణా కేంద్రానికి అప్పగించి అక్కడి అధికారుల ప్రశంసలు దక్కించుకున్నారు. అంతేకాదు ఇప్పుడు ఆ ఏనుగు పిల్ల అక్కడ ఎంత సంతోషంగా ఉందో కూడా తెలియజేస్తూ ఇంటర్నెట్లో ఓ వీడియోను కొన్ని ఫొటోలు పోస్ట్ చేయగా దానిని చూసినవారంతా వారిని మెచ్చుకుంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. -
అతిపెద్ద వజ్రం దొరికింది..
జొహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో అరుదైన వజ్రం బయటపడింది. బొత్స్వానాలోని ఓ గనిలో ఏ 1111 క్యారట్ల అత్యంత నాణ్యమైన పెద్ద వజ్రం దొరికింది. గత శతాబ్ద కాలంలో దొరికిన వజ్రాల్లో ఇదే పెద్దది కావడం విశేషం. 1905లో దక్షిణాఫ్రికాలో ప్రిటోరియా సమీపంలో 3106 క్యారట్ల పెద్ద వజ్రం బయటపడింది. పరిమాణంలో ఇది అత్యంత పెద్దది కాగా, తాజా వజ్రం రెండోదని మైనింగ్ కంపెనీ లుకారా డైమండ్ కార్పొరేషన్ వెల్లడించింది. ప్రపంచంలోనే నాణ్యత, పరిమాణంలో ఇది రెండో పెద్ద వజ్రమని ఓ ప్రకటనలో తెలిపింది. కాగా దీని విలువ ఎంతన్నది నిర్ధారించాల్సివుంది. అయితే ప్రపంచంలో చాలా విలువైన వజ్రమని వర్తకులు, మైనింగ్ నిపుణులు చెప్పారు. ఈ వజ్రాన్ని సానబెట్టి తుది మెరుగులు దిద్దిన తర్వాత విలువను అంచనా వేయనున్నారు. -
బోట్స్వానా
నైసర్గిక స్వరూపం: వైశాల్యం: 5,81,730 చదరపు కిలోమీటర్లు జనాభా: 21,55,784 (తాజా అంచనాల ప్రకారం) రాజధాని: గబోరోన్ ప్రభుత్వం: పార్లమెంటరీ రిపబ్లిక్ కరెన్సీ: పులా భాషలు: ఇంగ్లిష్, సేట్స్వానా మతం: {Mైస్తవులు 15 శాతం మిగిలిన జనాభా స్థానిక తెగలు వాతావరణం: జనవరిలో 18 నుండి 31 డిగ్రీలు, జూన్‌లో 5 నుండి 23 డిగ్రీలు పంటలు: మొక్కజొన్న, గోధుమ, ఖనిజాలు: నికెల్, రాగి, వజ్రాలు పరిశ్రమలు: పశుపోషణ, గనులు, మాంసం, పర్యాటకం ఎగుమతులు: వజ్రాలు, మాంసం, నికెల్, రాగి స్వాతంత్య్రం: 1966 సెప్టెంబర్ 30 సరిహద్దులు: జాంబియా, అంగోలా, నమీబియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే చరిత్ర 19వ శతాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతాన్ని డేవిడ్ లివింగ్‌స్టోన్ అనే క్రైస్తవ మత ప్రచారకుడు మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేశాడు. అంతవరకు ఆ ప్రాంతం అంతా ఆటవిక తెగల ప్రజల జీవనం బాహ్య ప్రపంచానికి తెలియదు. అతడు ప్రయాణించిన మార్గాన్ని నేడు మిషినరీ రోడ్‌గా పిలుస్తున్నారు. అప్పుడు ఆ ప్రాంతాన్ని బోట్స్వానా అని అక్కడి తెగల వారు పిలుచుకునేవారు. డేవిడ్ బావింగ్ స్టోన్ ఆటవిక తెగలలో స్నేహపూర్వకంగా మెలగి వారికి కొంత నాగరికతను నేర్పాడు. వారి గురించి ప్రపంచానికి పరిచయం చేశాడు. బ్రిటిష్ ప్రభుత్వం తరపున వారికి అతడు రక్షణ కల్పించాడు. ఆటవిక తెగల ప్రజలు అతనిని తమ ఆరాధ్య దైవంగా భావించారు. 1885లో బ్రిటిష్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో తమ సైన్యాన్ని రక్షణగా ఉంచింది. ఈ ప్రాంతాన్ని వాళ్ళు బెచువానాలాండ్ అని పిలిచారు. ఆ ప్రదేశమే నేడు బోట్స్వానాగా పిలవబడుతోంది. ఒకప్పుడు బోయేర్ రాజులు, అలాగే దక్షిణాఫ్రికా పాలకులు కూడా ఈ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. 1966లో స్వాతంత్రం లభించే నాటికి బోట్స్వానా ఆంగ్లేయుల అధీనంలో ఉండింది. సర్ సెరెట్సె ఖామా అధ్యక్షతన దేశంలో నూతన ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలు-సంస్కృతి వీరి ముఖ్యవృత్తి వ్యవసాయం. ఆటవిక తెగల ప్రజలు కాబట్టి వీరి ఆచార వ్యవహారాలు విచిత్రంగా ఉంటాయి. దేశంలో ప్రముఖంగా ఎనిమిది ఆటవిక తెగలు ఉన్నాయి. అవి ఎన్గ్యాటో, క్వెనా, ఎన్గ్యాకెట్సె, తవానా, కెగట్లా, లెటె, రోలోంగ్, టెలోక్వా. ఈ తెగలలో ఏ కుటుంబంలో ఎక్కువ పశువులు ఉంటాయో ఆ కుటుంబం గొప్పది అని భావిస్తారు. వీరు రోజులో ఎక్కువ భాగం ఆహారం కోసం వేటాడతారు. ముఖ్యంగాకలహరి ఎడారి ప్రాంతంలో ఉండే తెగల వాళ్ళు అడవి జంతువుల వేటలో దినమంతా గడిపేస్తారు. ఒకప్పుడు ఒక్కొక్క కుటుంబానికి మూడేసి ఇళ్లు ఉండేవి. ఒకటి గ్రామంలో, మరొకటి వారి పొలంలో, మరొకటి పశువుల మేత కోసం వెళ్ళిన ప్రదేశంలో ఉండేవి. పశువుల మేతకోసం యువకులు ఇళ్లు వదిలి దూరప్రాంతంలోనే ఎక్కువ కాలం గడిపేవాళ్లు. గ్రామానికి గ్రామపెద్ద ఉంటాడు.రైతులు ఎక్కువగా తమ తమ పొలాలలోనే గడుపుతారు. చూడదగిన ప్రదేశాలు 1. సెంట్రల్ కలహరి గేమ్ రిజర్వ్ ఇది కలహరి జాతీయ పార్కులో ఒక భాగం. దీనిని 1961లో ఏర్పాటు చేశారు. ఇది 52,800 చ.కి.మీ. వైశాల్యంతో ఉంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గేమ్ రిజర్వు. ఈ పార్కులో జిరాఫీలు, గోధుమవర్ణపు హైనాలు, వార్తాగ్లు, చీతాలు, అడవికుక్కలు, పులులు, సింహాలు, అడవి దున్నలు, ఇలాండ్లు, జెమ్స్బార్, కుడు మొదలైన జంతువులు ఉన్నాయి. ఇక్కడే దాదాపు 16 వేల ఏళ్ల క్రితం ఏర్పడిన లోయ ఉంది. పూర్వం ప్రవహించిన కొన్ని నదులు ఎండిపోయి ప్రస్తుతం వాటి అనవాళ్లు కనబడుతూ ఉంటాయి. నదీతీర ప్రాంతంలో ఎన్నో ఏళ్ల క్రితపు శిలాజాలను మనం దర్శించవచ్చు. అంటసాన్ జాతికి చెందిన అడవి మనుషులు ఈ ప్రాంతంలోనే నివాసం ఉంటారు. వీరి ప్రధానవృత్తి జంతువుల వేట. ఈ ప్రాంతంలో ఎండాకాలంలో 45 డిగ్రీలపైబడి ఉష్ణోగ్రత ఉంటుంది. 2. గబోరోన్ దాదాపు 15 కిలోమీటర్ల పొడవున్న ఈ నగరం 1966లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజధానిగా వెలుగొందుతోంది. నగరంలో రెండున్నర లక్ష జనాభా ఉంది. నగరంలో బ్లాకులు, ఎక్స్టెన్షన్లు, ఫేజులు అని ఉంటాయి. ప్రతి బ్లాకుకు నెంబరు ఉంటుంది. అందరూ ఈ నెంబర్ల ప్రకారమే పిలుస్తారు. నగరం మధ్యలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. నగరాన్ని ఆనుకొని నాట్వేన్ నది ప్రవహిస్తూ ఉంటుంది. నగరం చాలా బాగా వృద్ధి చెందుతోంది. నగరం చుట్టూ ఎన్నో ఎక్స్టెన్షన్లు నిర్మింపబడుతున్నాయి. నగరం మధ్యలో అనేక వ్యాపార కేంద్రాలు ఉన్నాయి. దీనినే మాల్ అంటారు. గబోరోన్ నగరంలో ఇస్కాన్ అధ్వర్యంలో ప్రసిద్ధ కృష్ణ దేవాలయం నిర్మింపబడింది. దీనితోపాటు శ్రీవెంకటేశ్వర మందిరాన్ని అక్కడి తెలుగు ప్రజలు నిర్మించారు. సిక్కుల గురుద్వారా, ముస్లిముల మసీదులు కూడా అనేకం ఉన్నాయి. జాతీయ మ్యూజియం, నేషనల్ బొటానికల్ గార్డెన్, జాతీయ అసెంబ్లీ, త్రీ డిగోసీ మాన్యుమెంట్ (ఇక్కడ 3వ ఖామా, 1వ సెబెలె, 1వ బతియాన్ల విగ్రహాలు ఉన్నాయి. ఖామా అంతర్జాతీయ విమానాశ్రయం, పార్లమెంటు భవనం, నగరాన్ని ఆనుకొని కిగాన్ కొండ, గబోరోన్ డ్యామ్, మోకొలోడి నేచర్ రిజర్వు... ఇలా ఎన్నో చూడదగినవి నగరంలో ఉన్నాయి. 3. చోబే జాతీయ పార్కు ఈ పార్కు దేశ ఉత్తర ప్రాంతంలో ఉంది. పదకొండు వేల చదరపు కిలోమీటర్ల్ల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు నాలుగు భాగాలుగా విభజింపబడి ఉంది. అవి సెరోండేలా ఏరియా, సావుటి మార్ష్రియా, లిన్యాంటి మార్ష్, హింటర్లాండ్లు. సెరోండేలా ప్రాంతంలో చోబే నది ప్రవహిస్తోంది. ఇక్కడ దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఏనుగులు, జిరాఫీలు, అడవి దున్నలు, ఆంటిలోప్లతోపాటు అనేక రకాల పక్షులు నివసిస్తున్నాయి. ఈ ప్రాంతంలోనే కసానే నగరం, దానిని ఆనుకొని విక్టోరియా జలపాతం ఉన్నాయి. సావుటి మార్ష్ ఏరియా అంతా సవన్నాల గడ్డి మైదానాలు పరుచుకుని ఉంటాయి. పర్యాటకులు ఈ ప్రాంతంలో సఫారికి వస్తుంటారు. ఈ ప్రాంతం నుండి జీబ్రాలు, వలసవెళుతూ వస్తూ ఉంటాయి. లిన్యాంటి మార్ష్ లిన్యాంటి నదీతీరంలో ఉంది. ఈ ప్రాంతంలో సరస్సులు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో మొసళ్ళు, ఏనుగులు అధికంగా నివాసం ఉంటాయి. హింటర్‌లాండ్ అంతగా ప్రసిద్ధి చెందలేదు. ఈ ప్రాంతంలో ఇలాండ్ అనే జంతువులు అధికంగా ఉంటాయి. 4. కెకలగాడి ట్రాన్స్‌ఫ్రాంటియర్ పార్కు దేశ దక్షిణ భాగంలో ఉన్న ఈ పార్కు 38వేల చదరపు కిలోమీటర్లు వైశాల్యంతో ఉంది. ఇది కలహరి ఎడారిని ఆనుకొని ఉంది. నసాబ్, అవూబ్ అనే రెండు నదులు ఇక్కడ ప్రవహిస్తాయి. ఈ నదులు శతాబ్దంలో ఒక్కసారి మాత్రమే ప్రవహిస్తాయి. అయితే భూగర్భజలం పుష్కలంగా ఉండడం వల్ల ఇక్కడ ప్రత్యేకమైన చెట్లు పెరుగుతాయి. ఈ పార్కులో పులులు, సింహాలు, ఏనుగులతో పాటు అనేక అడవి జంతువులు ఆవాసం ఉంటాయి. గద్దలు, ఇక్కడ అధిక సంఖ్యలో కనబడతాయి. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు -11 డిగ్రీలకు పడిపోతాయి. ఈ పార్కులో కొంత భూభాగాన్ని అక్కడ నివసించే సాన్ ఆటవిక తెగల ప్రజలకు వదిలేశారు. ఇది యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక్కడ ఎడారిగా ఉన్న ప్రాంతంలో భూభాగం ఎర్రగా కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇసుక తుఫానులు వస్తుంటాయి. 5. కలహరి ఎడారి కలహరి ఎడారి దాదాపు 9 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఈ ఎడారి బోట్స్వానా, నమీబియా దక్షిణ ఆఫ్రికా దేశాలలో విస్తరించి ఉంది. ఈ ఎడారి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 100 నుండి 110 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవడం వల్ల ఎడారిలో అనేక రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి. వీటికోసం ఎన్నో జంతువులు ఇక్కడికి వస్తాయి. ఈ ప్రాంతంలో పులులు, సింహాలు, అడవి దున్నలు అధికంగా ఉన్నాయి. ఎడారిలో తుమ్మ చెట్లు అధికం మన పుచ్చకాయల లాంటి పళ్ళను ఇచ్చే మొక్కలు ఈ ఇసుక నేలలో బాగా పండుతాయి. పొడవాటి ముళ్ళు కలిగిన పొదల మాదిరిగా పెరిగే మొక్కలు ఎడారి అంతా పరుచుకొని ఉంటాయి. ఈ ఎడారిలో ఆరు నెలలు అతి వేడిగా ఉంటే మిగిలిన ఆరునెలలు చల్లగా ఉంటుంది. ఈ ప్రాంతంలో పూర్వం మకగాడిక్గాడి అనే సరస్సు ఉండేదట. ఇప్పుడు మాత్రం పూర్తిగా ఎండిపోయి కనబడుతుంది. ఈ ప్రాంతంలో సాన్ తెగకు చెంది ఆటవిక తెగ ప్రజలు నివసిస్తున్నారు. వీరు నీళ్ళ కోసం మొక్కల వేళ్ళను తవ్వితీసి, బాగా పిండి నీటి చుక్కలను సేకరిస్తారు. విండోయెక్ అనే పట్టణం కూడా కలహరి బేసిన్ ప్రాంతంలో ఉంది. ఇక్కడికి పర్యాటకులు బాగా వస్తారు. 5. బోట్స్వానా వజ్రాల గనులు బోట్స్వానా దేశంలో మొత్తం నాలుగు వజ్రాలు గనులు ఉన్నాయి. 1.డమ్ట్ షా, 2. జ్వనెంగ్, 3. లెథకానే, 4. ఓరపా గనులు. డమ్ట్షా వజ్రాల గని ఫ్రాన్సిన్ టౌన్ నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. జ్వనెంగ్ వజ్రాల గని రాజధాని గబోరోన్ నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డిబీర్స్ వజ్రాల వ్యాపార సంస్థ అధిపత్యంలో ఈ గనిలో వజ్రాల ఉత్పత్తి జరుగుతుంది. వెధకానే వజ్రాలగని ఫ్రాన్సిస్టౌన్కు 190 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గని 1975 లో ప్రారంభమైంది. ఈ గనినుండి ప్రతిసంవత్సరం మూడున్నర మిలియన్ కారట్ల వజ్రాలు ఉత్పన్నం అవుతాయి. ఈ గని నుండి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఓప్రా వజ్రాల గని ఉంది. ఈ గని నుండి ప్రతి ఏటా 11 మిలియన్ల కారట్ల వజ్రాలు ఉత్పత్తి అవుతున్నాయి.