లండన్: మానవత్వం పరిమళించింది. తప్పిపోయిన ఓ గున్న ఏనుగు పిల్లను ఆదుకునేందుకు రోడ్డుపై వెళుతున్నవారు చాలా ఓర్పును ప్రదర్శించారు. అది ఏం కోరుకుంటుందో గుర్తించి దానికి తగిన సహాయం చేసి నెటిజన్లతో శబాష్ అనిపించుకున్నారు. బోట్స్‌వానాలోని ఓ జాతీయ రహదారిపై కార్లోస్ శాంతోస్, జోహాన్ గ్రోన్‌వాల్డ్, పీటర్ రూసో అనే ముగ్గురు వ్యక్తులు మూడు ట్రక్కుల్లో వెళుతున్నారు. అలా వెళుతున్నవారికి మిట్టమధ్యాహ్నం మండుటెండలో పక్కనే ఉన్న గుబురులో నుంచి బయటకొచ్చి రోడ్డుపై నిల్చున్న చిన్న ఏనుగుపిల్ల కనిపించింది.
దానికి సరిగ్గా మూడు వారాలు మాత్రమే ఉంటాయి. అది దాహంతో ఉన్నట్లు గమనించారు. వెనుకాముందు ఆలోచించకుండా కిందికి తమ వద్ద ఉన్న వాటర్ బాటిల్స్‌తో నీళ్లుతాగించారు. అనంతరం ఏనుగుల గుంపు ఆ సమీపంలో ఎక్కడైనా ఉందా అని వెతికి చూశారు. ఎక్కడా కనిపించకపోవడంతో ఆలోచించి తమ ప్రయాణాన్ని కాసేపు వాయిదా వేసుకొని ఆ గున్న ఏనుగు పిల్లను తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు.
నేరుగా తీసుకెళ్లి బోట్స్‌వానాలోని అటవీ వన్యమృగ ప్రాణుల సంరక్షణా కేంద్రానికి అప్పగించి అక్కడి అధికారుల ప్రశంసలు దక్కించుకున్నారు. అంతేకాదు ఇప్పుడు ఆ ఏనుగు పిల్ల అక్కడ ఎంత సంతోషంగా ఉందో కూడా తెలియజేస్తూ ఇంటర్నెట్‌లో ఓ వీడియోను కొన్ని ఫొటోలు పోస్ట్ చేయగా దానిని చూసినవారంతా వారిని మెచ్చుకుంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.