ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సారథి, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా
విశ్లేషణ
1994లో స్థాపితమైనప్పటినుంచీ 30 ఏళ్లపాటు అప్రతిహతంగా దక్షిణాఫ్రికాను ఏలిన ‘ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్’(ఏఎన్‌సీ) తొలిసారి పూర్తి మెజారిటీని అందుకోలేకపోయింది. ఇప్పటికీ అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ అదే అయినప్పటికీ(400కు 159) క్రమంగా తగ్గుతున్న ఓట్ల శాతం ప్రజల్లో పెరుగుతున్న నిరాదరణకు రుజువు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ నెల్సన్ మండేలా నెలకొల్పిన ఈ పార్టీ ప్రభుత్వాల అధినేతల అవినీతి, అసమర్థ పాలన ప్రజల్లో అసంతృప్తికి కారణమయ్యాయి. ఒకప్పుడు మొత్తం ఆఫ్రికాలోనే మొదటి స్థానంలో ఉండిన ఆర్థిక వ్యవస్థ నైజీరియా తర్వాత రెండవ స్థానానికి పడిపోయింది. ఈ పరిణామాలను గమనించినప్పుడు ఈరోజున ఏఎన్‌సీ తన మెజారిటీని కోల్పోవటంలో ఆశ్చర్యం కనిపించదు.
దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ) పార్టీ ఓటమి ఆశ్చర్యంగా తోచవచ్చు గానీ, ముందుగా ఊహించనిదేమీ కాదు. శ్వేతజాతీయుల వర్ణ వివక్ష వ్యవస్థ (అపార్థీడ్) మీద సుదీర్ఘ ఉద్యమం విజయవంతమైన తర్వాత 1994లో అధికారానికి వచ్చిన ఏఎన్‌సీ, తన వైఫల్యాల కారణంగా ప్రజాదరణను కోల్పోవటం ఒక దశాబ్ద కాలమైనా తిరగకముందే మొదలైంది. ఇప్పటికి సరిగ్గా 16 సంవత్సరాల క్రితం 2003 జూన్‌లో నేను దక్షిణాఫ్రికాను సందర్శించే నాటికే ఈ అసంతృప్తి వివిధ వర్గాలలో కనిపించసాగింది.
కానీ ఆ తర్వాత మరొక అయిదేళ్లు జీవించి ఉండిన నెల్సన్ మండేలా గానీ, తన ఉద్యమ సహచరులుగా పోరాటాలు జరిపి ప్రభుత్వ నాయకత్వాలలోకి వచ్చినవారు గానీ పరిస్థితిని సరిదిద్దలేదు. దేశాధ్యక్ష పదవిని 1999లో వదులుకున్న మండేలా ఏకాంత జీవితంలోకి వెళ్ళిపోగా, ప్రభుత్వాలను నడిపినవారు అవినీతి మార్గాలను పట్టారు. ఉద్యమ కాలంలో హామీ ఇచ్చిన జనరంజక పాలనను, సంస్కరణలను కాగితాలపై తప్ప ఆచరణలో చూపించింది స్వల్పం. అందుకు ప్రజల నిరసన కనిపించటం కొంతకాలం క్రితమే మొదలుకాగా, ఇపుడది 30 ఏళ్ళలో మొదటిసారిగా అసలు మెజారిటీయే కోల్పోయింది.
దక్షిణాఫ్రికా గురించి బయటికి బాగా ప్రచారం పొందిన సమస్య వర్ణ వివక్ష. అటు వివక్ష తెల్లవారు పాలించిన ఇతర ఆఫ్రికన్ వలస దేశాలలో కూడా ఉండగా, ఇక్కడ దానిని చట్టబద్ధంగా వ్యవస్థీకృతం చేశారు. అదే సమయంలో దేశంలోని భూమి, గనులు, పరిశ్రమలు, వ్యాపారాలు, ఉద్యోగాల వంటి సమస్త వనరులు తెల్లవారి అధీనంలోనే ఉండిపోయాయి. అటువంటి స్థితిలో, అపార్థీడ్ వ్యవస్థ రద్దయినప్పటికీ ఈ వనరులపై తెల్లవారి ఆధిపత్యం పోయి, ఆర్థిక సంస్కరణలు జరిగి, నల్లవారికి తమ జనాభాకు తగినట్లు అవకాశాలు లభిస్తే తప్ప పేదరికం పోదు, అపార్థీడ్ వ్యతిరేక పోరాటానికి నిజమైన సార్థకత లభించదు.
వాస్తవానికి ఉద్యమకాలంలో ఈ లక్ష్యాలన్నీ ఏఎన్‌సీ అజెండాలో ఉన్నవే. ఆ పార్టీపై తమ సొంత ఆలోచనలతో పాటు వివిధ ప్రజాస్వామిక దేశాలు, సోషలిస్టు దేశాల అభ్యుదయ భావాల ప్రభావాలు ఉండేవి. కానీ అధికారానికి వచ్చిన అనంతరం ఎక్కువకాలం గడవకుండానే పరిస్థితులు మరొకవిధంగా మారసాగాయి. నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే మండేలా స్వయంగా అధ్యక్షునిగా ఉండిన 1994–99 కాలంలో సైతం ప్రభుత్వ బాధ్యులలో పలువురి తీరు మారటం, మండేలా తన మెతకదనం వల్ల నిస్సహాయునిగా మిగిలిపోవటం జరిగింది. ఆయన తన శేష జీవితం అయిదేళ్లు ఒంటరిగా గడపటం అందువల్లనేనన్నది కొందరి పరిశీలకుల అభిప్రాయం.
అపార్థీడ్ వ్యవస్థ రద్దయిన మాట నిజం. అందువల్ల నల్లవారు స్వేచ్ఛగా తిరగగలగటంతో పాటు బీచ్‌లు, క్లబ్బులు, హోటళ్ల వంటి ప్రదేశాలలోకి వారి ప్రవేశంపై నిషేధాలు తొలగిపోయాయి. పోలీస్ నిర్భంధాలు లేని కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నల్లవారి పిల్లలకు విద్యావకాశాలు లభించటం మొదలైంది. కొంత వైద్యం, చదువులతో పాటు ఉద్యోగాలలో రిజర్వేషన్లు వచ్చాయి. నల్లవారికి తెల్లవారు తమ వ్యాపారాలలో చిన్న చిన్న ఉద్యోగాలు ఇవ్వసాగారు. అపార్థీడ్‌తో పాటు తమ రాజ్యం పోయిందనీ, అందువల్ల కొన్ని రాజీలు తప్పవనీ వారికి అర్థమైంది.
నల్లవారు కూడా కొద్దిస్థాయిలో వ్యాపారాలు మొదలుపెట్టారు. పెద్ద హోదా గల ప్రభుత్వ ఉద్యోగాలు కొన్నింటిని తెల్లవారికి, నల్లవారికి మధ్య రొటేట్ చేయసాగారు. ఈ మార్పులు నల్లవారిలో ఒక చిన్న మధ్యతరగతి సృష్టికి అవకాశం కల్పించాయి. ఈ విధంగా వారికి క్రమంగా ఆత్మవిశ్వాసం రావటం మొదలైంది. అపార్థీడ్ రద్దువల్ల ఇప్పుడు రాజకీయాధికారమంతా తమదే కావటం సరేసరి.
ఇటువంటివి సానుకూల పరిణామాలని వేరే చెప్పనక్కరలేదు. కానీ ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయాలు మూడున్నాయి. ఒకటి, యథాతథంగా నల్లవారి సమస్యలతో, వారి జనాభాతో పోల్చినపుడు ఈ మార్పులు చాలా స్వల్పం. రెండవది, మొదట చెప్పుకున్నట్లు ఆర్థిక వనరులన్నీ, ఆర్థిక కార్యకలాపాలన్నీ అత్యధిక భాగం తెల్లవారి అధీనంలోనే ఉండిపోవటం. ఉదాహరణకు నేనక్కడ ఉండినపుడు చూసిన అధికారిక ప్రచురణల ప్రకారం, గ్రామీణ భూములు నల్లవారి నుంచి తెల్లవారి చేతిలోకి అపార్థీడ్ రద్దయిన తర్వాత సైతం ఇంకా బదిలీ అవుతూనే ఉన్నాయి.
నల్లవారికి తమ వ్యవసాయం కోసం ఎటువంటి సహాయాలు లభించకపోవటం, గ్రామాలలో ఇతరత్రా ఉపాధి అవకాశాలు సన్నగిల్లటంతో వారు భూములు అమ్ముకొని, పొట్ట పోసుకునేందుకు నగరాలకు తరలిపోతున్నారు. నేను స్టెల్లెన్ బాష్ అనే నగరం వద్ద గల ఒక షాంటీ టౌన్‌ను చూశాను. నగరంలో నల్లవారు రోజంతా పనులు చేసుకుని సాయంత్రానికి వెళ్లిపోయి ఉండే ప్రాంతాన్ని షాంటీ టౌన్ అంటారు. అక్కడ అన్ని నివాసాలు, ఆ ప్రాంతం చుట్టు కట్టే కంచె అన్నీ ఇనుప రేకులతోనే. కొన్ని వేలమంది నివసిస్తారు. స్టెల్లెన్ బాష్‌కు దక్షిణాఫ్రికాలో గాంధీజీ కార్యకలాపాలతోనూ సంబంధం ఉండేది.
ఇటువంటి టౌన్‌షిప్‌లు గతంలోనూ ఉండగా, అపార్థీడ్ ముగిసిన తర్వాత ఇంకా పెరుగుతున్నాయి. నల్లవారు అధికారానికి వచ్చిన తర్వాత, టూరిజానికి ప్రోత్సాహం పేరిట ఒక్కొక్క కంపెనీకి వేలకు వేల హెక్టార్లు స్థానిక తెల్లవారికి, విదేశీయులకు దీర్ఘకాలపు లీజుకు అప్పగించారు. ఆ భూములన్నీ స్థానిక తెగలవి. వారు భూములు కోల్పోయి ఈ కంపెనీలలో కూలీలుగా పని చేస్తున్నారు. ఇది నా ప్రత్యక్షానుభవం. దేశానికి ఉత్తర ప్రాంతాలలో విస్తారమైన భూములు ఆ విధంగా నల్లవారికి నష్టమయ్యాయి. నేను చూసిన ఉదాహరణ ఇండియాకు చెందిన విజయ్ మాల్యా 20,000 ఎకరాలకు పైగా భూమిలో నిర్వహిస్తున్న మబూలా లాడ్జ్ రిసార్ట్. దాని వివరాలు అనేకం ఉన్నా ఇక్కడ అప్రస్తుతం.
ఇక మూడవ విషయం, ప్రభుత్వ నేతల అదుపులేని అవినీతి. అది చాలదన్నట్లు అసమర్థ పాలన. వీరంతా ఉద్యమ కాలపు అగ్రనేతలే. రెండు ఉదాహరణలు చూడండి. స్వయంగా మండేలా భార్య విన్నీ మండేలా ఉద్యమకాలం నుంచే అవినీతికి పాల్పడి, అపార్థీడ్ రద్దు తర్వాత జైలుకు వెళ్లింది. ప్రస్తుత అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు ముందు అధ్యక్షుడిగా ఉండిన జేకబ్ జుమా కూడా జైలుకు వెళ్లినవాడే. ఇతర పదవులలో ఉన్నవారి సంఖ్యకు లెక్కలేదు. ప్రస్తుత అధ్యక్షుడు వ్యక్తిగతంగా అవినీతిపరుడు కాకున్నా ఆ సమస్యను అరికట్టలేదు.
మొత్తంమీద వీరందరి అసమర్థ పాలన కారణంగా విద్యుత్, మంచినీళ్లు, విద్యావైద్యాలు, తీవ్ర నిరుద్యోగం, వివిధ పౌర సదుపాయాల సమస్యలు పెరగటం మొదలైంది. ఆర్థిక వ్యవస్థ కూడా బలహీనపడుతుండటం వల్ల, ఒకప్పుడు మొత్తం ఆఫ్రికాలోనే మొదటి స్థానంలో ఉండిన వ్యవస్థ కొన్నేళ్ల క్రితమే నైజీరియా తర్వాత రెండవ స్థానానికి పడిపోయింది. ఈ పరిణామ క్రమాలను గమనించినపుడు ఈరోజున ఏఎన్‌సీ తన మెజారిటీని కోల్పోవటంలో ఆశ్చర్యం కనిపించదు.
ఏఎన్‌సీ ఓట్లశాతం 57.5 (2019) నుంచి 40.2కు తగ్గింది. 400 బలం గల నేషనల్ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 230 నుంచి 159కు పడిపోయింది. కనుక ఇతరులతో పొత్తు తప్పదు. రెండవ స్థానంలో గల డెమోక్రటిక్ అలయన్స్ తెల్లవారిది. అందువల్ల విధానాల సమస్య ఉంటుంది. మూడవ స్థానంలో గల మాజీ అధ్యక్షుడు జేకబ్ జుమా(ఏఎన్‌సీ తరఫున దేశాధ్యక్షుడిగా ఉండిన జుమా మద్దతుతో కొత్త పార్టీ ఏర్పడింది) అవినీతి కేసులో జైలుకు వెళ్లినవాడు. అనగా, ప్రభుత్వ ఏర్పాటుకు పొత్తులు కూడా సమస్య కానున్నాయన్నమాట. అంతిమంగా తేలుతున్నది దక్షిణాఫ్రికా ప్రజల సమస్యలు సమీప భవిష్యత్తులో తీరేవి కాదని!
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకులు
Comments
Please login to add a commentAdd a comment