ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరంగా మ్యాథ్స్ చెప్పే టీచర్‌గా ఘనత
బిగ్ ఇంటర్నెట్ మ్యాథ్స్ పోటీలో గెలిచిన తొలి ఆఫ్రికన్ యువతరంగం
గణితం అంటేనే ఆమడదూరం పరిగెత్తేవాళ్లు మనలో చాలా మందే ఉన్నారు. మొదట్లో గణితంపై పెద్దగా ఆసక్తి చూపని ఓ అమ్మాయి ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరంగా గణితాన్ని విడమరిచి చెప్పే లెక్కల టీచర్‌గా చరిత్ర సృష్టించారు.
ఇటీవల జరిగిన ప్రఖ్యాత గణిత పాఠాల పోటీ ‘బిగ్ ఇంటర్నెట్ మ్యాథ్–ఆఫ్’లో ఘనా దేశానికి చెందిన 35 ఏళ్ల ఏంజెలా తబిరి 16 మందిని వెనక్కునెట్టి ప్రపంచవిజేతగా జయకేతనం ఎగరేసింది. ఈ పోటీలో నెగ్గిన తొలి ఆఫ్రికన్‌గా, అందులోనూ తొలి ఆఫ్రికన్ మహిళగా చరిత్ర సృష్టించారు. సమస్యల పరిష్కారంపై ఉన్న మక్కువే తనను మ్యాథ్స్ వైపు నడిపించించిందని తబిరి చెబుతున్నారు. తన విజయం మరింత మంది ఆఫ్రికన్ మహిళలు గణితాన్ని అభ్యసించేందుకు ప్రేరణగా నిలుస్తుందని నమ్ముతున్నారు.
ఘనా మ్యాథ్స్ క్వీన్
డాక్టర్ తబిరి ఆఫ్రికన్ ఇనిస్టిట్యూట్ ఫర్ మ్యాథమేటికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో అణు బీజగణితం బోధించడంలో నిపుణురాలిగా పేరు సాధించారు. ఇంతటి ఘనత సాధించిన ఘనా దేశస్తురాలి గణితపర్వం ఒక ప్రణాళికాబద్ధంగా మొదలుకాలేదు. ఘనాలో పారిశ్రామికరంగానికి కేంద్ర స్థానంగా ఉన్న రాజధాని నగరం అక్రా సమీపంలోని టెమా నౌకాపట్టణంలోని అషైమాన్ మురికివాడలో ఆమె పెరిగారు. నలుగురు తోబుట్టువులతో ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది. ఇది సంతోషాన్నిచ్చినా చదువుకోవడానికి మాత్రం ఇబ్బంది ఉండేది.
స్థానిక యూత్ కమ్యూనిటీ సెంటర్‌లో చదువుకునేవారు. తన ఇద్దరు సోదరీమణుల్లాగే యూనివర్సిటీలో బిజినెస్ అడ్మిని్రస్టేషన్ చేయాలనుకుంది. అందుకు సరిపడా విద్యా గ్రేడ్స్ లేకపోవడంతో బదులుగా గణితం, ఆర్థిక శా్రస్తాన్ని ఎంచుకుంది. అదే ఆమెకు కలిసొచ్చింది. గణిత సూత్రాలు ఆమెను విశేషంగా ఆకట్టుకున్నాయి. చివరకు గణితాన్నే తన కెరీర్‌గా ఎంచకున్నారు.
2015లో స్కాట్లాండ్‌లోని గ్లాస్గో విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేసేందుకు స్కాలర్‌షిప్ సైతం సంపాదించారు. 1950వ దశకంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో పనిచేసిన నల్లజాతి అమెరికన్ మహిళా గణిత శాస్త్రవేత్తల జీవితగాథలున్న ‘హిడెన్ ఫిగర్స్’సినిమా చూశాక ఎంతో స్ఫూర్తిపొందానని ఆమె తెలిపారు. ‘‘ప్రపంచ వేదికపై నల్లజాతి మహిళల కథ నాకెంతో స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా కేథరిన్ జాన్సన్ నుంచి ఎంతో ప్రేరణ పొందా. ఇది నా జీవితంలో కీలక మలుపు’’అని ఆమె అన్నారు.
మహిళల్లో గణిత అధ్యయనాన్ని పెంచేందుకు..
గణితంలో డాక్టరేట్ అందుకున్న తబిరి లాభాపేక్షలేని సంస్థ ‘ఫెమ్ ఆఫ్రికా మ్యాథ్స్’నడిపిస్తున్నారు. అత్యంత వెనుకబడిన వర్గాల్లోని ఆఫ్రికన్ బాలికలు, మహిళల గణిత కలలను సాకారం చేసుకోవడానికి తబిరి తన పూర్తి మద్దతు పలికారు. హైసూ్కల్ విద్యార్థులకు ఉచితంగా ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మహిళా గణిత శాస్త్రవేత్తలతో ఇంటర్వ్యూలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడామె సేవలు ఘనా, సెనెగల్, కామెరూన్, రువాండా దేశాలకూ విస్తరించాయి.
ఘనాలోని ఉన్నత లేదా మాధ్యమిక పాఠశాల బాలికలకు మార్గదర్శకం చేసే ‘గాళ్స్ ఇన్ మ్యాథమెటికల్ సైన్సెస్’ ప్రోగ్రామ్‌కు తబిరి అకడమిక్ మేనేజర్ వ్యవహరిస్తున్నారు. ‘‘హైసూ్కల్లో గణితం చదివే బాలికలు, బాలుర సంఖ్య దాదాపు సమానంగా ఉందని, విశ్వవిద్యాలయ స్థాయిలో అది తగ్గిపోతోంది. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నిస్తున్నా’’అని ఆమె అన్నారు. ఆధునిక క్వాంటమ్ మెకానిక్స్ 100వ వార్షికోత్సవం సందర్భంగా 2025ను ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించాలనే ప్రతిపాదనలకు మెక్సికో మద్దతుతో ఘనా తరపున నాయకత్వం వహిస్తున్నారు.
నిజ జీవిత సమస్యల పరిష్కారానికి..
‘‘పిల్లలు తమ పాఠశాల పాఠాలను ఊరకే నేర్చుకోకుండా ఉన్నత లక్ష్యాల సాధనకు పనిముట్టుగా వాడుకోవాలి’’అని తబిరి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసు్కలైన ఆఫ్రికా జనాభా 2040 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద శ్రామిక శక్తిగా అవతరిస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అలాంటి పాఠశాల విద్యార్థులకు క్వాంటమ్ సైన్స్‌ను పరిచయం చేయడంలో తొలి అడుగుగా ‘క్వాంటమ్ రోడ్ షో’ను నిర్వహించాలని ఆమె భావిస్తున్నారు.
యునెస్కోతో కలిసి పనిచేస్తున్న తబిరి వివిధ ఆఫ్రికా దేశాలకు చెందిన సుమారు 40 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు జూలైలో ఎయిమ్స్–ఘనాలో వారం రోజుల పాటు ‘క్వాంటమ్ హ్యాకథాన్’ను నిర్వహించనున్నారు. తాము ఎదుర్కొంటున్న సవాళ్లను, నిజ జీవిత సమస్యలను పరిష్కరించడానికి క్వాంటమ్ నైపుణ్యాలను ఉపయోగించాలని కోరుకుంటున్నామని చెబుతున్నారు. తబిరి విజయం కేవలం ఆమె వ్యక్తిగత విజయం కాదు. ఆఫ్రికన్ భవిష్యత్ తరాల గణిత శాస్త్రవేత్తలకు, ముఖ్యంగా ఆఫ్రికన్ మహిళలకు ఆశాదీపంగా మారింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment