పండుగలు, జాతరలు భక్తితోనే కాదు సరదా సంబరాలతోనూ మైమరపిస్తాయి!కోడి పందేలు, ఎడ్ల పందేలు వంటి వాటికి అవే వేదికలు! ఇప్పుడు గాడిదల పోటీలూ మొదలయ్యాయి.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం, కడపజిల్లాల్లో! ఆ వివరాలు..
మోటారు వాహనాలు పెరగడంతో రవాణా మొదలు చాలా విషయాల్లో పశువుల మీద ఆధారపడే పరిస్థితి దాదాపుగా కనుమరుగైందనే చెప్పొచ్చు. ఆ క్రమంలో రజకులకు గార్దభాల అవసరమూ లేకుండా పోయింది. కానీ కొన్ని కుటుంబాలు మాత్రం ఇంకా వాటి ఆధారంగానే జీవనం సాగిస్తున్నాయి. ఆ జంతువులను సంరక్షిస్తున్నాయి. పండుగల వేళ వీటితో కలసి సంబరాలు చేసుకునే ఆనవాయితీని కొనసాగిస్తున్నాయి. ఆయా పర్వదినాల్లో వాళ్లు వాటిని చక్కగా అలంకరించి, పూజలు చేసి, ఊరేగించి వాటి ప్రత్యేకతను చాటుతున్నారు. వాటి మధ్య పందేలు నిర్వహిస్తున్నారు.
ఫలానా ప్రాంతంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు కరపత్రాలను ముద్రిస్తారు. ఆ సమాచారాన్ని ముందుగా అందుకున్నవారు మిగిలిన పోటీదారులందరికీ వాట్సాప్ చేస్తారు. ఈ పోటీలను కర్నూలు జిల్లాతో పాటు అనంతపురం, కడప తదితర ప్రాంతాల్లోనూ నిర్వహిస్తున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా కొన్ని మగ గార్దభాలను సిద్ధం చేస్తారు. ప్రతిరోజూ వీటిపై ఇసుక మూటలను వేసి నేల మీదే కాదు నీటిలోనూపరుగెత్తుతూ శిక్షణనిస్తారు. వీటికి మొక్కజొన్న పిండి, మినప పొట్టు, సజ్జలు తదితరాలను ఆహారంగా పెడతారు.
పోటీ పదినిమిషాలే..
బరువును లాగే ఈ గాడిదల పోటీల వ్యవధి కేవలం పదినిమిషాలే! 80 పల్ల ఇసుక (రెండు క్వింటాళ్ల పది కిలోలు)తో పోటీలు నిర్వహిస్తారు. ఆ బరువుతో నిర్దేశించిన పది నిమిషాల్లో ఏ గాడిదైతే ఎక్కువ దూరం వెళ్తుందో దానినే విజేతగా నిర్ణయిస్తారు. విజేతకు నగదు, లేదా వెండిని బహుమతిగా అందిస్తారు. నగదు రూ. 5వేలు మొదలుకొని రూ. 20వేలకు పైనే ఉంటుంది. ఈ పోటీల కోసం అనంతపురం, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లి మరీ గాడిదలను కొంటున్నారు. బ్రీడ్ ఆధారంగా తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లోని గాడిదలను కొనుగోలు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వీటి ధర రూ. 50వేలు మొదలుకొని రూ.లక్షకు పైనే ఉంటుంది. వీటి జీవిత కాలం సుమారు 30 ఏళ్లు. అయితే పోటీల్లో పాల్గొనే గాడిదలకు వయసుతో సంబంధం ఉండదు. మోసే బరువే ప్రామాణికం.
లీటరు పాలు రూ.7వేలకు పైనే
గాడిద పాలకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. లీటరు పాల ధర రూ.7వేలకు పైగా పలుకుతోంది. అనంతపురం, బెంగళూరు తదితర ప్రాంతాల్లో డెయిరీలు సైతం ఏర్పాటయ్యాయి. రోజుకు ఓ గాడిద నుంచి 200 మి.లీ. పాలను సేకరిస్తారు. వీటిని పలు వ్యాధులను నయం చేసేందుకు వినియోగిస్తున్నారు. ఇతర జిల్లాల్లో గాడిద మాంసానికీ డిమాండ్ ఉంటోంది. అందుకే రాత్రివేళల్లో ఆయా ప్రాంతాల వాళ్లు వచ్చి వీటిని ఎత్తుకుపోతున్నట్లు యజమానులు ఆందోళన చెందుతున్నారు.
బురదనీటిలో సంబరం
ఉగాది రోజున కర్నూలు పట్టణంలోని కల్లూరులో కొలువైన చౌడేశ్వరీ మాత దేవాలయ ప్రాంగణాన్ని బురదతో చిక్కగా అలికేస్తారు. గార్దభాలను ముస్తాబు చేసి బండ్లు కడతారు. ఆ బురదలో వీటికి పోటీ నిర్వహిస్తారు. దీన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు.
గుర్తింపు ఉంటోంది
పండుగలు, జాతరల సమయంలో మా జీవితాల్లో భాగమైన గార్దభాలతో సరదాగా బరువులను లాగించే పోటీలను నిర్వహిస్తున్నాం. పోటీల్లో బహుమతి సాధిస్తే గ్రామంలో మంచి గుర్తింపు ఉంటోంది. ఎక్కడ పోటీలు నిర్వహించినా వీటిని తీసుకెళ్తున్నాం.
– చాకలి నాగ మద్దిలేటి, ముక్కమల్ల
ఓ సరదా
ఆరు సంవత్సరాలుగా గాడిదను పోటీలకు తీసుకెళ్తున్నా. అది ఇప్పటి వరకు 60 పందేల్లో పాల్గొంది. పోయిన ప్రతిచోటా మొదటి లేదా రెండోస్థానాన్ని గెలుచుకుంటోంది. అలా వచ్చిన డబ్బు రాకపోకలకే సరిపోతోంది. అయినా పోటీల్లో పాల్గొనడం ఓ సరదా. ఆ గెలుపుతో మాకు, మా ఊరికి పేరొస్తే చాలు!
– చాకలి సుబ్బరాయుడు, వేల్పనూరు
· పి.ఎస్.శ్రీనివాసులు నాయుడు, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment