నవవధువు కుడికాలే ఎందుకు పెట్టాలి?
నివృత్తం
పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చాక కుడికాలు లోపల పెట్టి రమ్మని వధువుకు చెబుతూ ఉంటారు పెద్దలు. ఎడమకాలు పెడితే అశుభాలు జరుగుతాయని అంటారు. దీనికి సాక్ష్యంగా రామాయణంలో హనుమంతుడిని చూపిస్తుంటారు.
సీతను అన్వేషిస్తూ లంకకు చేరుకున్న హనుమంతుడు, కావాలని తన ఎడమకాలును మొదట ఆ నేలమీద మోపుతాడు. కుడిపాదం పెడితే రావణాసురుడికి సకల శుభాలు కలుగుతాయనీ, తాను వైరానికే సిద్ధపడి వచ్చాను కాబట్టి ఎడమ పాదం పెట్టడమే మంచిదనీ భావించి అలా చేస్తాడు. అంటే... గొడవకు సిద్ధపడి వచ్చేవారు ఎడమ పాదమే మోపుతారని తెలుస్తోంది. శుభం జరగాలని కోరుకునేవారు ఎవరైనా కూడా కుడి పాదమే మోపాలని అర్థమవుతోంది.
కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు...
ఒక అడవిలో ఓ గాడిద ఉండేది. అది కడుపు నిండా తిండి మేస్తూ, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుండేది. ఓసారి దానికి ఇంకో గాడిద కనిపించింది. ‘నిన్నిక్కడ ఎప్పుడూ చూళ్లేదు, అడవికి కొత్తగా వచ్చావా’ అనడిగింది మొదటి గాడిద. ‘లేదు, మా యజమానీ, నేనూ పట్నం వెళ్లి మా ఊరికి తిరిగొస్తున్నాం, దారిలో ఇక్కడ ఆగాం’ అని చెప్పింది రెండో గాడిద. అక్కడితో ఆపకుండా... ‘ఇక్కడ అడవిలో ఏం బతుకుతావ్, మా ఊరిలో చాలా బాగుంటుంది, నాతో రా’ అంటూ దాన్ని రెచ్చగొట్టింది. అది నమ్మి ఇది కూడా దాని వెనుక బయలుదేరింది. తీరా అక్కడికెళ్లాక యజమాని ఇద్దరితో చాకిరీ చేయించసాగాడు. పైగా తిండి సరిగ్గా పెట్టేవాడు కాదు. దాంతో... అడవిలోనే ఉంటే తిండయినా దొరికేది కదా అని కన్నీళ్లు పెట్టుకుందా గాడిద. ఈ కథను అనుసరించే పై సామెత పుట్టుకొచ్చింది.