పెళ్లి కాకపోతే ఫేమస్ అవుతారా?
వ్యక్తిగతం
ఈ మధ్య ఏ అబ్బాయిని కదిలించినా పెళ్లిగోలే. ఓటుకు వేలవేలకు పోసేకన్నా ఒక్క సంబంధం చూసి అతనితో ఓటు వేయించుకోవచ్చు. ఇది చాలాచోట్ల పరిస్థితి. అయితే ఈ పెళ్లి కాని వారందరికీ ఆనందాన్ని కలిగించే ఒక విషయం చెప్పాలి. దేశంలో పెళ్లి కాని ప్రముఖల సంఖ్య చాలా ఎక్కువట. పెళ్లి కాని రాజకీయ నేతలు పెళ్లయిన వారి కంటే పవర్‌ఫుల్ రాజకీయాలు చేస్తున్నారట. వాళ్లెవరో చూడండి... ఏమో మీరు కూడా పెళ్లి కాకుంటే ఫేమస్ అవుతారేమో!
వాజ్‌పేయి: భారత మాజీ ప్రధాని, బీజేపీలో ముస్లింల మన్నన పొందిన నేత అటల్ బిహారీ వాజ్‌పేయి. 1996-2004 వరకు భారత ప్రధానిగా సేవలందించారు. ఆయన మంచి కవి కూడా. ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రికలు ఆయన రచనలు ప్రచురించాయి. అలాగే, ఐదేళ్లు కొనసాగిన ఏకైక కాంగ్రెసేతర ప్రధాని వాజ్‌పేయి. 1924లో పుట్టిన వాజ్‌పేయి 1942లో రాజకీయాల్లోకి వచ్చారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నారాయన. వయసు 89.
మమతా బెనర్జీ: తొలుత కాంగ్రెస్ నేత. 1970లలో మహిళా కాంగ్రెస్‌కు జనరల్ సెక్రటరీ. 1997లో సొంతంగా పార్టీ పెట్టి సంచలనం సృష్టించారు. అత్యంత సుదీర్ఘంగా కొనసాగిన కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని పడదోసి ప.బెంగాల్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ను ప్రతిపక్షం చేసేశారు. తిరిగి కాంగ్రెస్ కూటమితో జతకట్టి తొలి మహిళా రైల్వే మంత్రి అయ్యారు. ఆమెను బెంగాళీలు ‘దీదీ’ అని పిలుస్తారు. అంటే పెద్దక్క అని అర్థం. దేశంలోని నిస్వార్థ, నిజాయితీపరులైన రాజకీయ నేతగా ఆమెకు పేరుంది. ఇప్పటికీ మమతది రెండుగదుల ఇల్లే. వయసు 59.
అబ్దుల్ కలాం: భారత మాజీ రాష్ర్టపతి. ఆ పదవికే వన్నె తెచ్చిన నేత. సాధారణ కుటంబం నుంచి శాస్త్రవేత్తగా ఎదిగారు. ఆయన దృఢ సంకల్పం, నిజాయితీయే దేశ ప్రథమ పౌరుడిగా ఎన్నుకునేలా చేశాయి. ఐదేళ్లలో ఆయన ఎంతో మందిలో స్ఫూర్తిని నింపారు. భారత శక్తిని చాటే పోఖ్రాన్ అణుపరీక్షల్లో ఆయన భాగస్వామ్యం మరువలేనిది. ప్రజల మనిషిగా పిలిచే ఆయన రచయిత కూడా. వయసు 82.
మాయావతి: దళితుల అభ్యున్నతి కోసం పోరాటాలతో పేరుపొందిన మాయావతి కాన్షీరాం పెట్టిన బీఎస్పీ పార్టీలో చేరారు. ఆమె ఆలోచనలకు, వాక్చాతుర్యానికి ముగ్దుడైన కాన్షీరాం ఆమెను 1984లో పార్టీ పెట్టిన వెంటనే అందులోకి తీసుకున్నారు. పట్టుదలతో ఒక్కోమెట్టు ఎదిగిన మాయావతి ఐదేళ్లలో ఎంపీ అయ్యారు. ఉత్తరప్రదేశ్ తొలి మహిళా దళిత ముఖ్యమంత్రి అయ్యారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. ఉత్తరప్రదేశ్‌తో పాటు జాతీయ స్థాయిలో ఆమె పార్టీని విస్తరించారు. ఈమెను ‘బెహెంజీ’ అని పిలుస్తారట. అంటే పెద్దక్క అని. వయసు 58.
జయలలిత: సినిమా నటిగా జీవితాన్ని ప్రారంభించిన జయలలిత అగ్రతారగా రాణించారు. తమిళ, తెలుగు, కన్నడ సినిమాల్లో హీరోయిన్‌గా వెలిగారు. 1982లో రాజకీయాల్లో ప్రవేశించిన జయఅక్కడ కూడా తిరుగులేని నేతగా వెలుగొందారు. కేవలం తొమ్మిదేళ్లలో తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. తమిళనాడు పిన్న వయసు సీఎంగా రికార్డు సృష్టించారు. ఈమెను అక్కడ అమ్మ అని పిలుస్తారు. పెళ్లి చేసుకోలేదు. వయసు 66.
రాహుల్ గాంధీ: సోనియా-రాజీవ్‌ల పుత్రుడు. కాంగ్రెస్ విఫల నేత. వారసత్వంగా 2004లో రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయ్యారు. 2014లో మూడోసారి ఎంపీ అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడు. 2014 ప్రధాని అభ్యర్థి అయినా ఆ పార్టీ ఓటమి చెందడంతో ఎంపీగా మిగిలిపోయారు.
వయసు 43.