
యశవంతపుర: డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన ఆఫ్రికన్ పౌరుడు అనుమానాస్పద రీతిలో మరణించాడు. జేసీ నగర పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఆఫ్రికన్ పౌరున్ని పోలీసులు అరెస్ట్ చేసి 5 గ్రాములు ఎండీఎంఏ అనే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకుని లాకప్‌లో నిర్బంధించారు.
అతనికి ఆరోగ్యం బాగాలేదని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చనిపోయాడు. దీంతో పెద్దసంఖ్యలో ఆఫ్రికన్ పౌరులు పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు పోలీసులపై దాడికి దిగడంతో లాఠీచార్జి చేశారు. మృతుని వివరాలు వెల్లడించలేదు. వీసా కాలపరిమితి ముగిసినా బెంగళూరులో అక్రమంగా ఉంటూ పట్టుబడిన 38 మందిలో అతడు కూడా ఒకడని పోలీసులు తెలిపారు.