Jayes Ranjan
-
భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలదే
శంషాబాద్: చార్జింగ్ కేంద్రాలు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో భవిష్యత్‌లో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారని ఐటీ,పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ అన్నారు. పర్యావరణహిత∙ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రొత్సహిస్తోందన్నారు.స్వీడన్‌కు చెందిన గ్లీడా సంస్థ శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో శ్రీశైలం హైవేలో ఒకేసారి 102 వాహనాలు చార్జింగ్ చేసుకునేలా ఏర్పాటు చేసిన కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జయేశ్‌రంజన్ మాట్లాడుతూ గ్లీడా వంటి సంస్థ దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఈవీ చార్జింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సంస్థ 2018 కేవలం ఒక చార్జింగ్ పాయింట్‌తో ప్రయాణం ప్రారంభించి ప్రస్తుతం నగరంలో మొత్తం 89 కేంద్రాలను విస్తృత పర్చిందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవదేష్ అన్నారు. -
‘బిల్ట్’కు మంచి రోజులు !
సాక్షి, హైదరాబాద్: ఖాయిలా పడిన బల్లార్పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బిల్ట్)కు మంచి రోజులొచ్చాయి. భూపాలపల్లి జిల్లా కమలాపూర్ బిల్ట్ (పూర్వం ఏపీ రేయాన్స్) పునరుద్ధరణకు రూ.192 కోట్లు విలువ చేసే ప్రత్యేక రాయితీ, ప్రోత్సాహాకాలను మంజూరు చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రం ఏర్పడటానికి ముందు 2014 ఏప్రిల్‌లో బిల్ట్ మూత పడటంతో 750 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. కంపెనీ పునరుద్ధరణ కోసం యాజమాన్యంతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కె. తారకరామారావు, చందూలాల్ పలు మార్లు చర్చలు జరిపారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లుగా కంపెనీ యాజమాన్యం, కార్మికులు, కార్మిక శాఖ అధికారులు, కార్మిక సం ఘాల నేతలతో ఈ సమావేశాలు జరిగాయి. గత నెల జరిగిన చర్చల సందర్భంగా కంపెనీ పునరుద్ధరణకు నిర్ణయం తీసుకొని వారం రోజుల్లో ప్రణాళికలతో రావాలని ప్రభుత్వం యాజమాన్యానికి సూచించింది. ఈ క్రమంలో కంపెనీ కోరిన పునరుద్ధరణ ప్యాకేజీ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. పెట్టుబడి రాయితీ రూ.12.5 కోట్లు.. ముడి సరుకు (పల్ప్ వుడ్) కొనుగోళ్లపై ఏటా రూ.21 కోట్లు చొప్పున ఏడేళ్ల పాటు, విద్యుత్ కొనుగోళ్లపై ఏటా రూ.9 కోట్లు చొప్పున ఐదేళ్ల పాటు.. మొత్తం రూ.192 కోట్ల రాయితీని ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి అదనంగా మెట్రిక్ టన్ను బొగ్గుపై రూ.1,000 చొప్పున ఏటా 1,50,000 మెట్రిక్ టన్నుల బొగ్గుకు ఏడేళ్ల పాటు రాయితీ అందించనుంది. కంపెనీ ప్లాంట్ ఆధునికీకరణకు యాజమాన్యం అదనంగా రూ.125 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాగా, అందులో 10 శాతాన్ని పెట్టుబడి రాయితీగా రూ.12.5 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది. కంపెనీ నుంచి రావాల్సిన పన్నులు, విద్యుత్ బకాయిలు, అటవీ శాఖకు రావాల్సిన బకాయిలను విడతల వారీగా రాబట్టుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వానికి రూ.34.5 కోట్ల వాణిజ్య పన్నుల బకాయిలను చెల్లించాల్సి ఉండగా, తక్షణమే రూ.10 కోట్లు.. మిగిలిన బకాయిలను వడ్డీ లేని వాయిదాలుగా 60 నెలల్లో చెల్లించాలని ప్రభుత్వం కోరింది. రూ.3.34 కోట్ల విద్యుత్ బిల్లులను చెల్లించాల్సి ఉండగా, తక్షణమే రూ.కోటి.. మిగిలిన బకాయిలను 30 నెల వాయిదాల్లో చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అలాగే అటవీ శాఖకు రూ.4.75 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా, రెండేళ్ల మారటోరియాన్ని ప్రభుత్వం విధించింది. ఆ తర్వాత వడ్డీ లేకుండా 30 నెలల వాయిదాల్లో చెల్లించాలని కోరింది. మరో విజయం: కేటీఆర్ కొత్త పరిశ్రమల ఏర్పాటుతో పాటు మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణకు కేసీఆర్ మార్గదర్శనంలో ముందుకు సాగుతున్న తమకు దక్కిన మరో విజయం ‘బిల్ట్’అని కేటీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో వందల కుటుంబాలకు ఉపాధి లభిస్తుందన్నారు. తమ ప్రభుత్వం కార్మిక పక్షపాతి అని, కార్మికుల బతుకులు బాగు చేయడానికి ఖాయిలా పరిశ్రమలను పునరుద్ధరించే విధానాన్ని అమలు చేస్తోందన్నారు. -
జిల్లాలో పారిశ్రామిక పార్కులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(టీఐఐసీ) మేనేజింగ్ డెరైక్టర్ జయేశ్ రంజన్ స్పష్టం చేశారు. జిల్లాలో పారిశ్రామిక పార్కులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్లతో పరిశ్రమల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మారుమూల ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్పులు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలున్నాయని చెప్పారు. జిల్లాలో 58,840 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేశామని, దీంట్లో 19,383 ఎకరాలు పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉందని జిల్లా రెవెన్యూ అధికారి సూర్యారావు వివరించారు. అలాగే 16,365 ఎకరాలు కొండలు, గుట్టలతో మిళితమై ఉన్నట్లు సర్వేలో తేలిందని, మిగతా 23 వేల ఎకరాలు బిట్లు బిట్లుగా(తక్కువ విస్తీర్ణంలో) ఉందని తెలిపారు. కుల్కచర్ల, నవాబ్‌పేట, మోమిన్‌పేట, బషీరాబాద్, మర్పల్లి, తాండూరు, వికారాబాద్, యాచారం మండలాల్లో సగటున వేయి ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించామని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వికారాబాద్ సబ్‌కలెక్టర్ హరినారాయణ్, పరిశ్రమల శాఖ మేనేజర్ ఉదయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో 1,200 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ‘ఇ-సిటీ’లో అడుగు పెట్టేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి. తొలుత 64 కంపెనీలు రూ.1,200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. ప్రత్యక్షంగా 35 వేల మందికి, పరోక్షంగా 2.10 లక్షల మందికి ఉపాధి లభించనుంది. మరో 150 కంపెనీలు ప్లాంట్లను పెట్టేందుకు సుముఖంగా ఉన్నాయని ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఎలియాప్) చెబుతోంది. స్థలం ధర విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కోసం కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. ప్లాంట్ల ఏర్పాటు కార్యరూపంలోకి వస్తే ఎలక్ట్రానిక్స్ రంగంలో హైదరాబాద్ కొత్త పుంతలు తొక్కడం ఖాయమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. వ్యాపారావకాశాలు మెరుగై మరిన్ని కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఐటీఐఆర్ పరిధిలో.. హైదరాబాద్ సమీపంలో రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల ఏర్పాటుకు గత ఏడాదే కేంద్రం అనుమతించింది. ఫ్యాబ్‌సిటీలో 602 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ సిటీ (ఇ-సిటీ) పేరుతో, రెండోది అనుబంధ పరిశ్రమల కోసం మహేశ్వరం వద్ద 310 ఎకరాల్లో క్లస్టర్లు ఏర్పాటు కానున్నాయి. ఈ రెండు క్లస్టర్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) పరిధిలోకి వస్తాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంలో ఇ-సిటీ ఉండడంతో ఎగుమతులకు కలిసి వస్తుందని కంపెనీలు భావిస్తున్నాయి. తయారీ రంగానికి బూస్ట్నిచ్చేలా బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన వరాలు అమలైతే పరిశ్రమ రూపురేఖలు మారతాయన్నది కంపెనీల విశ్వాసం. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా రెండు మూడు వారాల్లోనే ప్రాజెక్టులకు కావాల్సిన అన్ని అనుమతులు ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉంది. ధర విషయంలోనే.. ఇ-సిటీలో ప్లాంట్ల ఏర్పాటుకు ఏడాదికిపైగా కాలంగా ఎలియాప్ తీవ్రంగా కృషి చేస్తోంది. ధర విషయంలో స్పష్టత రాకపోవడం, ఆ తర్వాత ఎన్నికల కోడ్‌తో ప్రతిపాదన కాస్తా ఆలస్యమైంది. కొత్త ప్రభుత్వం రాకతో తిరిగి ప్రక్రియను ఎలియాప్ వేగిరం చేసింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు వివిధ శాఖల అధికారులతో చర్చలు జరుపుతోంది. ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఎలియాప్ ప్రెసిడెంట్, ల్యామ్‌పెక్స్ ఎలక్ట్రానిక్స్ ఎండీ ఎన్.శివప్రసాద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. 64 కంపెనీలు తొలి దశలో రూ.1,200 కోట్లు వెచ్చిస్తాయని పేర్కొన్నారు. టీఎస్ఐఐసీ ఎకరాకు రూ.35 లక్షలు చెబుతోందని, ఇంత మొత్తం చెల్లించే స్తోమత కంపెనీలకు లేదని తెలిపారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ప్రభుత్వం నుంచి త్వరలోనే తీపి కబురు వస్తుందని విశ్వసిస్తున్నట్టు ఎలికో ఎండీ రమేష్ దాట్ల చెప్పారు. ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైతే హైదరాబాద్‌కు మరిన్ని సంస్థలు వస్తాయని అన్నారు. కంపెనీలకు పూర్తి తోడ్పాటు.. ప్లాంట్ల ఏర్పాటుకు కావాల్సిన పూర్తి సహకారం ప్రభుత్వం నుంచి ఉంటుందని తెలంగాణ పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏవైతే వర్తిస్తాయో అవే ప్రయోజనాలు తెలంగాణలోనూ అమలవుతాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో పరిశ్రమల ప్రతినిధులు ఆందోళన చెందక్కర లేదని అన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీయే స్థలం ధర నిర్ణయిస్తుందని తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ) ఎండీ జయేష్ రంజన్ వెల్లడించారు.