‘బిల్ట్‌’కు మంచి రోజులు !  | Government approval for renewal plans | Sakshi
Sakshi News home page

‘బిల్ట్‌’కు మంచి రోజులు ! 

Published Thu, Sep 6 2018 2:23 AM | Last Updated on Thu, Sep 6 2018 2:23 AM

Government approval for renewal plans - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ఖాయిలా పడిన బల్లార్‌పూర్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (బిల్ట్‌)కు మంచి రోజులొచ్చాయి. భూపాలపల్లి జిల్లా కమలాపూర్‌ బిల్ట్‌ (పూర్వం ఏపీ రేయాన్స్‌) పునరుద్ధరణకు రూ.192 కోట్లు విలువ చేసే ప్రత్యేక రాయితీ, ప్రోత్సాహాకాలను మంజూరు చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రం ఏర్పడటానికి ముందు 2014 ఏప్రిల్‌లో బిల్ట్‌ మూత పడటంతో 750 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి.

కంపెనీ పునరుద్ధరణ కోసం యాజమాన్యంతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కె. తారకరామారావు, చందూలాల్‌ పలు మార్లు చర్చలు జరిపారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లుగా కంపెనీ యాజమాన్యం, కార్మికులు, కార్మిక శాఖ అధికారులు, కార్మిక సం ఘాల నేతలతో ఈ సమావేశాలు జరిగాయి. గత నెల జరిగిన చర్చల సందర్భంగా కంపెనీ పునరుద్ధరణకు  నిర్ణయం తీసుకొని వారం రోజుల్లో ప్రణాళికలతో రావాలని ప్రభుత్వం యాజమాన్యానికి సూచించింది. ఈ క్రమంలో కంపెనీ కోరిన పునరుద్ధరణ ప్యాకేజీ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారు. 

పెట్టుబడి రాయితీ రూ.12.5 కోట్లు.. 
ముడి సరుకు (పల్ప్‌ వుడ్‌) కొనుగోళ్లపై ఏటా రూ.21 కోట్లు చొప్పున ఏడేళ్ల పాటు, విద్యుత్‌ కొనుగోళ్లపై ఏటా రూ.9 కోట్లు చొప్పున ఐదేళ్ల పాటు.. మొత్తం రూ.192 కోట్ల రాయితీని ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి అదనంగా మెట్రిక్‌ టన్ను బొగ్గుపై రూ.1,000 చొప్పున ఏటా 1,50,000 మెట్రిక్‌ టన్నుల బొగ్గుకు ఏడేళ్ల పాటు రాయితీ అందించనుంది. కంపెనీ ప్లాంట్‌ ఆధునికీకరణకు యాజమాన్యం అదనంగా రూ.125 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాగా, అందులో 10 శాతాన్ని పెట్టుబడి రాయితీగా రూ.12.5 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది.

కంపెనీ నుంచి రావాల్సిన పన్నులు, విద్యుత్‌ బకాయిలు, అటవీ శాఖకు రావాల్సిన బకాయిలను విడతల వారీగా రాబట్టుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వానికి రూ.34.5 కోట్ల వాణిజ్య పన్నుల బకాయిలను చెల్లించాల్సి ఉండగా, తక్షణమే రూ.10 కోట్లు.. మిగిలిన బకాయిలను వడ్డీ లేని వాయిదాలుగా 60 నెలల్లో చెల్లించాలని ప్రభుత్వం కోరింది. రూ.3.34 కోట్ల విద్యుత్‌ బిల్లులను చెల్లించాల్సి ఉండగా, తక్షణమే రూ.కోటి.. మిగిలిన బకాయిలను 30 నెల వాయిదాల్లో చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అలాగే అటవీ శాఖకు రూ.4.75 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా, రెండేళ్ల మారటోరియాన్ని ప్రభుత్వం విధించింది. ఆ తర్వాత వడ్డీ లేకుండా 30 నెలల వాయిదాల్లో చెల్లించాలని కోరింది.

మరో విజయం: కేటీఆర్‌  
కొత్త పరిశ్రమల ఏర్పాటుతో పాటు మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణకు కేసీఆర్‌ మార్గదర్శనంలో ముందుకు సాగుతున్న తమకు దక్కిన మరో విజయం ‘బిల్ట్‌’అని కేటీఆర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో వందల కుటుంబాలకు ఉపాధి లభిస్తుందన్నారు. తమ ప్రభుత్వం కార్మిక పక్షపాతి అని, కార్మికుల బతుకులు బాగు చేయడానికి ఖాయిలా పరిశ్రమలను పునరుద్ధరించే విధానాన్ని అమలు చేస్తోందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement