
క్యాంపు కార్యాలయంలో ఏపీఐఐసీ 50 ఏళ్ల లోగోను ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో పారిశ్రామిక పార్కుల పాత్ర కీలకమని, పారదర్శక విధానాలతో పారిశ్రామిక వాడల ప్రగతికి నిరంతరం కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) 49 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన లోగోను సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఆవిష్కరించారు.
రాష్ట్ర ప్రగతిలో ఏపీఐఐసీ కీలక భూమిక పోషిస్తూ ముందుకు సాగాలని సీఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవీఎన్ సుబ్రహ్మణ్యం, ఏపీఐఐసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏడాదిపాటు నిర్వహించే ఏపీఐఐసీ స్వర్ణోత్సవ వేడుకుల వివరాలను ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలియచేశారు.
రాష్ట్రంలో శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి
మంగళగిరిలోని ప్రధాన కార్యాలయంలో ఏపీఐఐసీ స్వర్ణోత్సవ వేడుకలను పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రారంభించారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో ఏపీఐఐసీ పాత్ర మరువలేనిదని చెప్పారు. ప్రస్తుతం ఏపీఐఐసీ చేతిలో ఉన్న 1.50 లక్షల ఎకరాలను వినియోగించుకుంటూ మరింత పారిశ్రామిక ప్రగతి సాధిస్తామన్నారు.
సీఎం జగన్ నాయకత్వలో రాష్ట్రం పారిశ్రామికంగా శరవేగంగా పురోగమిస్తోందని తెలిపారు. ఏపీఐఐసీలో ఉత్తమ పనితీరు కనపర్చిన ఉద్యోగులకు ఈ సందర్భంగా మంత్రి అవార్డులను అందచేశారు. ఏపీ ఎకనామిక్ బోర్డు (ఏపీఈడీబీ) కొత్తగా రూపొందించిన వెబ్‌సైట్‌ను మంత్రి ఆవిష్కరించారు.
ఏడాది పాటు ఉత్సవాలు
2023 సంవత్సరాన్ని ఏపీఐఐసీ గోల్డెన్ జూబ్లీ ఇయర్‌గా ప్రకటించి ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు ఏపీఐఐసీ ద్వారా 21 లక్షల మందికి ఉపాధి కల్పించడంతోపాటు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులను తెచ్చినట్లు చెప్పారు. సింగిల్ డెస్క్ విధానంలో భాగంగా ఏపీఐఐసీ ప్రవేశపెట్టిన 14 రకాల ఆన్‌లైన్ సేవలకు మంచి స్పందన వస్తోందని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు.
రూ.20 కోట్లతో మొదలై రూ.5,000 కోట్లకు
రూ.20 కోట్లతో ప్రారంభమైన సంస్థ ఇప్పుడు రూ.5,000 కోట్ల స్థాయికి చేరుకుందని ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. కార్యక్రమానికి సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి హాజరై అత్యుత్తమ పనితీరు కనపరచిన ఏపీఐఐసీ ఉద్యోగులకు అవార్డులు అందచేసి అభినందించారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో షన్ మోహన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు.