భారత్‌లో చైనా పారిశ్రామిక పార్కులు | China's industrial parks in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో చైనా పారిశ్రామిక పార్కులు

Published Tue, Jul 1 2014 12:43 AM | Last Updated on Wed, Oct 17 2018 5:55 PM

భారత్‌లో చైనా పారిశ్రామిక పార్కులు - Sakshi

భారత్‌లో చైనా పారిశ్రామిక పార్కులు

 అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఇరు దేశాలు

 వాణిజ్య లోటు భర్తీ దిశగా చర్యలు
 
బీజింగ్: భారత్‌లో చైనా సంస్థలు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసే దిశగా ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. అలాగే, బ్రహ్మపుత్ర నది వరదల గణాంకాలను ఇచ్చిపుచ్చుకునేందుకు, పాలన సంబంధ అంశాలపై ఇరుదేశాల అధికారులు తరచూ చర్చించుకునేందుకు మరో రెండు ఒప్పందాలు కుదిరాయి.

పంచశీల్ 60వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు చైనా పర్యటనకు వచ్చిన భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, చైనా ఉపాధ్యక్షుడు లి యువాన్‌చావోల సమక్షంలో సోమవారం ఈ ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల సహకారం, రెండు దేశాల వాణిజ్య సంస్థల మధ్య సహకారం పెంపొందించడాన్ని మరింత విస్తరించాలని ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. రెండు పొరుగు దేశాలు ఏక కాలంలో శక్తిమంతమైన దేశాలుగా ఎదుగుతుండటం చాలా అరుదుగా జరుగుతుందని అన్సారీ పేర్కొన్నారు.
 
భారత్, చైనాల మధ్య వాణిజ్య లోటు ఏకంగా 35 బిలియన్ డాలర్ల మేర ఉంటున్న నేపథ్యంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటు అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.  ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గతేడాది 65.47 బిలియన్ డాలర్లుగా ఉండగా, ప్రస్తుతం భారత్‌లో చైనా పెట్టుబడులు 1.1 బిలియన్ డాలర్ల మేర మాత్రమే ఉన్నాయి. వాణిజ్య లోటును తగ్గించేందుకు, భారత్‌లో చైనా పెట్టుబడులను మరింత ఆకర్షించేందుకు ప్రతిపాదిత పారిశ్రామిక పార్కులు దోహదపడగలవు. ఇరు దేశాల్లోనూ పెట్టుబడుల విషయంలో పరస్పర సహకారం అందించుకోవడానికి ఈ ఎంవోయూ ఉపయోగపడగలదు. ఈ ఒప్పందం విషయంలో అన్సారీ వెంట వచ్చిన భారత ప్రతినిధి బృందంలోని వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, చైనా వాణిజ్యమంత్రి గావో హుచెంగ్‌తో సమావేశమయ్యారు.
 
వాణిజ్య లోటుతో పాటు వజ్రాభరణాలు, ఫార్మా, ఐటీ తదితర భారత ఉత్పత్తుల విక్రయానికి చైనా మార్కెట్లో అవకాశాలు కల్పించడం తదితర అంశాల గురించి ఇందులో చర్చించినట్లు ఆమె తెలిపారు. చైనాకు ఎగుమతి చేస్తున్న వాటికన్నా ఎక్కువగా భారత్ దిగుమతి చేసుకుంటోందని నిర్మల వివరించారు. భారత్‌లో చైనా పెట్టుబడులు పెరిగితే ఈ అసమానతలు కొంత  మేర అయినా తగ్గగలవని ఆమె పేర్కొన్నారు. తయారీతో పాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రైల్వే వంటి అనేక రంగాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు చైనా కంపెనీలకు అపార అవకాశాలు ఉన్నాయని నిర్మల తెలిపారు. కేంద్రంలో కొత్తగా మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇరు దేశాల వాణిజ్య మంత్రులు సమావేశం కావడం ఇదే ప్రథమం.

అటు, బ్రహ్మపుత్ర నది వరదలకు సంబంధించిన ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా చైనా.. మే 15 నుంచి అక్టోబర్ 15 దాకా సంబంధింత డేటాను భారత్‌కు అందించనుంది. వరదలను అంచనా వేసేందుకు ఇది భారత్‌కు ఎంతగానో తోడ్పాటును అందించనుంది. దీనికోసం చైనా వైపున ఉన్న హైడ్రోలాజికల్ సెంటర్ల మెయింటెనెన్స్‌కి అయ్యే వ్యయాలను భారత ప్రభుత్వం భరిస్తుంది. ఇక, మూడో ఒప్పందం కింద.. రెండు దేశాల ప్రభుత్వ  పాలనా యంత్రాంగం అధికారులు పాలన సంబంధిత విధానాల గురించి చర్చించుకుంటారు.
 
భారత్-చైనా సాంస్కృతిక సంబంధాల ఎన్‌సైక్లోపీడియా ఆవిష్కరణ
దాదాపు రెండు వేల ఏళ్ల కాలం నుంచీ గల సాంస్కృతిక సంబంధాలపై తొలి ఎన్‌సైక్లోపీడియాను భారత్-చైనా ఆవిష్కరించాయి. రెండు దేశాల పరిశోధకులు దీన్ని సంయుక్తంగా రూపొందించారు. ఏడో దశాబ్దంలో చైనా పరిశోధకుడు హ్యుయన్ సాంక్ భారత్‌లో పర్యటించి బౌద్ధ గ్రంధాలను చైనాకు తీసుకెళ్లిన కాలం నుంచి ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల సర్వస్వంగా ఈ ఎన్‌సైక్లోపీడియాను రూపొందించడం జరిగింది. వాణిజ్య, దౌత్య సంబంధాల వివరాలను కూడా ఇందులో పొందుపర్చారు. ఇంగ్లిష్ చైనీస్ భాషల్లో ప్రచురించిన ఈ పుస్తకాలను అన్సారీ, యువాన్ చావోలు సంయుక్తంగా ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement