చిత్తూరు(ఎడ్యుకేషన్): ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి నిచ్చెన వేసిందన్న చందంగా ఉంది సర్వశిక్ష అభియాన్ నూతనంగా తలపెట్టిన మళ్లీ మనబడికి కార్యక్రమం. సర్కారు పాఠశాలల్లో చేరేందుకు పిల్లలకు సవాలక్ష ఆటంకాలు, అనుమానాలు ఎదురవుతున్నాయి. వీటిని బూచిగా చూపించి ప్రైవేటు విద్యాసంస్థలు పిల్లలను ఆకర్షించి వేలాది రూపాయలను ఫీజుల రూపంలో వసూలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న లక్షమంది విద్యార్థులను రాను న్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని కలెక్టర్ ఎస్‌ఎస్‌ఏ అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు.
సర్కారు బడుల బలోపేతానికి కలెక్టర్ ఆలోచన ఆహ్వానించదగినదే అయినప్పటికీ దానికి తగిన సౌకర్యాల కల్పనలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 5,98,676మంది విద్యార్థులు చ దువుతున్నారు. 5,009 ప్రభుత్వ పాఠశాలల్లో 3,67,356మంది, 1,187 ప్రైవేటు పాఠశాలల్లో 2,31,320మంది విద్యార్థులు చదువుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 0-10మంది లోపు విద్యార్థులు 180 పాఠశాలలు, 11-20 మధ్య విద్యార్థులు ఉన్న పాఠశాలలు 713 ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నా యి. 1,744 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోం ది. ప్రయివేటు పాఠశాలల్లో ఫీజులు ఎక్కువగా ఉన్నాయని తెలిసినా విధిలేని పరిస్థితిలో తల్లిదండ్రులు తమ పిల్లలను అందులోనే చేర్చాల్సి వస్తోంది.
ప్రైవేటు పాఠశాలలపై చర్యలేవీ?
జిల్లాలో ప్రమాణాలను పాటిస్తున్న ప్రై వేటు పాఠశాలలను వేళ్లమీద లెక్కపెట్టొ చ్చు. ప్రమాణాలు పాటించని పాఠశాలలపై విద్యాశాఖ చేపట్టిన చర్యలు శూ న్యమనే చెప్పాలి. దీనికితోడు కొత్తగా ప్రైవేటు స్కూళ్ల ఏర్పాటుకు అనుమతులిస్తూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తోంది. కనీస విద్యార్హత లేనివారు కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. విద్యాశాఖకు సమర్పిం చే రికార్డుల్లో మాత్రం అంతా సవ్యంగా ఉన్నట్లు చూపుతున్నారు.
బలవంతపు టార్గెట్లు
సంస్థాగతంగా అనేక లోపాలున్న సర్కా రు బడుల వైపు విద్యార్థులను క్యూకట్టించడం అధికారులకు కత్తిమీద సాము లాంటిదే. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలకు బలవంతపు టార్గెట్లను నిర్ణయించి చేయమనడంపై అంతర్మథనం మొదలైంది. ఏదేమైనప్పటికీ ఈ బాధ్యతను విద్యా శాఖ ఏ మేరకు నెరవేరుస్తుందో తేలాలంటే జూన్ వరకు ఆగాల్సిందే.