నారాయణ చేసింది కూడా నరమేధమే. జినోసైడ్ కంటే తక్కువ పాపమేమీ కాదు. ఈ నారాయణ నలుగురితో నారాయణ మాత్రం కాదు. పరిచయం అక్కర్లేని పేరు. దయ్యాన్ని దయ్యం అనే అంటాం. ఇంకో రకంగా చెప్పలేము. నారాయణ కూడా... నారాయణే! గడిచిన పాతికేళ్లుగా ఒఖ్ఖటి.. ఒఖ్ఖటి... ఒఖ్ఖటి అంటూ కర్ణకఠోరంగా వినిపిస్తున్న పేరు. ఇంకో ఒకరిద్దరితోపాటు ఈ నారాయణ చేసిన నేరాలపై ఇప్పుడు తెలుగు సమాజంలో ఒక చర్చ నడుస్తున్నది.
ఎటువంటి నేరాలవి? రెండు తరాలకు ప్రాతినిధ్యం వహించే లక్షలాదిమంది యువతీ యువకుల మేధోవికాసాన్ని దారుణంగా చిదిమేసిన యుద్ధనేరం. ఉరిమే ఉత్సాహంతో పరుగులు తీయవలసిన ప్రభాత కిరణాలకు సంకెళ్లు వేసిన నేరం. ఆ కిరణాలను బ్రాయిలర్ కోళ్లుగా మార్చిన ఘోరం. కాలేజీ విద్యను కోళ్లఫారాల వ్యాపారంగా ఏమార్చిన వైనం. జైలు గదులకు బడి పేరు పెట్టి బాల్యాన్ని బంధించిన రౌరవకార్యం.
నారాయణాదుల కరెన్సీ చదువుల యాగంలో లక్షలాది మధ్యతరగతి కుటుంబాలు సమిధలుగా మారాయి. అమాయక తల్లిదండ్రుల ఆశల్ని నోట్ల కట్టలుగా తర్జుమా చేసుకున్న విద్యా వ్యాపారం నారాయణ చేసిన నేరం. జాతి భవితను పణంగా పెట్టి లాభాలు పిండుకున్న దేశద్రోహం. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు చేసిన నేరాల కంటే ఈ ‘చైనా’జీ కార్పొరేట్ల నేరాలు ఎక్కువ ప్రమాదకరమైనవి.
న్యూరెన్‌బర్గ్ ప్రత్యేక కోర్టుల కంటే పటిష్ఠమైన ప్రత్యేక న్యాయస్థానాల్లో ఈ యుద్ధ నేరస్థులపై విచారణ జరగాలి. ఎందుకంటే నారాయణాదులు చాలా పవర్‌ఫుల్. దయ్యాలకంటే పవర్‌ఫుల్. ఎంతో పవర్‌ఫుల్ కాకపోతే అరెస్టు చేసిన పోలీసులు ఆయన్ను కోర్టు మెట్లు ఎక్కించకముందే బెయిల్ ఎట్లా ఖాయమవుతుంది? అంత గట్టి లాయర్లుంటారు నారాయణకు! దరఖాస్తు చేయకుండానే బెయిల్ ఎట్లా వచ్చిందని అదనపు అడ్వొకేట్ జనరల్ నోరు వెళ్లబెట్టాల్సి వచ్చింది.
నూతన ఆర్థిక విధానాల గాలులు గేట్‌వే ఆఫ్ ఇండియాలోకి ప్రవేశించక ముందు విద్యారంగంలో ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పట్నించి ఇంకో లెక్కని అన్ని రంగాల్లోనూ ప్రైవేట్ వీరులు తొడలుగొట్టారు. విద్యారంగం లోనూ కొట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆ సమయంలో చంద్ర బాబు ముఖ్యమంత్రిగా ఎక్కువకాలం ఉన్నారు. ప్రైవేటీకరణపై ఆయనకున్న పిచ్చి వ్యామోహానికి మెచ్చి, ప్రపంచ బ్యాంకు జీతగాడు అనే బిరుదును కూడా ప్రదానం చేశారు. ఆయన దన్నుతో విద్యారంగం మార్పులు కూడా శరవేగంగా వినాశ కరంగా పరుగులు తీశాయి.
ఈ మార్పులకు ముందు విద్యారంగంలో ప్రభుత్వానిదే పెద్దవాటా. క్రమక్రమంగా చదువుకునేవారి సంఖ్య పెరుగు తుండడంతో సర్కార్ విద్యాసంస్థల సంఖ్య సరిపోక ప్రైవేట్ ఎయిడెడ్ సంస్థలను కూడా ప్రోత్సహించేవారు. అయితే ఈ సంస్థలేవీ కూడా విద్యార్థులపై పెద్దగా ఆర్థిక భారాన్ని మోపేవి కావు. చదువుతోపాటు ఆటపాటలు, అందుకు తగిన వసతులు, క్రీడా మైదానాలు, సాంస్కృతికోత్సవాలు విద్యార్థులకు అందు బాటులో ఉండేవి. సరస్వతీ విద్యామందిర్‌లు, క్రిస్టియన్ మిష నరీ స్కూళ్లు విద్యార్థుల చదువుపై ఎక్కువ ఫోకస్ పెడుతూనే ఇటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించేవి. విద్యార్థుల సర్వతోముఖ వికాసానికి ప్రభుత్వ సంస్థలకు దీటుగా ప్రైవేట్ సంస్థలు కూడా దోహదపడేవి.
డెబ్బయ్యో దశకంలో సీవిఎన్ ధన్ అనే ఆయన గుంటూరులో ఒక కొత్త ట్రెండ్‌కు ఆద్యుడయ్యారు. ఇంటర్మీ డియట్ చదువును మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల సాధనంగా ఆయన మార్చివేశారు. ఫీజు కొంచెం ఎక్కువ. అందుకని బాగా డబ్బున్నవాళ్లు, రాజకీయ నాయకుల పిల్లలు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వెళ్లి చదువు కోవడం ప్రారంభమైంది. క్రమంగా ఈ తరహా కాలేజీలు కొన్ని విజయవాడ, గుంటూరు పరిసరాల్లో మొలకెత్తాయి.
అయితే మొత్తంగా విద్యావ్యవస్థను తలకిందులు చేసేంత ప్రభావాన్ని మాత్రం అవి చూపెట్టలేదు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీల కార్పొరేట్ శకారంభంతో విద్యారంగం రూపురేఖలు మారి పోయాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన అండదండలతో ఈ విద్యాసంస్థలు చెలరేగిపోయాయి. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ విద్యాసంస్థలను పాడుపెట్టడం కార్పొరేట్ సంస్థలకు వరంగా మారింది. విద్యారంగాన్ని ఈ శక్తులు క్యాన్సర్ వ్రణంలా ఆక్రమించుకున్నాయి. ఫలితం వ్యవస్థ విధ్వంసం. కార్పొరేట్ విద్యావ్యవస్థ దుష్ఫలితాలు సమాజంలోని అనేక రంగాల్లో మనం చూడవచ్చు.
ఇందులో ఒక ఏడు అంశాలైతే స్పష్టంగా మన అనుభవంలోకి వచ్చాయి. 1. సామాజిక విభజన – రెండు గ్లాసుల పద్ధతి వంటి రెండు క్లాసుల విధానం. 2. భవిష్యత్ తరాల సర్వతోముఖ వికాసానికి స్వస్తి. 3. భాషా, సామాజిక శాస్త్రాలపై అలక్ష్యం. 4. విద్యార్థుల్లో ఒత్తిడి, పలాయనవాదం, ఆత్మహత్యల ధోరణి. 5. ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యం. 6. నాలెడ్జి సొసైటీ దివాళా. 7. భవిష్యత్ ఉత్తమశ్రేణి రాజకీయ నాయకత్వానికి సమాధి.
రెండు గ్లాసుల పద్ధతి మనలో చాలామందికి గుర్తుండే ఉంటుంది. గ్రామాల్లో హోటళ్లకు, టీ దుకాణాలకు వచ్చే దళితుల కోసం ఒక గ్లాసు, ఇతరుల కోసం మరో గ్లాసు కేటాయించే సాంఘిక దురాచారం అక్కడక్కడా కనిపించేది. అనేక పోరాటాల తర్వాత అది అంతరించింది. అది మాయమైందో లేదో మరో అనాచారానికి కార్పొరేట్ విద్యాసంస్థలు అంటుకట్టాయి. అదే రెండు క్లాసుల వ్యవస్థ. ఒక మెరుగైన సమాజ నిర్మాణానికి కామన్ స్కూలింగ్‌ను తొలి మెట్టుగా అన్ని నాగరిక దేశాలు భావిస్తున్నాయి. మనదేశంలో మాత్రం కార్పొరేటు విద్యా సంస్థలు రెండు క్లాసుల బర్బర సంస్కృతిని ప్రవేశపెట్టాయి.
ఇది రెండు దశల్లో అమలవుతుంది. కార్పొరేట్ బడుల్లో చదువుకుంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని సగటు తల్లిదండ్రులు భావించేలా ఊదరగొట్టిన కారణంగా దిగువ మధ్యతరగతి వారు సైతం తల తాకట్టుపెట్టయినా అక్కడికే పంపించడానికి అలవాటుపడ్డారు. అప్పటికే ప్రభుత్వం వారు పాడుపెట్టిన కాలేజీలు, స్కూళ్లలో నిరుపేదల పిల్లలు మాత్రమే మిగిలిపోయారు. ఇదొక విభజన. ఇక రెండో విభజన – కార్పొరేట్ సంస్థల్లోనే రెండు క్లాసులు. మంచి ర్యాంకులు రాబట్టవచ్చని ఎంపిక చేసుకున్న ఓ పిడికెడు మందిని ఒక ప్రత్యేక క్లాసులో వేస్తారు.
కొంచెం మ్యాథ్స్‌నూ, కొంచెం సైన్స్‌నూ రోజూ గ్రైండర్‌లో వేసి బాగా రుబ్బిన తర్వాత స్పెషల్ క్లాస్ పిల్లల మెదళ్లలోకి గరాటా పెట్టి పోస్తారు. ఇక మిగిలిన సబ్జెక్టుల కోసం పేపర్ లీకేజీ విధానం. ఇందుకు చేయవలసిన ఏర్పాట్ల కోసం నారాయణ వంటి అధిపతుల ఆధ్వర్యంలోనే ప్రత్యేక సమావేశాలు జరుగుతాయట. ఇతర క్లాసుల్లో ఉండే 90 శాతం మంది విద్యార్థులకు గరాటా, లీకేజీ సౌకర్యాలు ఉండవు. చదువు చెప్పడం కూడా అంతంత మాత్రమే! వీరి కోసం వందల సంఖ్యలో ఉన్న డబ్బా ఇంజనీరింగ్ కాలేజీలు ఎదురు చూస్తుం టాయి. విద్యార్థి దశ నుంచే యువతరం ఆలోచనల్లో సామాజిక విభజనకు బీజం వేసి ఈ కార్పొరేట్ కాలేజీలు రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు యథేచ్ఛగా పాల్పడు తున్నాయి.
ఇక ఈ సంస్థల్లో మనిషి సర్వతోముఖ వికాసానికి ఎటు వంటి అవకాశమూ ఉండదు. ఆటలు పాటలంటే అవేవో బూతుల్లా వినిపిస్తాయిక్కడ! ఈ తరంలోనే పుట్టి పెరిగి, అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఒక సానియా మీర్జా (సెయింట్ మేరీస్)ను గానీ, ఒక పీవీ సింధు (సెయింట్ ఆన్స్)ను గానీ, ఒక మిథాలీరాజ్ (కీస్ హైస్కూల్)ను గానీ ఈ కార్పొరేట్ సంస్థలు సృష్టించలేకపోయాయి.
ఒక సంగీత విద్వాంసుడిని, ఒక చిత్ర కారుడిని, ఒక కవిని, కళాకారుడిని ఈ సంస్థల నుంచి మనం ఊహించలేము. రోజూ క్రమం తప్పకుండా మ్యాథ్స్, సైన్స్ అనే విటమిన్ ఇంజక్షన్లు పొడిపించుకొని బరువు పెరగడమే ధ్యేయంగా బతికే బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తే ఈ సంస్థల లక్ష్యం. ఆ రకంగా యువతరాల సృజనశీలత మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఈ సంస్థలు దేశద్రోహానికి పాల్పడుతున్నాయి.
తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషలు, సోషల్ స్టడీస్ – ఇక్కడ నిషేధిత జాబితాలో ఉంటాయి. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు హిస్టరీ సబ్జెక్టే అనవసరమని బహిరంగంగా ప్రకటించారు. ఈ సూక్తిని కార్పొరేట్ విద్యా సంస్థలు శిరోధార్యంగా స్వీకరించాయి. అప్పటి నుంచి ఈ సబ్జెక్టుల్లో నూటికి 99 మార్కులు తెప్పించడం కోసం పేపర్ లీకేజీ మార్గాన్ని ఈ సంస్థలు ఎంచుకున్నాయి. దేశ చరిత్రను, సంస్కృతిని, భాషలను మరుగుపరిచే ప్రయత్నం చేయడం జాతీయ పతాకాన్ని అవమానించడంతో సమానం.
ఈ సంస్థల్లో చదివే విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని అనేక అధ్యయనాలు, సర్వేలు ఘంటా పథంగా చాటి చెప్పాయి. వీటి నిర్వహణ తీరుతెన్నులు మారాలని నివేదికలు ఇచ్చాయి. ఈ కాలేజీల ధనప్రభావం వల్ల అవన్నీ అటకెక్కాయి. ఆసక్తులన్నింటిని బలవంతంగా అణిచి వేసుకొని, ర్యాంకుల ఒత్తిడిలో నలిగి, విద్యార్థులు జీవితంపై విరక్తి ఏర్పరచుకుంటున్నారు.
ఎదిరించి పోరాడలేని అశక్తతను ఈ విద్యాసంస్థల కోళ్ల ఫారం సంస్కృతి నరాల్లోకి ఎక్కిస్తుంది. ఫలితంగా ఆత్మహత్యల బాట పడుతున్నారు. 2014–19 మధ్యకాలంలో ఒక్క నారాయణ సంస్థల్లోనే 400 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. సామూహిక హత్యలకు ఏ సెక్షన్ల కింద కేసులు పెడతారో, ఆత్మహత్యలకు పురికొల్పడంపై ఏ కేసులు పెడతారో అవన్నీ ఈ సంస్థల మీద పెట్టనవసరం లేదా?
ఆర్థిక సంస్కరణల తొలిదశలో అధికారంలో ఉన్నవారు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ విద్యాసంస్థలను అలక్ష్యం చేసి కార్పొరేట్ సంస్థల వృద్ధికి సహకరించారు. ఫలితంగా వెనుక బడిన పేదవర్గాల ప్రజలు గడిచిన 30 ఏళ్లుగా మెరుగైన విద్యను పొందలేకపోయారు. వెనుకబడిన జాబితాలో మరో రెండు తరాలు కూడా కలిసిపోయాయి. ప్రభుత్వ విద్యాసంస్థలను పాడుపెట్టడమంటే – ఈ దేశ ప్రజల విద్యా హక్కును ఉల్లంఘించడం! మెరుగైన సమాజానికి బాటలు వేసే కామన్ స్కూలింగ్‌ను అడ్డుకోవడం! కలవారు, లేనివారు అనే రెండు రకాలుగా ఈ జాతిని విడదీయడం! ఇండియా – భారత్‌లుగా ఈ దేశాన్ని విభజించడం! ఈ దారుణమైన దురాగతాలకు శిక్ష ఎవరికి వేయాలో సమాజం ఆలోచించాలి.
కార్పొరేట్ కాలేజీల్లో చదువుకున్న వాళ్లలో ఇంతవరకూ ఒక గొప్ప శాస్త్రవేత్త పుట్టలేదు. దేశం గర్వించదగ్గ మేధావి పుట్టలేదు. ఒక అబ్దుల్ కలామ్‌ను ఆశించలేము. ఒక సీవీ రామన్‌ను కలగనలేము. ఈ కార్పొరేట్ కాలేజీల తరంలోనే చదువుకొని ప్రపంచస్థాయికి ఎదిగిన సత్య నాదెళ్ల గానీ, సుందర్ పిచాయ్ గానీ ఈ సంస్థల్లో చదవలేదు. సత్య నాదెళ్ల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, మణిపాల్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. సుందర్ పిచాయ్ గవర్నమెంట్ స్కూళ్లలో, ఐఐటీలో చదువుకున్నాడు.
కార్పొరేట్ బట్టీయం పద్ధతిలో ప్రతిభ వికసించదు. పువ్వు సహజంగా విచ్చుకునే విధానం ఉండదిక్కడ. మొగ్గ రేకుల్ని బలవంతంగా విప్పి పువ్వుగా చూపించే అనాగరిక పద్ధతి. ఇక్కడ మేధస్సు జనించదూ, జ్వలించదూ. ముప్ఫయ్యేళ్లుగా భారతీయ నాలెడ్జి సొసైటీకి తీరని ద్రోహం చేస్తున్న ఈ విద్యాసంస్థలు దేశద్రోహ నేరానికి ఒడిగట్టాయి.
దేశానికి ఆదర్శప్రాయమైన రాజకీయ నాయకత్వం రాకుండా ఈ విద్యా వ్యవస్థ అడ్డుపడుతున్నది. విలువలతో, ఆదర్శాలతో ఉత్తేజితులైన విద్యార్థులు పూర్వం రోజుల్లో ప్రజా జీవితాలతో మమేకమయ్యేవారు. అటువంటి ఆదర్శాలతోనే నాయకులుగా ఎదిగిన కొందరు రాజకీయాల్లోనూ రాణించారు. వారిలో ఎక్కువమంది రాజకీయ విలువలను కూడా కాపాడారు.
గడిచిన ముప్పయ్యేళ్లుగా మెజారిటీ విద్యార్థులు ఇంజనీరింగ్ చట్రంలో, కార్పొరేట్ విద్యా ప్రపంచంలో ఇరుక్కునిపోయారు. వీరికి చరిత్రతో పనిలేదు. సామాజిక శాస్త్రాల అధ్యయనం లేదు. ప్రజలంటే పట్టింపు లేదు. టార్గెట్ – క్యాంపస్ రిక్రూట్‌మెంట్. మంచి జీతం ప్యాకేజీ. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి రిక్రూట్‌మెంట్ ఆగిపోయింది. ఫలితంగా బాగా బలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల కొడుకులు యువనేతలుగా రంగప్రవేశం చేస్తున్నారు. వాడికి ఎటువంటి విలువలు లేకున్నా సరే యువనేతగా బలవంతంగా దూరిపోతున్నాడు. ఇది ఈ దేశ రాజకీయ భవిష్యత్తు మీద కుట్ర.
అడ్డగోలు సంపాదనతో రాజకీయాలను కూడా శాసించే స్థాయికి చేరుకున్న కార్పొరేట్ విద్యా వ్యాపారస్థులను కంట్రోల్ చేయగలమన్న విశ్వాసం సన్నగిల్లే స్థితి ఏర్పడింది. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ లాబీదే పెత్తన మంతా! నారాయణ మునిసిపల్ మంత్రిగా ఉంటూ రెవిన్యూ అధికారాలను కూడా చలాయించేవాడు. ఆయన వియ్యంకుడు విద్యాశాఖ మంత్రి.
మూడు జిల్లాల టీడీపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చంతా ఆయనదే! అటువంటప్పుడు ఆ ప్రభుత్వం ఈ లాబీ ఆగడాలను అదుపు చేయగలదని ఎట్లా భావించగలం? నోట్ల కట్టలతో రాజకీయ నాయకత్వాన్ని, అడ్వర్టయిజ్‌మెంట్ ఎరలతో మీడియాను నోరు మూయిస్తూ బతికేస్తున్న ఈ లాబీకి ఇప్పుడు సరైన దెబ్బ పడింది. నారాయణ సంస్థల పేపర్ లీకేజీని సాక్ష్యాలతో సహా పట్టుకున్న ఏపీ ప్రభుత్వానికి అభినందనలు. సాంకేతిక కారణాల వల్ల బెయిల్ దొరకవచ్చు. రివిజన్ పిటీషన్ వేశారు. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రజాకోర్టులో ఇప్పటికే విచారణ మొదలైంది. కూలడం మొదలైన తర్వాత ఇంకెంతో కాలం ఆ కోట నిలబడదు.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment