College Education Department
-
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఏఐతో బోధన
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో ప్రపంచ స్థాయి బోధన ప్రమాణాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ)తో పాఠాలు బోధించనుంది. అధ్యాపకులు పాఠ్యపుస్తకాలు చూస్తూ, బ్లాక్ బోర్డులపై రాస్తూ పాఠాలు చెప్పే విధానాన్ని ఏఐతో భర్తీ చేయనుంది. విద్యార్థులను ఆకట్టుకుంటూ వారిలో అభ్యసన సామర్థ్యాలను పెంచేలా అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్)ల్లో బోధించనుంది. ఈ మేరకు దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ‘వర్చువల్ లెర్నింగ్ ల్యాబ్స్’ను అందుబాటులోకి తెస్తోంది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ అమెరికాకు చెందిన ‘జెడ్ స్పేస్’ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. తొలి దశలో సైన్స్ పాఠాలు.. విద్యార్థులకు పాఠ్యాంశాలను త్రీడీ విధానంలో విజువలైజ్ చేసి బోధించడం తాజా ప్రాజెక్ట్ లక్ష్యం. ఇందుకోసం జెడ్‌స్పేస్ అందించే ప్రత్యేక ల్యాప్‌టాప్‌ను వినియోగించనున్నారు. తొలి దశలో సైన్స్ కోర్సుల్లోని పలు సబ్జెక్టుల పాఠ్యాంశాలకు వర్చువల్ కంటెంట్‌ను తయారు చేసి బోధన చేయనున్నారు. సైన్స్ సబ్జెక్టుల్లో సుమారు 40 టాపిక్స్‌కు చెందిన కంటెంట్‌ను జెడ్‌స్పేస్ ఉచితంగా అందిస్తోంది. దీనికి అదనంగా మరో 60 టాపిక్స్‌కు కంటెంట్‌ను కళాశాల విద్యాశాఖ రూపొందించనుంది. దీనికోసం జెడ్‌స్పేస్ అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. పైలట్ ప్రాజెక్టుగా ఏఐ బోధన.. ఇప్పటికే ప్రభుత్వం డిగ్రీ విద్యలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు తరగతి గది బోధనతోపాటు 10 నెలల ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేయడం ద్వారా ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తోంది. ఇందులో భాగంగానే 2023–24లో సింగిల్ మేజర్, సింగిల్ మైనర్ సబ్జెక్టు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. తద్వారా ఒక విద్యార్థి ఒక సబ్జెక్టులో పరిపూర్ణ విజ్ఞానాన్ని సాధించేలా మార్గం సుగమం చేసింది. ఈ క్రమంలోనే కళాశాల విద్యాశాఖ సుమారు 80 రకాల సింగిల్ మేజర్ ప్రోగ్రామ్స్‌ను ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అందిస్తోంది. ఆర్ట్స్‌లో 23, కామర్స్‌లో 15, బయోలాజికల్ సైన్స్‌లో 15, ఫిజికల్ సైన్స్‌లో 15, కెమికల్ సైన్స్‌లో 5, మ్యాథ్స్‌లో 3, ఒకేషనల్ కోర్సుల్లో 4 ప్రోగ్రామ్స్‌ను ప్రవేశపెట్టింది. తొలుత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ నాలుగు కోర్సుల్లో సింగిల్ మేజర్లు ఉన్న కళాశాలల్లో పైలెట్ ప్రాజెక్టుగా ‘ఏఐ’ విధానంతో బోధనను తెస్తోంది. త్రీడీ అద్దాలు లేకుండానే.. జెడ్‌స్పేస్ ల్యాప్‌టాప్‌లు వర్చువల్ రియాలిటీ సామర్థ్యాలతో కూడిన పోర్టబుల్ వర్క్స్టేషన్లుగా పనిచేస్తాయి. దీన్ని ఉపయోగించే వ్యక్తులు త్రీడీ అద్దాలు ధరించాల్సిన అవసరం లేదు. ఇందులోని వర్చువల్ ఆబ్జెక్టులు స్క్రీన్ వెలుపల, లోపలకి కదలాడుతూ వాస్తవికంగా కనిపిస్తాయి. ఉదాహరణకు అనాటమీ టాపిక్ బోధనలో మానవ శరీర నిర్మాణాన్ని త్రీడీ ఇమేజ్‌ల ద్వారా ఒక్కో లేయర్‌ను వివరిస్తూ లోపలి భాగాలను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు వీలుగా బోధన చేయొచ్చు. వాస్తవానికి జెడ్‌స్పేస్ ల్యాప్‌టాప్ ఎదురుగా కూర్చుని ఆపరేట్ చేసే వ్యక్తికి మాత్రమే త్రీడీ ఎఫెక్ట్స్‌లో సబ్జెక్ట్ కనిపిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌కు ప్రత్యేకంగా జెడ్‌వ్యూ కెమెరాను అమర్చడం ద్వారా ప్రొజెక్టర్‌ను ఉపయోగించి ఎక్కువ మందికి స్క్రీన్‌పై త్రీడీ అనుభూతిని అందించవచ్చు. ఇందుకు వీలుగా సాధారణ ప్రొజెక్టర్స్ స్థానంలో అత్యాధునిక ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్‌ను సైతం అందుబాటులోకి తీసుకురానుంది. తొలుత ఆరు కళాశాలల్లో.. ప్రస్తుత సెమిస్టర్ నుంచి ఏఐ టెక్నాలజీ సాయంతో బోధన చేసేందుకు వీలుగా కళాశాల విద్యాశాఖ ఆరు కళాశాలలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. కడప (మహిళ), అనంతపురం (మెన్), రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ, విజయవాడ ఎస్ఆర్ఆర్– సీవీఆర్ డిగ్రీ కాలేజీ, గుంటూరు (మహిళ), విశాఖపట్నంలోని వీఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో జెడ్‌స్పేస్ ల్యాప్‌టాప్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. అనంతరం వచ్చే విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా సుమారు 50 కళాశాలల్లో అమలు చేయనుంది. జెడ్‌స్పేస్ సాంకేతికత వినియోగంపై ఇప్పటికే అధ్యాపకులకు సైతం శిక్షణ పూర్తయింది. -
అతడు బోనెక్కాల్సిందే!
నారాయణ చేసింది కూడా నరమేధమే. జినోసైడ్ కంటే తక్కువ పాపమేమీ కాదు. ఈ నారాయణ నలుగురితో నారాయణ మాత్రం కాదు. పరిచయం అక్కర్లేని పేరు. దయ్యాన్ని దయ్యం అనే అంటాం. ఇంకో రకంగా చెప్పలేము. నారాయణ కూడా... నారాయణే! గడిచిన పాతికేళ్లుగా ఒఖ్ఖటి.. ఒఖ్ఖటి... ఒఖ్ఖటి అంటూ కర్ణకఠోరంగా వినిపిస్తున్న పేరు. ఇంకో ఒకరిద్దరితోపాటు ఈ నారాయణ చేసిన నేరాలపై ఇప్పుడు తెలుగు సమాజంలో ఒక చర్చ నడుస్తున్నది. ఎటువంటి నేరాలవి? రెండు తరాలకు ప్రాతినిధ్యం వహించే లక్షలాదిమంది యువతీ యువకుల మేధోవికాసాన్ని దారుణంగా చిదిమేసిన యుద్ధనేరం. ఉరిమే ఉత్సాహంతో పరుగులు తీయవలసిన ప్రభాత కిరణాలకు సంకెళ్లు వేసిన నేరం. ఆ కిరణాలను బ్రాయిలర్ కోళ్లుగా మార్చిన ఘోరం. కాలేజీ విద్యను కోళ్లఫారాల వ్యాపారంగా ఏమార్చిన వైనం. జైలు గదులకు బడి పేరు పెట్టి బాల్యాన్ని బంధించిన రౌరవకార్యం. నారాయణాదుల కరెన్సీ చదువుల యాగంలో లక్షలాది మధ్యతరగతి కుటుంబాలు సమిధలుగా మారాయి. అమాయక తల్లిదండ్రుల ఆశల్ని నోట్ల కట్టలుగా తర్జుమా చేసుకున్న విద్యా వ్యాపారం నారాయణ చేసిన నేరం. జాతి భవితను పణంగా పెట్టి లాభాలు పిండుకున్న దేశద్రోహం. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు చేసిన నేరాల కంటే ఈ ‘చైనా’జీ కార్పొరేట్ల నేరాలు ఎక్కువ ప్రమాదకరమైనవి. న్యూరెన్బర్గ్ ప్రత్యేక కోర్టుల కంటే పటిష్ఠమైన ప్రత్యేక న్యాయస్థానాల్లో ఈ యుద్ధ నేరస్థులపై విచారణ జరగాలి. ఎందుకంటే నారాయణాదులు చాలా పవర్ఫుల్. దయ్యాలకంటే పవర్ఫుల్. ఎంతో పవర్ఫుల్ కాకపోతే అరెస్టు చేసిన పోలీసులు ఆయన్ను కోర్టు మెట్లు ఎక్కించకముందే బెయిల్ ఎట్లా ఖాయమవుతుంది? అంత గట్టి లాయర్లుంటారు నారాయణకు! దరఖాస్తు చేయకుండానే బెయిల్ ఎట్లా వచ్చిందని అదనపు అడ్వొకేట్ జనరల్ నోరు వెళ్లబెట్టాల్సి వచ్చింది. నూతన ఆర్థిక విధానాల గాలులు గేట్‌వే ఆఫ్ ఇండియాలోకి ప్రవేశించక ముందు విద్యారంగంలో ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పట్నించి ఇంకో లెక్కని అన్ని రంగాల్లోనూ ప్రైవేట్ వీరులు తొడలుగొట్టారు. విద్యారంగం లోనూ కొట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆ సమయంలో చంద్ర బాబు ముఖ్యమంత్రిగా ఎక్కువకాలం ఉన్నారు. ప్రైవేటీకరణపై ఆయనకున్న పిచ్చి వ్యామోహానికి మెచ్చి, ప్రపంచ బ్యాంకు జీతగాడు అనే బిరుదును కూడా ప్రదానం చేశారు. ఆయన దన్నుతో విద్యారంగం మార్పులు కూడా శరవేగంగా వినాశ కరంగా పరుగులు తీశాయి. ఈ మార్పులకు ముందు విద్యారంగంలో ప్రభుత్వానిదే పెద్దవాటా. క్రమక్రమంగా చదువుకునేవారి సంఖ్య పెరుగు తుండడంతో సర్కార్ విద్యాసంస్థల సంఖ్య సరిపోక ప్రైవేట్ ఎయిడెడ్ సంస్థలను కూడా ప్రోత్సహించేవారు. అయితే ఈ సంస్థలేవీ కూడా విద్యార్థులపై పెద్దగా ఆర్థిక భారాన్ని మోపేవి కావు. చదువుతోపాటు ఆటపాటలు, అందుకు తగిన వసతులు, క్రీడా మైదానాలు, సాంస్కృతికోత్సవాలు విద్యార్థులకు అందు బాటులో ఉండేవి. సరస్వతీ విద్యామందిర్లు, క్రిస్టియన్ మిష నరీ స్కూళ్లు విద్యార్థుల చదువుపై ఎక్కువ ఫోకస్ పెడుతూనే ఇటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించేవి. విద్యార్థుల సర్వతోముఖ వికాసానికి ప్రభుత్వ సంస్థలకు దీటుగా ప్రైవేట్ సంస్థలు కూడా దోహదపడేవి. డెబ్బయ్యో దశకంలో సీవిఎన్ ధన్ అనే ఆయన గుంటూరులో ఒక కొత్త ట్రెండ్‌కు ఆద్యుడయ్యారు. ఇంటర్మీ డియట్ చదువును మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల సాధనంగా ఆయన మార్చివేశారు. ఫీజు కొంచెం ఎక్కువ. అందుకని బాగా డబ్బున్నవాళ్లు, రాజకీయ నాయకుల పిల్లలు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వెళ్లి చదువు కోవడం ప్రారంభమైంది. క్రమంగా ఈ తరహా కాలేజీలు కొన్ని విజయవాడ, గుంటూరు పరిసరాల్లో మొలకెత్తాయి. అయితే మొత్తంగా విద్యావ్యవస్థను తలకిందులు చేసేంత ప్రభావాన్ని మాత్రం అవి చూపెట్టలేదు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీల కార్పొరేట్ శకారంభంతో విద్యారంగం రూపురేఖలు మారి పోయాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన అండదండలతో ఈ విద్యాసంస్థలు చెలరేగిపోయాయి. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ విద్యాసంస్థలను పాడుపెట్టడం కార్పొరేట్ సంస్థలకు వరంగా మారింది. విద్యారంగాన్ని ఈ శక్తులు క్యాన్సర్ వ్రణంలా ఆక్రమించుకున్నాయి. ఫలితం వ్యవస్థ విధ్వంసం. కార్పొరేట్ విద్యావ్యవస్థ దుష్ఫలితాలు సమాజంలోని అనేక రంగాల్లో మనం చూడవచ్చు. ఇందులో ఒక ఏడు అంశాలైతే స్పష్టంగా మన అనుభవంలోకి వచ్చాయి. 1. సామాజిక విభజన – రెండు గ్లాసుల పద్ధతి వంటి రెండు క్లాసుల విధానం. 2. భవిష్యత్ తరాల సర్వతోముఖ వికాసానికి స్వస్తి. 3. భాషా, సామాజిక శాస్త్రాలపై అలక్ష్యం. 4. విద్యార్థుల్లో ఒత్తిడి, పలాయనవాదం, ఆత్మహత్యల ధోరణి. 5. ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యం. 6. నాలెడ్జి సొసైటీ దివాళా. 7. భవిష్యత్ ఉత్తమశ్రేణి రాజకీయ నాయకత్వానికి సమాధి. రెండు గ్లాసుల పద్ధతి మనలో చాలామందికి గుర్తుండే ఉంటుంది. గ్రామాల్లో హోటళ్లకు, టీ దుకాణాలకు వచ్చే దళితుల కోసం ఒక గ్లాసు, ఇతరుల కోసం మరో గ్లాసు కేటాయించే సాంఘిక దురాచారం అక్కడక్కడా కనిపించేది. అనేక పోరాటాల తర్వాత అది అంతరించింది. అది మాయమైందో లేదో మరో అనాచారానికి కార్పొరేట్ విద్యాసంస్థలు అంటుకట్టాయి. అదే రెండు క్లాసుల వ్యవస్థ. ఒక మెరుగైన సమాజ నిర్మాణానికి కామన్ స్కూలింగ్ను తొలి మెట్టుగా అన్ని నాగరిక దేశాలు భావిస్తున్నాయి. మనదేశంలో మాత్రం కార్పొరేటు విద్యా సంస్థలు రెండు క్లాసుల బర్బర సంస్కృతిని ప్రవేశపెట్టాయి. ఇది రెండు దశల్లో అమలవుతుంది. కార్పొరేట్ బడుల్లో చదువుకుంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని సగటు తల్లిదండ్రులు భావించేలా ఊదరగొట్టిన కారణంగా దిగువ మధ్యతరగతి వారు సైతం తల తాకట్టుపెట్టయినా అక్కడికే పంపించడానికి అలవాటుపడ్డారు. అప్పటికే ప్రభుత్వం వారు పాడుపెట్టిన కాలేజీలు, స్కూళ్లలో నిరుపేదల పిల్లలు మాత్రమే మిగిలిపోయారు. ఇదొక విభజన. ఇక రెండో విభజన – కార్పొరేట్ సంస్థల్లోనే రెండు క్లాసులు. మంచి ర్యాంకులు రాబట్టవచ్చని ఎంపిక చేసుకున్న ఓ పిడికెడు మందిని ఒక ప్రత్యేక క్లాసులో వేస్తారు. కొంచెం మ్యాథ్స్నూ, కొంచెం సైన్స్‌నూ రోజూ గ్రైండర్లో వేసి బాగా రుబ్బిన తర్వాత స్పెషల్ క్లాస్ పిల్లల మెదళ్లలోకి గరాటా పెట్టి పోస్తారు. ఇక మిగిలిన సబ్జెక్టుల కోసం పేపర్ లీకేజీ విధానం. ఇందుకు చేయవలసిన ఏర్పాట్ల కోసం నారాయణ వంటి అధిపతుల ఆధ్వర్యంలోనే ప్రత్యేక సమావేశాలు జరుగుతాయట. ఇతర క్లాసుల్లో ఉండే 90 శాతం మంది విద్యార్థులకు గరాటా, లీకేజీ సౌకర్యాలు ఉండవు. చదువు చెప్పడం కూడా అంతంత మాత్రమే! వీరి కోసం వందల సంఖ్యలో ఉన్న డబ్బా ఇంజనీరింగ్ కాలేజీలు ఎదురు చూస్తుం టాయి. విద్యార్థి దశ నుంచే యువతరం ఆలోచనల్లో సామాజిక విభజనకు బీజం వేసి ఈ కార్పొరేట్ కాలేజీలు రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు యథేచ్ఛగా పాల్పడు తున్నాయి. ఇక ఈ సంస్థల్లో మనిషి సర్వతోముఖ వికాసానికి ఎటు వంటి అవకాశమూ ఉండదు. ఆటలు పాటలంటే అవేవో బూతుల్లా వినిపిస్తాయిక్కడ! ఈ తరంలోనే పుట్టి పెరిగి, అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఒక సానియా మీర్జా (సెయింట్ మేరీస్)ను గానీ, ఒక పీవీ సింధు (సెయింట్ ఆన్స్)ను గానీ, ఒక మిథాలీరాజ్ (కీస్ హైస్కూల్)ను గానీ ఈ కార్పొరేట్ సంస్థలు సృష్టించలేకపోయాయి. ఒక సంగీత విద్వాంసుడిని, ఒక చిత్ర కారుడిని, ఒక కవిని, కళాకారుడిని ఈ సంస్థల నుంచి మనం ఊహించలేము. రోజూ క్రమం తప్పకుండా మ్యాథ్స్, సైన్స్ అనే విటమిన్ ఇంజక్షన్లు పొడిపించుకొని బరువు పెరగడమే ధ్యేయంగా బతికే బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తే ఈ సంస్థల లక్ష్యం. ఆ రకంగా యువతరాల సృజనశీలత మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఈ సంస్థలు దేశద్రోహానికి పాల్పడుతున్నాయి. తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషలు, సోషల్ స్టడీస్ – ఇక్కడ నిషేధిత జాబితాలో ఉంటాయి. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు హిస్టరీ సబ్జెక్టే అనవసరమని బహిరంగంగా ప్రకటించారు. ఈ సూక్తిని కార్పొరేట్ విద్యా సంస్థలు శిరోధార్యంగా స్వీకరించాయి. అప్పటి నుంచి ఈ సబ్జెక్టుల్లో నూటికి 99 మార్కులు తెప్పించడం కోసం పేపర్ లీకేజీ మార్గాన్ని ఈ సంస్థలు ఎంచుకున్నాయి. దేశ చరిత్రను, సంస్కృతిని, భాషలను మరుగుపరిచే ప్రయత్నం చేయడం జాతీయ పతాకాన్ని అవమానించడంతో సమానం. ఈ సంస్థల్లో చదివే విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని అనేక అధ్యయనాలు, సర్వేలు ఘంటా పథంగా చాటి చెప్పాయి. వీటి నిర్వహణ తీరుతెన్నులు మారాలని నివేదికలు ఇచ్చాయి. ఈ కాలేజీల ధనప్రభావం వల్ల అవన్నీ అటకెక్కాయి. ఆసక్తులన్నింటిని బలవంతంగా అణిచి వేసుకొని, ర్యాంకుల ఒత్తిడిలో నలిగి, విద్యార్థులు జీవితంపై విరక్తి ఏర్పరచుకుంటున్నారు. ఎదిరించి పోరాడలేని అశక్తతను ఈ విద్యాసంస్థల కోళ్ల ఫారం సంస్కృతి నరాల్లోకి ఎక్కిస్తుంది. ఫలితంగా ఆత్మహత్యల బాట పడుతున్నారు. 2014–19 మధ్యకాలంలో ఒక్క నారాయణ సంస్థల్లోనే 400 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. సామూహిక హత్యలకు ఏ సెక్షన్ల కింద కేసులు పెడతారో, ఆత్మహత్యలకు పురికొల్పడంపై ఏ కేసులు పెడతారో అవన్నీ ఈ సంస్థల మీద పెట్టనవసరం లేదా? ఆర్థిక సంస్కరణల తొలిదశలో అధికారంలో ఉన్నవారు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ విద్యాసంస్థలను అలక్ష్యం చేసి కార్పొరేట్ సంస్థల వృద్ధికి సహకరించారు. ఫలితంగా వెనుక బడిన పేదవర్గాల ప్రజలు గడిచిన 30 ఏళ్లుగా మెరుగైన విద్యను పొందలేకపోయారు. వెనుకబడిన జాబితాలో మరో రెండు తరాలు కూడా కలిసిపోయాయి. ప్రభుత్వ విద్యాసంస్థలను పాడుపెట్టడమంటే – ఈ దేశ ప్రజల విద్యా హక్కును ఉల్లంఘించడం! మెరుగైన సమాజానికి బాటలు వేసే కామన్ స్కూలింగ్ను అడ్డుకోవడం! కలవారు, లేనివారు అనే రెండు రకాలుగా ఈ జాతిని విడదీయడం! ఇండియా – భారత్‌లుగా ఈ దేశాన్ని విభజించడం! ఈ దారుణమైన దురాగతాలకు శిక్ష ఎవరికి వేయాలో సమాజం ఆలోచించాలి. కార్పొరేట్ కాలేజీల్లో చదువుకున్న వాళ్లలో ఇంతవరకూ ఒక గొప్ప శాస్త్రవేత్త పుట్టలేదు. దేశం గర్వించదగ్గ మేధావి పుట్టలేదు. ఒక అబ్దుల్ కలామ్‌ను ఆశించలేము. ఒక సీవీ రామన్‌ను కలగనలేము. ఈ కార్పొరేట్ కాలేజీల తరంలోనే చదువుకొని ప్రపంచస్థాయికి ఎదిగిన సత్య నాదెళ్ల గానీ, సుందర్ పిచాయ్ గానీ ఈ సంస్థల్లో చదవలేదు. సత్య నాదెళ్ల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, మణిపాల్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. సుందర్ పిచాయ్ గవర్నమెంట్ స్కూళ్లలో, ఐఐటీలో చదువుకున్నాడు. కార్పొరేట్ బట్టీయం పద్ధతిలో ప్రతిభ వికసించదు. పువ్వు సహజంగా విచ్చుకునే విధానం ఉండదిక్కడ. మొగ్గ రేకుల్ని బలవంతంగా విప్పి పువ్వుగా చూపించే అనాగరిక పద్ధతి. ఇక్కడ మేధస్సు జనించదూ, జ్వలించదూ. ముప్ఫయ్యేళ్లుగా భారతీయ నాలెడ్జి సొసైటీకి తీరని ద్రోహం చేస్తున్న ఈ విద్యాసంస్థలు దేశద్రోహ నేరానికి ఒడిగట్టాయి. దేశానికి ఆదర్శప్రాయమైన రాజకీయ నాయకత్వం రాకుండా ఈ విద్యా వ్యవస్థ అడ్డుపడుతున్నది. విలువలతో, ఆదర్శాలతో ఉత్తేజితులైన విద్యార్థులు పూర్వం రోజుల్లో ప్రజా జీవితాలతో మమేకమయ్యేవారు. అటువంటి ఆదర్శాలతోనే నాయకులుగా ఎదిగిన కొందరు రాజకీయాల్లోనూ రాణించారు. వారిలో ఎక్కువమంది రాజకీయ విలువలను కూడా కాపాడారు. గడిచిన ముప్పయ్యేళ్లుగా మెజారిటీ విద్యార్థులు ఇంజనీరింగ్ చట్రంలో, కార్పొరేట్ విద్యా ప్రపంచంలో ఇరుక్కునిపోయారు. వీరికి చరిత్రతో పనిలేదు. సామాజిక శాస్త్రాల అధ్యయనం లేదు. ప్రజలంటే పట్టింపు లేదు. టార్గెట్ – క్యాంపస్ రిక్రూట్మెంట్. మంచి జీతం ప్యాకేజీ. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఫలితంగా బాగా బలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల కొడుకులు యువనేతలుగా రంగప్రవేశం చేస్తున్నారు. వాడికి ఎటువంటి విలువలు లేకున్నా సరే యువనేతగా బలవంతంగా దూరిపోతున్నాడు. ఇది ఈ దేశ రాజకీయ భవిష్యత్తు మీద కుట్ర. అడ్డగోలు సంపాదనతో రాజకీయాలను కూడా శాసించే స్థాయికి చేరుకున్న కార్పొరేట్ విద్యా వ్యాపారస్థులను కంట్రోల్ చేయగలమన్న విశ్వాసం సన్నగిల్లే స్థితి ఏర్పడింది. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ లాబీదే పెత్తన మంతా! నారాయణ మునిసిపల్ మంత్రిగా ఉంటూ రెవిన్యూ అధికారాలను కూడా చలాయించేవాడు. ఆయన వియ్యంకుడు విద్యాశాఖ మంత్రి. మూడు జిల్లాల టీడీపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చంతా ఆయనదే! అటువంటప్పుడు ఆ ప్రభుత్వం ఈ లాబీ ఆగడాలను అదుపు చేయగలదని ఎట్లా భావించగలం? నోట్ల కట్టలతో రాజకీయ నాయకత్వాన్ని, అడ్వర్టయిజ్మెంట్ ఎరలతో మీడియాను నోరు మూయిస్తూ బతికేస్తున్న ఈ లాబీకి ఇప్పుడు సరైన దెబ్బ పడింది. నారాయణ సంస్థల పేపర్ లీకేజీని సాక్ష్యాలతో సహా పట్టుకున్న ఏపీ ప్రభుత్వానికి అభినందనలు. సాంకేతిక కారణాల వల్ల బెయిల్ దొరకవచ్చు. రివిజన్ పిటీషన్ వేశారు. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రజాకోర్టులో ఇప్పటికే విచారణ మొదలైంది. కూలడం మొదలైన తర్వాత ఇంకెంతో కాలం ఆ కోట నిలబడదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
AP: కొలువులు పట్టాలి
సాక్షి, అమరావతి: కర్నూలుకు చెందిన రాము ఎమ్మెస్సీ చదివాడు. నాలుగేళ్లుగా ఉద్యోగం కోసం పలు విధాలా ప్రయత్నించాడు. పలు సంస్థల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. వారడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాడు. త్వరలో ఇంటిమేట్ చేస్తామనేవారు. ఆ తర్వాత వారి నుంచి కాల్ వస్తుందని రోజుల తరబడి ఎదురు చూసినా ఫలితం ఉండేది కాదు. ఇటీవల మార్కెట్ ఓరియంటెడ్ కోర్సు పూర్తి చేయడంతో వెంటనే ఓ మంచి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇదే పని నాలుగేళ్ల క్రితమే చేసి ఉంటే ఈ పాటికి మంచి పొజిషన్లో ఉండేవాడినని చెబుతున్నాడు. ఇదే రీతిలో రాష్ట్రంలో ఎంతో మంది పోస్టు గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి వారందరికీ ఆయా డిగ్రీ కోర్సులు చదువుతున్నప్పుడే సంబంధిత రంగానికి సంబంధించి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉంటే ఇలా ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది కాదు. ఇకపై ఏ ఒక్క విద్యార్థికీ ఉన్నత చదువు తర్వాత ఉపాధి సమస్య ఎదురవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా నైపుణ్యంతో కూడిన విద్యను అందించేలా విద్యా విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ► నేటి పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా విద్యార్థులకు మేలు చేసేలా క్లౌడ్ కంప్యూటింగ్, ఆక్వాకల్చర్ తదితర మార్కెట్ ఓరియెంటెడ్ కోర్సులకు శ్రీకారం చుట్టారు. ఆన్లైన్ ఆధారిత పరిజ్ఞానాన్ని అందించేందుకు లెర్నింగ్ మేనేజ్మెంటు సిస్టమ్ (ఎల్ఎంఎస్) ఏర్పాటు చేశారు. వివిధ సబ్జెక్టులకు సంబంధించిన వీడియో పాఠాలను దీనిద్వారా విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ► విద్యార్థుల కెరీర్ మరింత ఉజ్వలంగా ఉండేందుకు వారికి అవసరమైన శిక్షణ, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేలా ఇంగ్లిష్ లాంగ్వేజ్ ల్యాబ్స్ వంటివి నెలకొల్పారు. ► విద్యార్థులు కేవలం సబ్జెక్టు అంశాలకే పరిమితం కాకుండా వారికి సామాజిక, నైతిక విలువలపై అవగాహన కలిపించేలా హ్యూమన్ వాల్యూస్, ప్రొఫెషనల్ ఎథిక్స్ (హెచ్‌వీపీఈ) అంశాలనూ బోధిస్తున్నారు. ► 144 కాలేజీల్లో వర్చువల్ క్లాస్ రూములను ఏర్పాటు చేయించి, అధునాతన విధానాల్లో బోధిస్తున్నారు. ఐసీటీ ఆధారిత బోధన, అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు 56 కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూములను నెలకొల్పారు. ► విద్యార్థుల్లో చైతన్యం నింపేందుకు 13 జిల్లాల్లో జిల్లా వనరుల కేంద్రాలను ఏర్పాటు చేయించారు. అధ్యాపకులు సరైన రీతిలో బోధన సాగిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి విద్యార్థులతోనే విద్యార్థి సంతృప్తి సర్వేలను నిర్వహిస్తూ లెక్చరర్ల పనితీరును బేరీజు వేస్తున్నారు. అధ్యాపకుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ ఆడిట్‌ను ఏర్పాటు చేశారు. ► జవహర్ నాలెడ్జి సెంటర్ల ద్వారా కూడా ఉపాధి నైపుణ్యాలలో శిక్షణ ఇస్తున్నారు. జాబ్ మేళాలు, క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లను నిర్వహిస్తూ లక్షలాది మంది విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. నాణ్యమైన విద్యే లక్ష్యం ► రాష్ట్రంలో నాన్ ప్రొఫెషనల్ కోర్సులు అందించే అన్ని డిగ్రీ కాలేజీలకూ నేషనల్ అసెస్మెంటు అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్), నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) సంస్థల నుంచి అత్యున్నత స్థాయి ర్యాంకుల గుర్తింపు ఉండాలని సీఎం వైఎస్ జగన్ నిర్ధేశించారు. ► ఉన్నత ప్రమాణాలతో అటానమస్ సంస్థలుగా వాటిని తీర్చిదిద్దాలన్న సీఎం ఆదేశాల మేరకు.. ఆ దిశగా కాలేజీ విద్యకు కొత్త రూపునిస్తూ అధికారులు అనేక చర్యలు చేపట్టారు. ఇవన్నీ ఇప్పుడు విద్యార్థులకు అందుబాటులోకి రావడంతోపాటు కాలేజీల రూపురేఖలు మారేందుకు దోహద పడుతున్నాయి. ► నాక్, ఎన్బీఏ గుర్తింపుతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)లోనూ కాలేజీలు నిలిచేలా చర్యలు చేపడుతున్నారు. ఉపాధికి ఊతమిచ్చేలా కోర్సులు ► విద్యార్థులకు అండగా ఉండేలా వారికి భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా ప్రభుత్వం కాలేజీ విద్యలో అనేక కొత్త కోర్సులను ప్రారంభించింది. రాష్ట్రంలో 152 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 111 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, 1,022 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 3,65,563 సీట్లుండగా.. 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు మాత్రమే సీట్లు భర్తీ అవుతున్నాయి. ► కాలేజీ విద్యను పటిష్ట పరచడంలో భాగంగా ప్రమాణాలు పాటించని సంస్థల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా.. 30 మంది కన్నా తక్కువ చేరికలు ఉన్న కాలేజీలకు ముందుగా నోటీసులిచ్చి ఆ తర్వాత మూసివేతకు, కోర్సుల రద్దుకు ఆదేశాలిచ్చింది. ► ప్రభుత్వ కాలేజీల విషయంలో కూడా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే వారిని వేరే కాలేజీలకు తరలించేలా ఏర్పాట్లు చేసింది. అన్ని డిగ్రీ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలని నిర్ణయించి అమల్లోకి తెచ్చింది. పిల్లల చేరికలు లేనందున కొన్ని కాలేజీలు తెలుగు మాధ్యమ కోర్సులను రద్దు చేసుకున్నాయి. ► ఈ చర్యలన్నింటి వల్ల డిగ్రీతో పాటు నైపుణ్య శిక్షణ తప్పనిసరిగా ఇచ్చేందుకు పలు కాలేజీలు శ్రీకారం చుట్టాయి. తద్వారా రానున్న రోజుల్లో విద్యార్థులకు డిగ్రీ పూర్తి కాగానే ఉపాధి దొరికే అవకాశాలు బాగా పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ప్రతి విద్యార్థిని ఉన్నత ప్రమాణాలు, నైపుణ్యాలతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా అన్ని కాలేజీల్లో ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ‘కాలేజీ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్స్‌లెన్స్’ (సీపీఈ)గా అభివృద్ధి పరుస్తున్నాం. జిల్లాకొక కాలేజీని సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌గా ఉండేలా చూస్తున్నాం. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశాం. సిస్కో అకాడమీస్ ద్వారా విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు ఏర్పాట్లు చేయించాం. సీమెన్స్ సంస్థ ద్వారా టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లు ఏర్పాటయ్యాయి. పాలిటెక్నిక్ కాలేజీల్లో విద్యార్థులకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం, 500 డిజిటల్ తరగతులను సిద్ధం చేయించాం. డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ను ప్రవేశపెట్టాం. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి -
కాలేజీకి చీరలోనే రావాలి
జైపూర్: రాజస్తాన్ ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు డ్రెస్ కోడ్‌ను ప్రకటించింది. కాలేజీలో చదివే అమ్మాయిలు జీన్స్, టీ షర్ట్స్, లెగ్గిన్స్ లాంటి దుస్తులు ధరించి కాలేజీకి రావొద్దని ఓ ప్రకటనలో తెలిపింది. సంప్రదాయ దుస్తులు సల్వార్-కమీజ్, చీరలో మాత్రమే కాలేజీకి హాజరు కావాలని సూచించింది. ఈ మేరకు కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనరేట్ అన్ని ప్రభుత్వ కాలేజీలకు లేఖలు పంపింది. కళాశాలల ప్రిన్సిపాల్స్.. బాలుర, బాలి కల దుస్తుల రంగు (డ్రెస్ కోడ్ కలర్)ను నిర్ణయించి ఈ నెల 12నాటికి తుది నివేదికను పంపాలని పేర్కొంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ డ్రెస్ కోడ్ అమల్లోకి రానుంది. విద్యార్థులు క్యాంపస్‌లో ఉన్నంత కాలం డ్రెస్ కోడ్ వర్తిస్తుంది. అయితే బోధనా సిబ్బందికి డ్రెస్ కోడ్‌పై నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదావేశారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విద్యార్థులు, టీచర్లు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది తిరోగమ చర్య అని, ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పి తమ హక్కులను హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ హిస్టరీ ప్రొఫెసర్ మాట్లాడుతూ.. ప్రపంచం ఒక అడుగు ముందుకు సాగితే, భారత్ రెండు అడుగులు వెనక్కి వేస్తోందంటూ అభిప్రాయపడ్డారు. కనోరియా కాలేజీకి చెందిన విద్యార్థిని అంజలీ మాట్లాడుతూ.. ‘మాకు ఇప్పుడే స్వేచ్ఛ ఉంటుంది. పెళ్లి తర్వాత మేము జీన్స్, టీ షర్ట్స్ ధరించే చాన్స్ ఉండకపోవచ్చు. అప్పుడు మాకు అంత ఫ్రీడమ్ ఉండదు. ఇప్పుడు కూడా మా ఇష్టం వచ్చిన డ్రెస్ ధరించొద్దు అనడం విచారకరమని’ అన్నారు. మరో విద్యార్థిని మాట్లాడుతూ.. అబ్బాయిలను కుర్తా పైజామా వేసుకురావాలని ఎందుకు బలవంతం చేయడం లేదు? స్త్రీ, పురుషులు సమానం అనే ప్రభుత్వం స్త్రీలపై మాత్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. డ్రెస్ కోడ్‌కు వ్యతిరేకంగా పోరాడాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ‘బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేస్తోంది. వీరు డాక్లర్లు, ఇంజనీర్లను కోరుకోవడం లేదు. బాబాలను తయారు చేయాలని చూస్తోంద’ని కాంగ్రెస్ ఎమ్మెల్యే గోవింద్ సింగ్ ఆరోపించారు. కాగా డ్రెస్ కోడ్ అమలును ప్రభుత్వం సమర్థించుకుంది. క్యాంపస్‌లో క్రమశిక్షణ పెంపొందించడం కోసమే డ్రెస్‌కోడ్ అమలు చేస్తున్నామని పేర్కొంది. కళాశాల ప్రిన్సిపల్, నిర్వాహకులు కాలేజీ సంఘాలతో చర్చలు జరిపి, వారు ఏకాభిప్రాయానికి వచ్చాకే డ్రెస్ కోడ్ అమలు చేస్తారని అధికారులు చెబుతున్నారు. -
ఉన్నత విద్యామండలి పనితీరు సరిగా లేదు
డిప్యూటీ సీఎం కడియం అసహనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పనితీరు సరిగా లేదంటూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అసహనం వ్యక్తంచేశారు. అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ రిసోర్స్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశం నిర్వహిం చారు. కళాశాల విద్య శాఖ, వర్సిటీలతో ఉన్నత విద్యా మండలి సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంకు సంబంధించిన విద్యార్థులు, లెక్చరర్లకు అవగాహన కల్పించాలన్నారు. కాగా, మే 1న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్‌టికెట్ల జారీని టెట్ కమిటీ శుక్రవారం నుంచి మళ్లీ ప్రారంభించింది. పరీక్షల నిర్వహణకు ప్రైవేటు యాజమాన్యాలు సహకరించేందుకు అంగీకరించడంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది.