- 18న ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు
- పాఠశాలలు, కళాశాలల యూజమాన్యాలకు డీఈఓ సూచన
- బస్సులతో తహసీల్దార్లకు రిపోర్ట్ చేయాలి
- డీటీసీ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్
ఖిలావరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 19న ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేకు జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ విజయ్‌కుమార్ కోరారు. వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో శనివారం విద్యాశాఖ, రవాణాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎంవీఐలకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమకు సంబంధించిన బస్సులను సమగ్ర సర్వేలో పాల్గొనే ఎన్యూమరేటర్లకు కేటారుంచి... వారిని మండల కేంద్రం నుంచి ఆయా గ్రామాలకు తరలించాలని సూచించారు. కలెక్టర్ జి,కిషన్ ఆదేశాల మేరకు సమగ్ర సర్వేలో భాగస్వామ్యులయ్యేందుకు ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈ నెల 18న సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రెండు వేల స్కూల్ బస్సులు, ఇతర వాహనాలకు సమాచారం అందించామన్నారు.
జిల్లాలోని వడుప్సా, టీచర్స్, విద్యా సంస్థల ఆసోసియేషన్స్ బాధ్యులు స్వచ్ఛందంగా పాల్గొంటామని చెప్పారన్నారు. 19వ తేదీన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనని విద్యాసంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్వహిస్తున్న సమగ్ర సమాజిక కుటుంబ సర్వేలో జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు సెలవు దినంగా పాటించాలన్నారు. బస్సులను సమగ్ర సర్వేకు ఉపయోగించేకునేందుకు సహకరించాలని కోరారు.
విద్యా సంస్థ యాజమాన్యాలు డ్రైవర్స్, క్లీనర్ల వివరాలతో బస్సులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఆయా మండల తహసీల్దార్ కార్యాలయంలో 18వ తేదీన 2 గంటలకు బస్సుల వివరాలతో రిపోర్ట్ చేయాలన్నారు. కుటుంబంతో లేకుంటే ప్రభుత్వ పథకాలకు దూరమైతామనే భయం డ్రైవర్లు, క్లీనర్లకు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు బస్సుల వెంట పింపించే డ్రైవర్లు, క్లీనర్లకు సర్వేలో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు ఇవ్వాలని విద్యాసంస్థల యూజమాన్యాలకు సూచించారు.
జిల్లాలో విద్యా సంస్థల బస్సులు, ఇతర వాహనాల పర్యవే క్షకులుగా ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఆయన వెల్లడించారు. వీరు బస్సులను అందుబాటులో ఉంచడంతోపాటు ఎప్పటికప్పుడు సర్వే సిబ్బందికి వివరాలు అందజేస్తారని డీటీసీ చెప్పారు. సమావేశంలో ఎంవీఐలు సత్యనారాయణ, నాగలక్ష్మి, ఎస్‌కే.మాసూద్ అలీ, వై.కొండల్‌రావు, ఈజే.జయకుమార్, జి.వేణుగోపాల్, శివస్వప్న, ఎల్.రాంచందర్, ఫహీమ సుల్తాన పాల్గొన్నారు.