మేయర్ గుండు సుధారాణికి సమస్యలు విన్నవిస్తున్న కార్పొరేటర్లు
వరంగల్: గ్రేటర్ పరిధిలోని పలువురు కార్పొరేటర్లు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు అంటిముట్టనట్లుగా వ్యవహరించారు. కౌన్సిల్ సమావేశంలో అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్షమా? అన్నట్లుగా ప్రశ్నలు సంధించారు. కౌన్సిల్ సమావేశాల్లో మినహా పాలక వర్గం ఏర్పాటైన రెండున్నర ఏళ్లులో మేయర్‌ను ఎన్నడూ నేరుగా కలిసి సమస్యలు విన్నవించిన దాఖలాలు లేవు. కానీ అధికార మార్పిడితో పరిస్థితులు మారిపోయాయి. గతాన్ని వదిలేద్దాం అంటూ ఐక్యతారాగం అందుకున్నారు.
‘మేయర్ మీరే మాకు పెద్ద దిక్కు. మా డివిజన్‌లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలి’ అంటూ పలువురు అధికార పార్టీ కార్పొరేటర్లు విన్నవించడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణితో వరంగల్ తూ ర్పు, పరకాల నియోజక వర్గాల పరిధిలోని పలువురు కార్పొరేటర్లు భేటి అయ్యారు. డివిజన్‌లలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కరుగా ఏకరువు పెట్టారు.
చాలామేరకు అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చాలాచోట్ల పనులు మొదలు పెట్టలేదని మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టణ ప్రగతి పథకం ద్వారా డివిజన్‌కు రూ.50లక్షలు కేటాయించారని, అందులో 20శాతం నిధులు ఎలక్ట్రికల్ పనులకు ఇచ్చారని, ఇప్పటికి పనులు ప్రారంభానికి నోచుకోలేదని పేర్కొన్నారు. ప్రతి డివిజన్‌కు జనరల్ ఫండ్ ద్వారా రూ.50లక్షల చొప్పున నిధులు కేటాయించాలని కోరారు.
తాగునీరు, వీధి దీపాల సమస్యలు, పారిశుద్ధ్య లోపం తదితర విషయాలను వివరించారు. దీనిపై మేయర్ గుండు సుధారాణి స్పందించారు. అభివృద్ధి పనులు, ఇతర సమస్యల పరిష్కారం కోసం అధికారులతో చర్చించి, వేగవంతమయ్యే విధంగా చొరవ తీసుకుంటానని స్పష్టం చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు మరుపల్లి రవి, దిడ్డి కుమారస్వామి, గందె కల్పన, కావేటి కవిత, పోశాల పద్మ, గుండు చందన, రామా తేజస్విని, ముష్కమల్ల అరుణ, బైర బోయిన ఉమ, గద్దె బాబు, వస్కుల బాబు, చింతాకుల అనిల్ కుమార్, బస్వ రాజు శిరీష, బస్వరాజు కుమార స్వామి, సోమిషెట్టి ప్రవీణ్, మహ్మద్ ఫుర్కాన్, ఆకుల మనోహర్, బాల్నే సురేష్‌తోపాటు మహిళా కార్పొరేటర్ల భర్తలు తదితరులు ఉన్నారు.
ఇవి చదవండి: బదిలీల కలకలం! బీఆర్‌ఎస్ బ్రాండ్ అధికారులపై వేటు..
Comments
Please login to add a commentAdd a comment