Sudha Rani
-
మేయర్.. 'మీరే మాకు పెద్ద దిక్కు!'
వరంగల్: గ్రేటర్ పరిధిలోని పలువురు కార్పొరేటర్లు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు అంటిముట్టనట్లుగా వ్యవహరించారు. కౌన్సిల్ సమావేశంలో అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్షమా? అన్నట్లుగా ప్రశ్నలు సంధించారు. కౌన్సిల్ సమావేశాల్లో మినహా పాలక వర్గం ఏర్పాటైన రెండున్నర ఏళ్లులో మేయర్‌ను ఎన్నడూ నేరుగా కలిసి సమస్యలు విన్నవించిన దాఖలాలు లేవు. కానీ అధికార మార్పిడితో పరిస్థితులు మారిపోయాయి. గతాన్ని వదిలేద్దాం అంటూ ఐక్యతారాగం అందుకున్నారు. ‘మేయర్ మీరే మాకు పెద్ద దిక్కు. మా డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలి’ అంటూ పలువురు అధికార పార్టీ కార్పొరేటర్లు విన్నవించడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణితో వరంగల్ తూ ర్పు, పరకాల నియోజక వర్గాల పరిధిలోని పలువురు కార్పొరేటర్లు భేటి అయ్యారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కరుగా ఏకరువు పెట్టారు. చాలామేరకు అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చాలాచోట్ల పనులు మొదలు పెట్టలేదని మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టణ ప్రగతి పథకం ద్వారా డివిజన్‌కు రూ.50లక్షలు కేటాయించారని, అందులో 20శాతం నిధులు ఎలక్ట్రికల్ పనులకు ఇచ్చారని, ఇప్పటికి పనులు ప్రారంభానికి నోచుకోలేదని పేర్కొన్నారు. ప్రతి డివిజన్‌కు జనరల్ ఫండ్ ద్వారా రూ.50లక్షల చొప్పున నిధులు కేటాయించాలని కోరారు. తాగునీరు, వీధి దీపాల సమస్యలు, పారిశుద్ధ్య లోపం తదితర విషయాలను వివరించారు. దీనిపై మేయర్ గుండు సుధారాణి స్పందించారు. అభివృద్ధి పనులు, ఇతర సమస్యల పరిష్కారం కోసం అధికారులతో చర్చించి, వేగవంతమయ్యే విధంగా చొరవ తీసుకుంటానని స్పష్టం చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు మరుపల్లి రవి, దిడ్డి కుమారస్వామి, గందె కల్పన, కావేటి కవిత, పోశాల పద్మ, గుండు చందన, రామా తేజస్విని, ముష్కమల్ల అరుణ, బైర బోయిన ఉమ, గద్దె బాబు, వస్కుల బాబు, చింతాకుల అనిల్ కుమార్, బస్వ రాజు శిరీష, బస్వరాజు కుమార స్వామి, సోమిషెట్టి ప్రవీణ్, మహ్మద్ ఫుర్కాన్, ఆకుల మనోహర్, బాల్నే సురేష్‌తోపాటు మహిళా కార్పొరేటర్ల భర్తలు తదితరులు ఉన్నారు. ఇవి చదవండి: బదిలీల కలకలం! బీఆర్ఎస్ బ్రాండ్ అధికారులపై వేటు.. -
పెళ్లైన నెలకే మెడ కోసి..
నిజాంపేట్(హైదరాబాద్)/కామారెడ్డి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే సైకోగా మారాడు. పెళ్లి తర్వాత భార్యపై అనుమానం పెంచు కున్నాడు. మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె మెడ కోసి దారుణంగా హత్య చేశాడు. ఆపై తానూ మెడ, చేతులపై కోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీ స్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన సుధారాణి.. అదే జిల్లా శివయ్యపల్లి గ్రామానికి చెందిన ఎర్రోల కిరణ్‌కుమార్ ఏడెనిమిది నెలలుగా ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి గత నెల 27న వివాహం చేసుకున్నారు. ఎన్నో ఆశలతో అత్తారింటికి వస్తే భర్త అనుమానాలతో ఆమె ఆందోళనకు గురైంది. దీంతో ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పింది. బంధువులతో కలసి మాట్లాడి సర్దిచెప్పి పంపించారు. కిరణ్‌కుమార్ సాప్ట్వేర్ ఉద్యోగి కావడంతో ప్రగతినగర్‌లోని శ్రీసాయిద్వారకా అపార్ట్మెంట్లో ఫ్లా ట్ తీసుకున్నారు. ఈ క్రమంలో శనివారం హై దరాబాద్ రావాలని కిరణ్ కుటుంబం నుంచి సుధారాణి తల్లిదండ్రులకు సమాచారం వెళ్లింది. రక్తం మడుగులో సుధారాణి... సుధారాణి తల్లిదండ్రులు శనివారం మధ్యా హ్నం 3:30 గంటల సమయంలో ప్రగతినగర్ కు వచ్చారు. కాలింగ్ బెల్ కొట్టినా, ఇద్దరికీ ఫోన్లు చేసినా స్పందన లేదు. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బెడ్రూమ్ తలుపు పగులగొట్టారు. సుధారాణి రక్తం మడుగులో చనిపోయి ఉండగా, కిరణ్‌కుమార్ కొన ఊపిరితో ఉన్నాడు. పోలీసులు వెంటనే కిరణ్‌ను ఆసుపత్రికి తరలించారు. కూరగాయలు కోసే కత్తితో సుధారాణి గొంతు, కాళ్లు, చేతులను కోశాడు. అపార్ట్మెంట్లోకి 2 వారాల క్రితమే వచ్చారని, అప్పటి నుంచీ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేదని చుట్టుపక్కల వారు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయంలో సుధారాణిని హత్యచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కిరణ్‌కుమార్ మెడ, చేతులపై కత్తితో కోసుకోవడంతో అధిక రక్తస్త్రావం అయ్యిం దని, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. అతను స్పృహలోకి వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశముందన్నారు. బంధువుల ఆందోళన భర్త, అత్తమామలే సుధారాణిని హతమార్చారని ఆగ్రహంతో ఆమె బంధువులు కామారెడ్డి శ్రీరాంనగర్ కాలనీలోని కిరణ్‌కుమార్ ఇంటిపై దాడిచేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఉదయం నుంచి రాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. -
పెళ్లయిన నెలకే.. భార్య గొంతు కోసి దారుణహత్య
సాక్షి, హైదరాబాద్: ఎన్నో ఆశలతో నూతన జీవితాన్ని ప్రారంభించిన నవవధువు పెళ్లయిన నెలకే దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన హైదరాబాద్‌లో బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్‌లో చోటుచేసుకుంది. ప్రగతినగర్‌కు చెందిన కిరణ్‌కు సుధారాణి (22) అనే యువతితో నెల రోజుల క్రితమే వివాహమైంది. పెళ్లి తర్వాత భార్య మీద అనుమానం పెంచుకున్న కిరణ్ శనివారం అర్ధరాత్రి సమయంలో ఆమెను గొంతుకోసి అతి కిరాతకంగా హత్యచేశాడు. అనంతరం తానూ చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికుల అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకొని సుధారాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన కిరణ్‌ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సుధారాణిని మరణాన్ని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు కామారెడ్డిలోని కిరణ్ ఇంటిపై దాడి చేసి ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (వేరే మహిళతో భర్త సంబంధం.. సర్పంచ్ తట్టుకోలేక..) -
జీవితంలో గరళం.. హృదయంలో అమృతం
అది నయం కాని వ్యాధి. మందులు వాడినన్ని రోజులూ జీవితాన్నిస్తుంది. ఆపేస్తే ప్రాణాలు తీసేసుకుంటుంది. అలాగని ‘నాకు ఈ వ్యాధి ఉంది’ అని ఎవ్వరికీ చెప్పుకోలేనిది. అది పెట్టే బాధ కన్నా సమాజం పెట్టే బాధ.. దానిని.. పంటిబిగువున తట్టుకుని నిలబడటం సాధ్యం కాదు. ఇలాంటి బాధను భరిస్తూ ఓ మహిళ ఒంటరి పోరాటం చేస్తోంది. తెలిసో తెలియకో భర్త చేసిన తప్పు ఆయనతో పాటు భార్యాబిడ్డలనూ వెంటాడింది. ఆ మహమ్మారి.. భర్తను బలి తీసుకున్నా, తనను బంధువుల్లో, సమాజంలో వివక్షకు గురిచేసినా ఆమె వెరవలేదు. భర్త చేసిన తప్పు వల్ల తనతో పాటు కుమార్తె అనుభవించిన క్షోభ మరెవ్వరికీ కలగకూడదని ఆమె భావించింది. హెచ్.ఐ.వి.పై విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ఇప్పటికే ఆ వ్యాధి బారిన పడ్డ వారికి ప్రభుత్వం ద్వారా అందే అన్ని రకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటోంది. హెచ్.ఐ.వి. కారణంగా కుటుంబ సభ్యులు దూరం చేసిన వారిని అక్కున చేర్చుకుని వారిని సేవా కేంద్రాలకు పంపిస్తోంది. హెచ్ఐవి, ఎయిడ్స్‌తో మరణించిన వారిని అయినవారు తీసుకెళ్లకపోతే తనే అన్నీ అయి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించి ఆదర్శంగా నిలుస్తోంది. ఆ ఆదర్శ మహిళే.. సుధారాణి. భర్త ద్వారా సంక్రమించింది ఆళ్లగడ్డకు చెందిన శ్రీనివాసరావు 22 ఏళ్ల క్రితం గుంటూరు సమీపంలోని ఓ గ్రామంలో టెలిఫోన్ బూత్ నిర్వహించేవారు. అందులోనే స్థానికంగా నివాసం ఉండే సుధారాణి పనిలో చేరింది. వారిద్దరి మధ్యా పరిచయం ప్రేమగా మారింది. వీరి పెళ్లికి మొదట పెద్దలు నిరాకరించినా తర్వాత ఒప్పుకున్నారు. 1997లో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక పాప కూడా జన్మించింది. గతంలో తిరిగిన తిరుగుళ్లకు శ్రీనివాసరావుకు హెచ్.ఐ.వి. సోకింది. ఈ కారణంగా ఆయన భార్య, పిల్లలూ ఇబ్బంది బలయ్యారు. ఈ సమయంలో శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల నుంచి సుధారాణి తీవ్ర వివక్షకు గురయ్యింది. తమ వాడికి ఎలాగో వ్యాధి వచ్చింది. ఆయనతో పాటు మిమ్మల్నీ చూడాలంటే సాధ్యం కాదని వెళ్లగొట్టారు. వ్యాధితో ఏడేళ్ల పాటు బాధను అనుభవించి 2005లో శ్రీనివాసరావు మరణించాడు. భర్త దహనసంస్కారాలు, పెద్దకర్మ కార్యక్రమాలు ముగిసిన వెంటనే సుధారాణిని పుట్టింటికి పంపించేశారు. ప్రేమపెళ్లిని కాదని సుధారాణిని దూరంగా ఉంచిన ఆమె తల్లిదండ్రులు భర్త చనిపోయిన తర్వాత మాత్రం అక్కున చేర్చుకున్నారు. ఆమెకూ ఆ వ్యాధి ఉందని తెలిసినా.. మేమున్నామంటూ ఓదార్చారు. దీంతో కొండంత ధైర్యంతో సుధారాణి తన జీవితాన్ని కొనసాగించారు. వైద్యుల సలహాతో ఏఆర్టి మందులు వాడుతూ పదహారేళ్లుగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. అవుట్ రీచ్ వర్కర్‌గా సేవలు తన జీవితం ఎలాగూ అస్తవ్యస్తమయ్యింది. తనలా మరొకరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని, అలాంటి వారిని అక్కున చేర్చుకుని ఆదరించాలని సుధారాణి నిర్ణయించుకున్నారు. భర్త మరణించిన తర్వాత పీపీటీసీటీ ప్లస్ ప్రోగ్రామ్‌లో భాగంగా సెయింట్ యాన్స్లో అవుట్‌రీచ్ వర్కర్‌గా చేరారు. ఇందులో భాగంగా గర్భిణిలను గుర్తించి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి హెచ్ఐవి పరీక్షలు చేయించి, ఒకవేళ వారికి హెచ్ఐవి ఉంటే బిడ్డకు ఆ వ్యాధి రాకుండా జాగ్రత్త పడేలా వైద్యులతో చికిత్స చేయిస్తున్నారు. గర్భిణిలకు బిడ్డ పుట్టిన తర్వాత కూడా 18 నెలల పాటు ఫాలో అప్ చేస్తున్నారు. బాధితుల కోసం కర్నూలుతో ‘నేస్తం’ డ్రాపింగ్ సెంటర్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్‌గా పనిచేసేందుకు 2007లో సుధారాణి కర్నూలు వచ్చారు. కర్నూలులో ‘నేస్తం ఫర్ రాయలసీమ రీజియన్ పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ వెల్ఫేర్ సొసైటీ’ని స్థాపించారు. డ్రాపింగ్ సెంటర్ ద్వారా హెచ్ఐవి ఉన్న వారికి ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తూ, వారు ఎవరి వల్లనైనా వివక్షకు గురవుతుంటే వెళ్లి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు సుధారాణి. అలాగే హెచ్ఐవి/ఎయిడ్స్‌పై కళాశాలలు, పాఠశాలలు, మహిళా ప్రాంగణాల్లో ఇప్పటి వరకు 220లకు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హెచ్ఐవితో ఉన్న వారికి తిరిగి చెల్లించనవసరం లేని రుణాలు ఇప్పించారు. ఇటీవలే ‘విహాన్ కేర్ అండ్ సపోర్ట్ సెంటర్’ ఏర్పాటు చేశారు. హెచ్ఐవితో జీవించే వారిని గుర్తించి, వారిని ఏఆర్టి సెంటర్‌తో లింకప్ చేసి మందులు తీసుకునేలా చేయడం, అవసరమున్న వారికి వైద్యుల వద్దకు రెఫర్ చేయడం ఈ సెంటర్ ద్వారా నిర్వహిస్తున్నారు. హెచ్ఐవితో బాధపడుతూ చురుకుగా, కాస్త ఆరోగ్యంగా ఉన్న వారితో ఇతరులు ఆ వ్యాధికి గురిగాకుండా వారితోనే చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే హెచ్ఐవి బారిన పడిన పిల్లలను ఐసీపీఎస్‌కు లింకప్ చేసి, వారికి ఏఆర్టి సెంటర్ ద్వారా మందులు అందుకునేలా చేయడంతోపాటు, నెలకు రూ.1000లు పింఛన్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికి పది వేల మంది హెచ్ఐవి బాధితులను గుర్తించి, వారిని ఏఆర్టి సెంటర్‌కు పంపించి మందులు ఇప్పించారు. అలాగే 104 మంది హెచ్ఐవి బాధిత చిన్నారులను గుర్తించి, వారి డాక్యుమెంట్లను ప్రభుత్వానికి పంపి ఒక్కొక్కరికి నెలకు రూ.500 లు ఆర్థిక సహాయం అందేలా చేశారు. శాంతి ఆశ్రమ ట్రస్ట్ వ్యవస్థాపకులు హిమాలయ గురూజీ ద్వారా ఏఆర్టి కేంద్రంలో చికిత్స పొందేందుకు వచ్చే 100 మందికి మధ్యాహ్న భోజనాన్ని ప్రతిరోజూ అందేలా చూశారు. హెచ్ఐవి కారణంగా కుటుంబసభ్యులు దూరం చేసిన వారిని కర్నూలు లోని శాంతినికేతన్, అభయగిరి సెంటర్లతో పాటు అనంతపురంలోని ఆర్డిటికి పంపిస్తున్నారు. వీరిలో ఎవరైనా చనిపోతే స్వయంగా దగ్గరుండి అంత్యక్రియలు జరిపిస్తున్నారు. – జె.కుమార్, సాక్షి, కర్నూలు నేను పడ్డ క్షోభ ఎవరూ పడకూడదనే ఆ వ్యాధి బయటపడినప్పటి నుంచి నేను, నా భర్త పడిన క్షోభ అంతా ఇంతా కాదు. ఆయన మంచాన పడ్డప్పుడు ఏ ఒక్కరూ వచ్చి చేయందించింది లేదు. సమాజంతో పాటు బంధువుల, స్నేహితులూ మమ్ములను దూరం చేశారు. ఐదేళ్ల పాటు ఆయనను కాపాడుకున్నా, చివరికి విధి గెలిచి ఆయనను మా నుంచి దూరం చేసింది. ఆ తర్వాత అమ్మ, తమ్ముడు నాకు పెద్ద దిక్కయ్యారు. సమాజం ఏమనుకున్నా ఫరవాలేదని అండగా నిలిచారు. వారి ప్రోత్సాహం వల్లే నేను ఈరోజు ఈస్థాయిలో ఉన్నాను. ఈ వ్యాధి భారిన పడిన వారు నాలాగా బాధపడకూడదని భావించి హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితులకు నా వంతు సేవ చేస్తున్నాను. – బి. సుధారాణి, నేస్తం కో ఆర్డినేటర్ -
పదవుల కోసం పార్టీలు మారతారు
సాక్షి, హైదరాబాద్: కొండా దంపతులకు పదవుల కోసం పార్టీలు మారే అలవాటు ఉంద ని, అందుకే అన్ని పార్టీల ను సంప్రదిస్తున్నారని టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుండు సుధారాణి విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర కేసీఆర్ కుటుంబా నిదని, ఉద్యమకారులపై దాడులు జరిపించిన చరిత్ర కొండా దంపతులదని ఆరోపించారు. మంగళవారం టీఆర్ఎస్ నేత గుడిమల్ల రవికుమార్‌తో కలిసి సుధారాణి తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్లో వర్గాలు ఉన్నాయని సురేఖ అంటున్నారని, కానీ అలాం టి గ్రూపులేమీ లేవని ఆమె స్పష్టం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ గురించి మాట్లాడే అర్హత కొండా దంపతులకు లేదని, వారిది పార్టీలో ఉండి వ్యతిరేక పనులు చేసే అలవాటని విమర్శించారు. కొండా దంపతులపై ప్రజలకు విశ్వాసం లేదని, వారికి దమ్ముంటే వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి గెలవాలని టీఆర్ఎస్ నాయకుడు గుడిమల్ల రవికుమార్ సవాల్ విసిరారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
జగిత్యాల: కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని విద్యానగర్‌కు చెందిన కమటం శ్రీనివాస్ కి అదే మండలంలోని జాప్తాపురం గ్రామానికి చెందిన సుధారాణితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. శ్రీనివాస్ ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడు. సుధారాణి స్థానిక ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయినిగా పనిచేస్తూ అత్తమామలతో ఉంటోంది. కొన్ని రోజులుగా కుటుంబంలో తగాదాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఆమె ఆదివారం రాత్రి ఉరేసుకుంది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబీకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి గంగారాజం దంపతులపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. -
బాబూ.. పగటి కలలు కనొద్దు: జేఎస్పీ నేత సుధ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్లు చంద్రబాబు నాయుడు అప్పుడే పగటి కలలు కంటున్నారని, ఆయన మాట్లాడే మాటలు, ఇచ్చే హామీలు దీన్ని స్పష్టం చేస్తున్నాయని జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ) అధికార ప్రతినిధి డాక్టర్ సుధారాణి విమర్శించారు. నరేంద్ర మోడీ ఆదుకుంటే తప్ప తెలుగువారికి భవిష్యత్తే ఉండదని చంద్రబాబు చెప్పడం తెలుగుజాతిని మరోసారి అవమానించడమే అవుతుందని దుయ్యబట్టారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్లపాటు రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఒరగబెట్టిందేమిటని ప్రశ్నించారు. అదేవిధంగా కేంద్రంలో పాలన సాగించిన ఎన్డీఏ సర్కారు కూడా చేసిందేమీ లేదన్నారు. -
డంకన్ డ్రైవ్‌లో చిక్కిన టీడీపీ ఎంపీ తనయుడు: విజయ్‌రాజు
సాక్షి,హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడుపుతూ టీడీపీ ఎంపీ సుధారాణి తనయుడు విజయ్‌రాజు పోలీసులకు పట్టుబడ్డాడు. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు నెం.36లో డ్రైవ్ నిర్వహించారు. ఈ సమయంలో మాదాపూర్ వైపు నుంచి కుటుంబంతో కలిసి విజయరాజ్ ఫార్చునర్ (ఎపి36 ఏక్యూ 0777) కారులో వస్తుండగా పోలీసులు ఆపారు. వాహనం నడుపుతున్న విజయరాజ్ను పరీక్షించగా మోతాదుకు మించి మద్యం తాగినట్టు గుర్తించారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
తిరునగరిలో సమైక్య భేరి
తిరుపతి నగరం శుక్రవారం సమైక్య నినాదాలతో హోరెత్తింది. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో లక్ష గళ సమైక్య భేరి మోగింది. జై సమైక్యాంధ్ర నినాదంఢిల్లీని తాకేలా ఉద్యమకారులు గర్జించారు. సాప్స్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి ఆర్డీవో రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ప్రైవేటు విద్యాసంస్థల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. సాక్షి, తిరుపతి: సమైక్యగళంతో తిరునగరి అట్టుడికింది. ఉద్యమ వేడి ఢిల్లీని తాకేలా కుల, మత భేదం లేకుండా లక్షగళ ఘోషతో సమైక్య నినాదాన్ని వినిపించారు. వేర్పాటువాదాన్ని తరిమి కొడదాం అని పిలుపునిచ్చారు. ఐక్యకార్యాచరణ సమితి, సాప్స్ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో లక్షగళ సమైక్య భేరి మోగింది. సాప్స్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఆర్డీవో రామచంద్రారెడ్డి హాజరయ్యారు. వివిధ ప్రైవేటు విద్యా సంస్థల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, యజమానులు తరలివచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు శాఖల అధికారులు, సిబ్బంది, న్యాయవాదులు, కళాకారులు, వ్యాపారులు, కార్మికులు, కర్షకులు లక్ష గళ సమైక్యభేరికి హాజరయ్యారు. ఉదయం 9గంటల నుంచి సమైక్యవాదులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. కళాకారులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. విద్యార్థులు వివిధ వేషధారణలో వేదిక వద్దకు చేరుకుని ప్రదర్శనలు చేశారు. పుంగనూరు నుంచి వచ్చిన చిన్నారులు కోలాటాలు అడుతూ జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. కార్వేటినగరం సంస్థానం సంప్రదాయాలతో కళాకారులు కత్తులు చేతబట్టి ప్రదర్శన చేశారు. మిన్నంటిన జై సమైక్యాంధ్ర నినాదాలు లక్షగళ సమైక్య భేరిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు జై సమైక్యాంధ్ర నినాదాలతో గర్జించారు. జ్వోతి ప్రజ్వలన అనంతరం ఒక్కొక్కరు ప్రసంగిస్తూ ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేర్పాటు వాదులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సమైక్య భేరికి కొందరు విద్యార్థులు భారీ జాతీయ జెండాతో హాజరయ్యారు. మరికొందరు సమైక్యాంధ్ర టోపీలు పెట్టుకుని తరలిరావడం కనిపించింది. రైల్యేస్టేషన్, గాంధీరోడ్డు, భవానీ నగర్, లీలామహల్, తుడా కూడలి సమైక్యవాదులతో కిక్కిరిసిపోయాయి. సమైక్య భేరికి హాజరైన వారికి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేశారు. రెండుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. సమైక్య భేరికి కాంగ్రెస్ నేత అడ్డుచక్రం తిరుపతిలో శుక్రవారం చేపట్టిన లక్ష గళ సమైక్య భేరిని కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ నియోజకవర్గ నేత ఒకరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మహిళా గ్రూపు సభ్యులెవరూ సమైక్య భేరిలో పాల్గొనకూడదని హుకుం జారీచేసినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే మహిళా సభ్యులు ఉద్యమంలో పాల్గొనలేదనే ప్రచారం సాగింది. తన మాట వినకుండా పాల్గొంటే ఇంటి పట్టాలు, రుణాలు రాకుండా చేస్తానని బెదిరించినట్లు కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ నాయకుడ్ని తిరుపతికి రాకుండా అడ్డుకోవాలని సమైక్యవాదులకు పిలుపునివ్వడం గమనార్హం. ఈ కార్యక్రమంలో సాప్స్ జేఏసీ నాయకులు అశోక్‌రాజు, కేఎల్.వర్మ, శేషగిరిరావు, మహ్మద్ఫ్రీ, సింధూజ, దినకర్, ఆనంద నాయుడు, శ్రీనివాస చౌదరి, హరినాథ్‌శర్మ, రంజిత్‌కుమార్, కేవీ.రత్నం, వేలాది మంది విద్యార్థిని, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మా గుండెలతో చలిమంట వేసుకుంటారా? తెలుగుజాతిని విభజన పేరుతో విడగొట్టి మండుతున్న మా గుండెలతో చలి మంటేసుకుంటారా?. చిన్నారులు, వయోవృద్ధులు సైతం రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తుంటే ప్రజాప్రతినిధులు తప్పించుకుని తిరుగుతుండడం బాధాకరం. వేర్పాటువాదుల స్వార్థానికి తెలుగుజాతిని రెండు ముక్కలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ధన, రాజకీయ స్వార్థం కోసం ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొడుతున్న వారిని తరిమితరిమి కొడతాం. - సాప్స్ జేఏసీ తిరుపతి కన్వీనర్ డాక్టర్ సుధారాణి తెలంగాణలోనూ ఎక్కువ మంది సమైక్యాంధ్రే కోరుతున్నారు సీమాంధ్రతోపాటు తెలంగాణలోనూ అత్యధికంగా సమైక్యాం ధ్రను కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ఈ విషయం తెలుస్తుంది. విభజన వల్ల ఇరు ప్రాంతాల వారు నష్టపోతారు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. - ఉద్యోగ జేఏసీ చైర్మన్ ఆర్డీవో రామచంద్రారెడ్డి విభజనతో విద్యార్థుల భవిత అంధకారమే రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలోని విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 17 సెంటర్ యూనివర్సిటీలు, ఐఐటీ, త్రిపుల్ ఐటీ, మెడికల్ కళాశాలలు వంటి ఉన్నత విద్యాలయాలు ఉన్నాయి. రాష్ట్రం ముక్కలైతే సీమాంధ్ర విద్యార్థులకు ఉన్నత విద్య, టెక్నికల్ విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పాలకులు రాష్ట్ర సమైక్యతను ప్రకటించాలి. - ఎన్.విశ్వనాథరెడ్డి, రాయలసీమ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రజాప్రతినిధులు అడ్డుకోకపోవడం సిగ్గుచేటు తెలుగుజాతి, సీమాంధ్ర ప్రజల ఉనికికే ప్రమాదకరంగా మారిన విభజనను ప్రజాప్రతినిధులు అడ్డుకోలేకపోవడం సిగ్గుచేటు. రాజీనామా చేయని ప్రజాప్రతినిధులు గల్లీకొస్తే ఢిల్లీ దాక తరిమికొట్టాలి. సమైక్య ప్రకటన వచ్చేవరకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి. - సాప్స్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం యుద్ధ వాతావరణం సృష్టించడం బాధాకరం ఒక్కటిగా ఉన్న తెలుగుజాతిని విభజిస్తూ యుద్ధ వాతావరణం సృష్టిస్తుండడం బాధాకరం. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో విభజన పేరుతో చిచ్చురేపిన నాయకులకు బుద్ధి వచ్చేలా ఉద్యమం ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరూ అలుపెరగని పోరాటాలకు సిద్ధం కావాలి. - సాప్స్ ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి భవిష్యత్తు తరాల కోసమే ఉద్యమం సీమాంధ్రలో ఉద్యోగులు టీఏ, డీఏల కోసమే లేక వ్యాపారాల కోసమే ఉద్యమాలు చేయడం లేదు. భవిష్యత్తు తరాల కోసం రోడ్డుపైకి వచ్చారు. ఈవిషయాన్ని గుర్తించి ప్రజాప్రతినిధులు వారికి అండగా నిలిచి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. లేకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదు. -జేఏసీ నేతలు విశ్వనాథ్‌రెడ్డి, రమేష్‌బాబు, కేఎస్.వాసు, వేంకటేశ్వర్లు