వడ్డెపల్లి,న్యూస్‌లైన్: ప్రకృతి సంపదను భావితరాలకు అందించడాన్ని మన కర్తవ్యంగా భావించాలని కలెక్టర్ కిషన్ అన్నారు. ప్రపంచ పర్యాటక వారోత్సవాలను పురస్కరించుకుని పర్యాటకశాఖ ఆధ్వర్యంలో శనివారం హన్మకొండ ఆర్ట్స్ కళాశాల నుంచి వడ్డెపల్లి చెరువు వరకు ‘2కే రన్’ నిర్వహించారు. జిల్లా అధికారి శివాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ సందర్భంగా చెరువుపై ఏర్పాటు చేసిన సదస్సులో ‘టూరిజం-నీరు’ అంశంపై కలెక్టర్ మాట్లాడారు.
కాకతీయులు నిర్మించిన లక్నవరం, పాకాల, రామప్ప సరస్సులతో పాటు వేయిస్తంభాల దేవాలయం, కోటగుళ్లు, రామప్ప లాంటి శిల్పకళాసంపదను రక్షించుకుని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లాలో టూరిజం అభివృద్ధికి కావాల్సిన వనరులు చాలా ఉన్నాయన్నారు. నగర కమిషనర్ వివేక్‌యాదవ్ మాట్లాడుతూ కాకతీయుల శిల్పకళా సంపదతో వరంగల్ నగరానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందన్నారు. జిల్లాలో పర్యాటకులను ఆకర్షించే వాతావరణం ఎంతో ఉంద ని అర్బన్ ఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. అనంతరం పబ్లిక్ గార్డెన్‌లోని టౌన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన టూరిజం ఫొటో ఎగ్జిబిషన్‌ను కలెక్టర్ కిషన్ ప్రారంభించారు.
27 వరకు పర్యాటక వారోత్సవాలు
27వ తేదీ వరకు నిర్వహించే ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో టూరిజం-నీటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు టూరిజం శాఖ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా అధికారి శివాజీ తెలిపారు. జిల్లాలో ముఖ్య పర్యాటక ప్రాంతాలైన రామప్ప, లక్నవరం, గణపురం కోటగుళ్లు, ఖిలా వరంగల్, వేయిస్తంభాల దేవాలయాలను కలుపుతూ ఆదివారం ప్రత్యేక టూర్ ప్యాకేజీతో టూరిస్ట్ బస్‌ను నడుపుతున్నట్టు తెలిపారు. కాకతీయ ఉత్సవాల్లో భాగంగా 24,25,26 తేదీల్లో గణపురం కోటగుళ్లు వద్ద గ్రామీణ పర్యాటక క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.
23న చిన్నవడ్డెపల్లి చెరువులో ఆర్చరీ, అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్, 27న పబ్లిక్ గార్డెన్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. జిల్లా టూరిజం శాఖపై పబ్లిక్‌గార్డెన్‌లోని టౌన్‌హాల్‌లో ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులతోపాటు జిల్లా ముఖ్య అధికారులు 2కే రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రకృతి సంపదను భావితరాలకు అందించాలి
Published Sun, Sep 22 2013 3:21 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
Advertisement
Advertisement