భవిష్యత్ తరాల కోసం సర్కారు చర్యలు
* వెల్లడించిన స్పీకర్ మధుసూదనాచారి
* ‘యునిసెఫ్’ నివేదిక ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ తరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, గర్భస్థ శిశువులను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు చేపడుతోందని శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా బాలల పరిస్థితిపై ‘యునిసెఫ్’ రూపొందిం చిన 2016 నివేదికను మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాలల జీవన ప్రమాణాల స్థాయిని పెంచేందుకు యునిసెఫ్ కృషి చేస్తోందని, ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు చేసి సూచనలు చేస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకూ వస్తున్న మార్పులకు అనుగుణంగా పిల్లల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని, గర్భిణులకు పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యకరమైన బాలలను దేశానికి అందిస్తోందన్నారు.
బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ‘కేజీ టు పీజీ’ విధానం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, నిరుపేదలకు కార్పొరేట్ విద్యను అందిస్తోందన్నారు. గత ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం వల్ల తన సొంత నియోజకవర్గం భూపాలపల్లి పరిధిలో చెంచులకు ఎలాంటి సౌకర్యాలనూ ఏర్పాటు చేయలేదని, పౌష్టికాహార లోపంతో గర్భిణులు, పిల్లలు చనిపోయే వారని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, వ్యత్యాసాలు, వాటిని పూరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోడానికి యునిసెఫ్ నివేదిక ఉపయోగ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల యునిసెఫ్ చీఫ్ రూత్ లియోని... ప్రపంచ బాలలకు సమాన అవకాశాల కోసం అనేక సూచనలు చేశామన్నారు. యునిసెఫ్ కమ్యూనికేషన్ అధికారి ప్రసోన్‌సేన్, శాసనసభా కార్యదర్శి రాజ సదారాం తదితరులు పాల్గొన్నారు.