UNICEF report
-
ప్రమాదపు అంచున ‘బాల్యం’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోని దాదాపు 100 కోట్ల మంది పిల్లలు వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం మూలంగా తీవ్ర ప్రభావానికి గురయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 220 కోట్ల మంది పిల్లలు వాతావరణ మార్పులకు సంబంధించిన ఏదో ఒక ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా భారత్, నైజీరియా, ఫిలిప్పీన్స్ సహా 33 దేశాల పిల్లలు వేడిగాలులు, వరదలు, తుఫానులు, వ్యా«ధుల సంక్రమణ, కరువు, వాయు కాలుష్యంవంటి మూడు నుంచి నాలుగు వాతావరణ ప్రభావాలను ఒకేసారి ఎదుర్కొంటున్నారని యూనిసెఫ్ తెలిపింది. తాజాగా విడుదల చేసిన తొలి వాతావరణ ప్రమాద సూచిక (సీసీఆర్‌ఐ) నివేదికలో పేర్కొంది. సీసీఆర్‌ఐ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ దేశాల్లో 8.7 పాయింట్లతో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మొదటి స్థానంలో ఉంది. 7.7 పాయింట్లతో పాకిస్తాన్ 14వ స్థానంలో ఉండగా, 7.6 పాయింట్లతో అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లు 15వ స్థానంలో ఉన్నాయి. కాగా 7.4 పాయింట్లతో భారత్ 26వ స్థానంలో ఉంది. 6.7 పాయింట్లతో చైనా 40వ స్థానంలో, 5.4 పాయింట్లతో శ్రీలంక 61వ స్థానంలో, 5 పాయింట్లతో అమెరికా 80వ స్థానంలో ఉన్నాయి. 92 కోట్ల మంది పిల్లలకు తాగునీటి కొరత వాతావరణ మార్పు, కాలుష్యం, పేదరికం, పిల్లలకు పరిశుభ్రమైన నీటి లభ్యత, ఆరోగ్యం, విద్యా సదుపాయాల లభ్యతవంటి అంశాలను పరిగణలోకి తీసుకొని యూనిసెఫ్ ఈ నివేదికను తయారుచేసింది. కాగా ఈ అంశాలపై గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ ప్రభావాల కారణంగా 33 దేశాల్లోని పిల్లల ఆరోగ్యం, విద్య, భద్రతకు సంబంధించిన పరిస్థితి భయంకరంగా ఉందని యూనిసెఫ్ అభివర్ణించింది. కాగా పిల్లల వాతావరణ ప్రమాద సూచిక (సీసీఆర్‌ఐ) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది పిల్లలు వాయు కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అంతేగాక 92 కోట్ల మంది పిల్లలు తాగునీటి కొరతతో బాధపడుతున్నారని, 82 కోట్ల మంది వేడిగాలులు, 60 కోట్ల మంది చిన్నారులు మలేరియా, డెంగ్యూ జ్వరం వంటి సంక్రమించే వ్యాధుల ప్రభావానికి గురవుతున్నారు. 24 కోట్ల మంది పిల్లలు తీరప్రాంత వరదలకు, 33 కోట్లమంది పిల్లలు నదీ ప్రవాహానికి, 40 కోట్లమంది పిల్లలు తుఫానులకు, 81.5 కోట్ల పిల్లలు లెడ్ (సీసం) కాలుష్య ప్రభావాలకు లోనవుతున్నారని నివేదిక తెలిపింది. సుమారు 100 కోట్ల మంది చిన్నారులు అత్యధిక స్థాయిలో ఉన్న వాయుకాలుష్య ప్రభావానికి గురవుతున్నారు. 4.09 లక్షల మలేరియా మరణాలు వాతావరణపరంగా అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్న దేశాల్లో క్లీన్ ఎనర్జీపై పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి కోసం ప్రపంచవ్యాప్త వనరుల ద్వారా కేవలం 980 కోట్ల అమెరికన్ డాలర్లు అందాయని యూనిసెఫ్ పేర్కొంది. సురక్షిత తాగునీరు, పరిశుభ్రత వంటి అంశాలపై పెట్టుబడులను పెంచడం వల్ల కనీసం 41.5 కోట్ల మంది చిన్నారులను రక్షించే అవకాశం ఉంటుందని నివేదికలో తెలిపారు. అంతేగాక 2019లో ప్రపంచవ్యాప్తంగా 22.9 కోట్ల మలేరియా కేసులు నమోదుకాగా, సుమారు 4.09 లక్షల మరణాలు సంభవించాయి. 10 దేశాల నుంచి 70% కర్బన ఉద్గారాలు కర్బన ఉద్గారాలు ఎక్కువగా ఉత్పన్నమౌతున్న దేశాల్లోని చిన్నారుల పరిస్థితులకు, వాతావరణంలోని అత్యంత తీవ్రమైన ప్రభావాలను ఎదుర్కొంటున్న దేశాల్లో పిల్లల పరిస్థితికి ఏ మాత్రం సంబంధంలేదని ఈ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని గ్రీన్‌హౌజ్ ఉద్గారాల్లో కేవలం 9 శాతం ఉద్గారాలు వాతావరణ ప్రభావానికి గురైన 33 అత్యంత ప్రమాదకర దేశాల్లో విడుదలవుతున్నాయి. కాగా ప్రపంచ ఉద్గారాలలో దాదాపు 70 శాతం కేవలం 10 దేశాల నుంచి విడుదలవుతున్నాయి. టాప్ 10 దేశాల్లో భారత్ మాత్రమే సీసీఆర్‌ఐ జాబితాలో అత్యంత ప్రమాదకర స్థానంలో ఉంది. టాప్ 10 దేశాల్లో 30.30%తో చైనా, 14.63%తో అమెరికా, 7.15%తో భారత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తక్షణమే చర్యలు తీసుకోని పక్షంలో ఎక్కువగా పిల్లలపై ప్రభావం ఉంటుందని యూనిసెఫ్ హెచ్చరించింది. 81.5 కోట్ల మంది పిల్లల్లో సీసం కాలుష్యం ప్రభావం ఇతర విషపూరితమైన ప్రమాదాలలో సీసం కాలుష్యం ఎక్కువగా నమోదవుతోంది. ఇది తరచుగా నేల, నీటిలో కనిపిస్తుంది. ప్రపం చవ్యాప్తంగా దాదాపు 81.5 కోట్ల మంది పిల్లల్లో ఒక డెసి లీటర్‌కు 5 మైక్రోగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ స్థాయి సీసం రక్తంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కారణంగా పిల్లల్లో ఐక్యూ స్థాయి తగ్గడంతో పాటు వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం ఉంటుందని యూనిసెఫ్ సీసీఆర్‌ఐ నివేదికలో పేర్కొంది. అంతేగాక సీసం కాలు ష్యం ప్రభావం కేవలం పిల్లలకు మాత్రమే పరిమితం కాకుండా, దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది 9 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవిస్తున్నాయని తెలి పింది. -
తగ్గిన బాల్య వివాహాలు
ఐక్యరాజ్యసమితి: పాతిక సంవత్సరాలుగా భారత్‌లో బాల్య వివాహాల సంఖ్య తగ్గిందని ఐక్య రాజ్యసమితి పేర్కొంది. భారత్‌లాంటి అధిక జనాభా ఉన్న దేశాల్లో బాల్య వివాహాల సంఖ్య తగ్గడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా బాల్యవివాహాల శాతం భారీగా తగ్గిందని తెలిపింది. ఈ మేరకు ఐరాస చిన్నారుల వేదిక ‘యూనిసెఫ్’ ఒక అధ్యయనాన్ని ప్రకటించింది. గత 3 దశాబ్దాలుగా చిన్నారుల జీవితాలు ఎంతో మెరుగైనా పేద చిన్నారులకు ఆ ప్రయోజనాలు అందేందుకు కృషి చేయాల్సి ఉందని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టడానికి ఆర్థికాభివృద్ధి, మహిళల సాధికారత ప్రధాన కారణాలన్నారు. భారత్‌ను ఉదహరిస్తూ.. చట్టపర సంస్కరణలు, బాలికా సాధికారతా పథకాలు బాల్య వివాహాలు తగ్గడానికి కారణమవుతాయన్నారు. భారత్‌లో చట్టపరమైన వయస్సు వచ్చే వరకు బాలికలకు వివాహం చేయకుంటే ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేలా పథకాలున్నాయని అధ్యయనం గుర్తు చేసింది. గత పాతికేళ్లలో దక్షిణ ఆసియాలో బాల్య వివాహాలు 59 నుంచి 30 శాతానికి తగ్గినట్టు వెల్లడించింది. -
ఇవే పిల్లలకు బలం: యునిసెఫ్
న్యూఢిల్లీ: పిల్లల్లో స్థూలకాయం, రక్తహీనత తదితర అనారోగ్య సమస్యలను నివారించేందుకు తీసుకోదగిన చౌకైన పౌషకాహారం గురించి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల నిధి (యునిసెఫ్) తన బుక్‌లెట్‌లో పేర్కొంది. ఊతప్పం నుంచి మొలకెత్తిన గింజలతో చేసిన పరోఠాల దాకా రకరకాల పౌష్టికాహారాన్ని తన బుక్‌లెట్‌లో సూచించింది. యునిసెఫ్ సర్వే ప్రకారం అయిదేళ్ల వయస్సులోపు పిల్లల్లో 35 శాతం మంది ఎదుగుదల లోపంతో, యుక్తవయస్సులోని బాలికల్లో 40 శాతం మంది, బాలల్లో 18 శాతం రక్తహీనత సమస్య ఉంటోందని వెల్లడైంది. పిల్లల్లో తక్కువ బరువు సమస్యను అధిగమించేందుకు ఆలూ పరాఠా, పనీర్ కఠి రోల్, సగ్గుబియ్యం కట్లెట్ వంటివి.. స్థూలకాయ సమస్య నివారణకు మొలకెత్తిన పప్పుగింజలతో పరాఠాలు, పోహా, ఉప్మా మొదలైన ఆహారం అందించవచ్చని సూచించింది. -
ఒక్కరోజులోనే జననం.. మరణం!
వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 10 లక్షల మంది చిన్నారులు పుట్టినవెంటనే చనిపోతున్నారని యూనిసెఫ్ తెలిపింది. నెల రోజుల్లోపు వయసున్న చిన్నారులు ప్రతి ఏటా 26 లక్షల మంది కన్నుమూస్తున్నారని వెల్లడించింది. అభివృద్ధి చెందిన ధనిక దేశాలతో పోల్చుకుంటే పేద దేశాల్లో పుట్టే చిన్నారులు చనిపోయే అవకాశం 50 రెట్లు ఎక్కువని పేర్కొంది. ఈ మరణాలన్నీ మెరుగైన వైద్యంతో నివారించదగ్గవేనని యూనిసెఫ్ తెలిపింది. గత పాతికేళ్లలో చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి పురోగతి సాధించినప్పటికీ, నెలరోజుల్లోపు వయసున్న నవజాత శిశువుల ఆరోగ్యం విషయంలో చాలా దేశాలు విఫలమయ్యామని వెల్లడించింది. భారత్‌లో ప్రతి ఏటా 6 లక్షల మంది చిన్నారులు పుట్టిన నెల రోజుల్లోపే కన్నుమూస్తున్నారని పేర్కొంది. ‘ఎవ్రీ చైల్డ్ అలైవ్’పేరుతో చేపట్టిన ప్రచార కార్యక్రమానికి అనుబంధంగా 184 దేశాల్లో చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి యూనిసెఫ్ ఈ నివేదికను మంగళవారం విడుదల చేసింది. పాక్లోఅత్యధికం, జపాన్‌లో అత్యల్పం నవజాత శిశువుల మరణాల్లో పాకిస్తాన్ తొలిస్థానంలో నిలిచిందనీ, అక్కడ పుట్టిన ప్రతి 22 మంది శిశువుల్లో ఒకరు చనిపోతున్నారని యూనిసెఫ్ తెలిపింది. శిశు మరణాలకు సంబంధించి 52 దిగువ మధ్యతరగతి దేశాల్లో భారత్ 12వ స్థానంలో నిలిచినట్లు యూనిసెఫ్ తెలిపింది. నవజాత శిశువుల మరణాలు జపాన్‌లో(ప్రతి 1,111 మందిలో ఒకరు) అత్యల్పంగా నమోదైనట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్న చిన్నారుల్లో 80 శాతం మందిని మెరుగైన వైద్యసౌకర్యాలతో రక్షించవచ్చని వెల్లడించింది. అమెరికా సైతం చిన్నారులకు సురక్షితమైన దేశాల్లో 41వ స్థానంలో నిలిచిందని తెలిపింది. అభివృద్ధి చెందినదేశాల్లో కూడా ధనికులతో పోల్చుకుంటే పేద కుటుంబాల్లో పుట్టిన చిన్నారులు చనిపోయే అవకాశం 40 శాతం ఎక్కువని వెల్లడించింది. భారత్‌లో ఏటా 6 లక్షల మంది మృతి భారత్‌లో పుట్టే చిన్నారుల్లో 6 లక్షల మందికిపైగా నెలరోజుల్లోపే కన్నుమూస్తున్నారని యూనిసెఫ్ తెలిపింది. ఇలా చనిపోతున్నవారిలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారంది. కేరళ, గోవా రాష్ట్రాల్లో పుట్టిన ప్రతి 1000 మంది చిన్నారుల్లో 10 మంది నెల రోజుల్లోపే చనిపోతుండగా, ఉత్తరాఖండ్, బిహార్‌లో ఇది 44గా ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం జననాల్లో ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల వాటా 46 శాతంగా ఉందంది. అలాగే దేశవ్యాప్తంగా నెలరోజుల్లోపు చనిపోతున్న శిశువుల్లో ఈ రాష్ట్రాల్లోనే 57 శాతం మంది ఉన్నారని వెల్లడించింది. 2030 నాటికి నెల రోజుల్లోపు శిశు మరణాల రేటును ప్రతి వెయ్యిమందికి 12కు తగ్గించాలన్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని భారత్ అందుకోలేదని నివేదిక స్పష్టం చేసింది. అయితే ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలను ప్రతి వెయ్యిమందికి 25కు తగ్గించడంలో భాగంగా భారత్ మంచి పురోగతి సాధించిందని పేర్కొంది. ఈ జాబితాలో భారత్(31వ ర్యాంక్)తో పోల్చుకుంటే నేపాల్(50), బంగ్లాదేశ్(54 ), భూటాన్(60), శ్రీలంక(127) మెరుగైన ర్యాంకులు సాధించాయని తెలిపింది. -
న్యూ ఇయర్ రోజు ఎంతమంది జన్మించారంటే..!
అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన కొత్త సంవత్సరం వచ్చేసింది. నూతన సంవత్సరం తొలిరోజు జన్మించిన శిశువుల సంఖ్యలో ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. 2018 జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 3,86,000 మంది పిల్లలు జన్మించినట్లు యూనైటెడ్ నేషన్స్ చిల్డన్స్ ఫండ్(యూనిసెఫ్) తన నివేదికలో వెల్లడించింది. ఇండియాలో జనవరి 1న దాదాపుగా 69,070 మంది పిల్లలు జన్మించారని యూనిసెఫ్ తెలిపింది. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న జననాలలో సగానికిపైగా తొమ్మిది దేశాల్లోనే ఉన్నట్లు యూనిసెఫ్ నివేదిక స్పష్టం చేసింది. ఇండియా తర్వాత చైనా(44,760), నైజీరియా(20,280), పాకిస్తాన్(14,910), ఇండోనేషియా(13,370), అమెరికా(11,280), కాంగో(9,400), ఇతియోపియా(9,020), బంగ్లాదేశ్(8,370)లు వరుసగా ఉన్నాయి. అంతేకాక 90% జననాలు వెనుకబడిన ప్రాంతాల్లో జరిగినట్లు ఓ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. జనవరి 1వ తేదీన జన్మించిన బిడ్డకు బెంగళూరు నగర్ మేయర్ సంపత్ కుమార్ రూ. 5 లక్షలు ఇస్తామని చేసిన ప్రకటన తెలిసిందే. -
మోదీ, సచిన్ అస్సలు వద్దు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధాని నరేంద్ర మోదీ, మాస్టర్ బాస్టర్ సచిన్ టెండూల్కర్ కంటే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కే భారత్‌లో ఎక్కువ పాపులారిటీ ఉందని యూనిసెఫ్ నిర్వహించిన ఓ సర్వే తేల్చింది. నవంబర్ 20న అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా సర్వే వివరాలతో కూడిన నివేదికను వెలువరించింది. 9-18 ఏళ్లలోపు పిల్లలు తమ పుట్టిన రోజు వేడుకలకు ఏ సెలబ్రిటీని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తారు అన్న ప్రశ్నకు.. ఎక్కువ మంది అమితాబ్ పేరును బదులిచ్చారు. భారత్‌లో బాలీవుడ్ స్టార్లు, ప్రధాని మోదీ, సచిన్ వంటి క్రికెట్ స్టార్ల పేర్లను వారి వద్ద ప్రస్తావన తీసుకొచ్చింది. అయితే వీరిలో ఎక్కువ మంది బిగ్ బీనే తమ అతిథి అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ప్రధానమైంది ఏంటంటే.. ముక్తకంఠంతో టెర్రరిజం అన్న సమాధానం వినిపించారు. ప్రస్తుతం భారత్‌లోని చిన్నారుల్లో పరిపక్వత అన్నది పెరిగిపోయింది. కానీ, ఆడపిల్లలపై మాత్రం వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉంది. వారి చదువుల కోసం మరిన్ని సంస్కరణలను ప్రభుత్వం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది అని యూనిసెప్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జస్టిన్ ఫోర్సిత్ అభిప్రాయపడ్డారు. ఈ సర్వేల్లో మిగతా దేశాల్లో బరాక్ ఒబామా, ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో, జస్టిన్ బీబర్, టేలర్ స్విఫ్ట్ వంటి సెలబ్రిటీల పేర్లను అత్యధికంగా పిల్లలు వెల్లడించారు. సుమారు 14 దేశాల్లో(భారత్‌లో 1000 మంది) అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న యూనిసెఫ్ ఈ విషయాలను వెల్లడించింది. -
అక్కడ పది నిమిషాలకో మృత్యువు
సనా: యెమెన్‌లో రెండేళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి బాల్యం బలవుతోంది. పిల్లల ఎండిన డొక్కల్లో పేగులు ఆకలిదప్పులతో నకనకలాడుతున్నాయి. జీవచ్ఛవమవుతున్న బాల్యాన్ని మృత్యువు ఎప్పటికప్పుడు మింగేస్తుంది. ప్రస్తుతం యెమెన్‌లో 22 లక్షల మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారని యునిసెఫ్ ఓ నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. వారిలో నాలుగున్నర లక్షల మంది పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉందని పేర్కొంది. సౌదీ మద్దతిస్తున్న ప్రభుత్వ దళాలకు, షియా తిరుగుబాటుదారుల మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధం వల్ల దేశం వైద్యరంగం కూడా పూర్తిగా కుప్పకూలిపోయింది. షియా తిరుగుబాటుదారుల ప్రాబల్యం ఎక్కువగావున్న సాదా ప్రావిన్స్‌లో ప్రతి పదిమంది పిల్లల్లో ఎనిమిది మంది పిల్లలు ఆహారం నోచుకోక అల్లాడిపోతున్నారు. ప్రపంచంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా యెమెన్ పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. అతిసారం, శ్వాస సంబంధిత సమస్యలతో పది నిమిషాలకు ఒక పిల్లా లేదా పిల్లాడు మరణిస్తున్నాడని పేర్కొంది. ఈ ఏడాది యెమెన్‌లోని రెండు లక్షల మంది పిల్లలకు మాత్రమే తాము విటమిన్ సప్లిమెంట్లు, పౌష్టికాహారాన్ని అందజేయగలిగామాని యునిసెఫ్ అధికారి మెరిటెక్సెల్ రెలానో తెలిపారు. నిధుల కొరత యుద్ధ ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకపోవడం వల్ల ఇంతమందికన్నా ఎక్కువ మంది పిల్లలకు తాము సరఫరాలు అందించలేకపోయామని రెలానో ఆందోళన వ్యక్తం చేశారు. దయచేసి పిల్లలను ఆదుకునేందుకు తమకు సహకరించాలని యుద్ధం చేస్తున్న ఇరు వర్గాలకు విజ్ఞప్తి చేశారు. -
ప్రపంచవ్యాప్తంగా పిల్లలను ఆదుకోండి: యూనిసెఫ్
ముంబై : పేదరికం, నిరక్షరాస్యత , లక్షలాది పిల్లలను బలి తీసుకుంటున్నాయని యూనిసెఫ్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా 2030 కల్లా 69 లక్షల మంది పిల్లలు 5 ఏళ్ల లోపు చనిపోతారని, 1.67 కోట్ల మంది పిల్లలు పేదరికంతో బాధపడతారని తెలిపింది. అలాగే 7.5 కోట్ల బాల్యవివాహాలు జరుగుతాయని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించాలంటే ఈ సవాళ్లను అధిగమించాలని పిలుపునిచ్చింది. దీన్ని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు సోమవారం ముంబైలో విడుదల చేశారు. ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు పిల్లల అవసరాలను తీర్చడానికి ప్రయత్నించడం లేదని, పేదరికం నుంచి వారిని బయటపడేసి, వారిని పాఠశాలకు వెళ్లేలా చూడాలని యూనిసెఫ్ కోరింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1.24 కోట్ల మంది పిల్లలు ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను అభ్యసించడం లేదని నివేదిక పేర్కొంది. -
భవిష్యత్ తరాల కోసం సర్కారు చర్యలు
* వెల్లడించిన స్పీకర్ మధుసూదనాచారి * ‘యునిసెఫ్’ నివేదిక ఆవిష్కరణ సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ తరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, గర్భస్థ శిశువులను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు చేపడుతోందని శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా బాలల పరిస్థితిపై ‘యునిసెఫ్’ రూపొందిం చిన 2016 నివేదికను మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాలల జీవన ప్రమాణాల స్థాయిని పెంచేందుకు యునిసెఫ్ కృషి చేస్తోందని, ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు చేసి సూచనలు చేస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకూ వస్తున్న మార్పులకు అనుగుణంగా పిల్లల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని, గర్భిణులకు పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యకరమైన బాలలను దేశానికి అందిస్తోందన్నారు. బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ‘కేజీ టు పీజీ’ విధానం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, నిరుపేదలకు కార్పొరేట్ విద్యను అందిస్తోందన్నారు. గత ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం వల్ల తన సొంత నియోజకవర్గం భూపాలపల్లి పరిధిలో చెంచులకు ఎలాంటి సౌకర్యాలనూ ఏర్పాటు చేయలేదని, పౌష్టికాహార లోపంతో గర్భిణులు, పిల్లలు చనిపోయే వారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, వ్యత్యాసాలు, వాటిని పూరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోడానికి యునిసెఫ్ నివేదిక ఉపయోగ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల యునిసెఫ్ చీఫ్ రూత్ లియోని... ప్రపంచ బాలలకు సమాన అవకాశాల కోసం అనేక సూచనలు చేశామన్నారు. యునిసెఫ్ కమ్యూనికేషన్ అధికారి ప్రసోన్సేన్, శాసనసభా కార్యదర్శి రాజ సదారాం తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌పై యునిసెఫ్ నివేదిక
-
నేలరాలుతున్న పసికందులు
ఏటా 80వేల మంది శిశువుల మృతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌పై యునిసెఫ్ నివేదిక హైదరాబాద్: వైద్య విజ్ఞానం అంతకంతకూ పెరుగుతున్నా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శిశువుల మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి తోడు వైద్య సిబ్బందికి సరైన శిక్షణ లేకపోవడంవల్ల తల్లులకు గర్భశోకాన్ని మిగుల్చుతోంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా, శిశు మరణాలను నియంత్రించడంలో ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) ఘోరంగా విఫలమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏటా 80 వేల మందికి పైగా శిశువులు మరణిస్తున్నట్టు యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి భారతదేశంలో 35 రాష్ట్రాలుంటే అందులో శిశు మరణాల నియంత్రణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 26వ స్థానంలో ఉందంటే రాష్ట్రంలో శిశు మరణాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందికీ 49 మంది శిశువులు వివిధ కారణాల వల్ల ఏడాదిలోపే మరణిస్తున్నారు. వీరిలోనూ 33 మంది నెలలోపే మృతి చెందుతున్నారు. ఎక్కువమంది తక్కువ బరువుతో జన్మించడం వల్ల మరణిస్తున్నట్లు యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. నిమోనియా, పుట్టుకతోనే వచ్చే లోపాలు, కామెర్లు తదితర కారణాలూ నవజాత శిశువుల మరణాలకు కారణాలవుతున్నాయని తెలిపింది. శిశు మరణాలకు ప్రధాన కారణంగా రాష్ట్రంలో ప్రసూతి కేంద్రాలు అధ్వానంగా ఉండటమేనని తేల్చింది. శిశువులను కాపాడగలిగిన వైద్య పరికరాలు, అత్యాధునిక వైద్యం అందుబాటులో లేవని తెలిపింది. ఆస్పత్రుల సామర్థ్యానికి మించి శిశువులు వైద్యానికి వస్తున్నారని, వారికి తగిన వసతులు ఉండటంలేదని పేర్కొంది. ఉదాహరణకు నీలోఫర్ ఆస్పత్రిలో 500 పడకలు ఉంటే రోజూ వెయ్యి మంది ఇన్పేషెంట్లుగా వస్తున్నారు. యూనిసెఫ్ పేర్కొన్న కారణాలు. రాష్ట్రంలో పీడియాట్రిక్ (చిన్న పిల్లల) వైద్యుల కొరత ఎక్కువగా ఉండటం ఎక్కువ మంది వైద్యులు డిప్లొమా ఇన్ పీడియాట్రిక్ వారే కావడం వల్ల చాలా వ్యాధులను గుర్తించలేకపోవడం నవజాత శిశువులకు వైద్య సేవలందించి, వారిని కాపాడటానికి సరైన శిక్షణ పొందిన వైద్యులు, నర్సులు లేకపోవడం కొన్ని చోట్ల ఆధునిక వైద్య పరికరాలున్నా, వాటిని వాడే విధానం తెలియకపోవడం లేబర్ రూమ్‌లు (ప్రసూతి కేంద్రం) సరిగా లేక 70 శాతం మంది నవజాత శిశువులకు ఇన్ఫెక్షన్లు సోకడం {పసవ సమయంలో ఆస్పత్రికి వచ్చేందుకు రవాణాలో జాప్యం కావడం పుట్టగానే కామెర్లు, శ్వాసకోశ వ్యాధులు తదితర వాటి నుంచి కాపాడేందుకు అవసరమైన ఫొటోథెరపీ మెషీన్లు, నెబ్యులైజర్లు, ఇంక్యుబేటర్లు లేకపోవడం రూ.500 కోట్లు ఖర్చు చేసినా.. రాష్ట్రంలో శిశు మరణాల నియంత్రణకు గత నాలుగేళ్లలో సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం. మాతా శిశు మరణాల నియంత్రణకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ పేరిట 21 కేంద్రాలను ఎంపిక చేశారు. వీటికి సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేశారు. తీరా చూస్తే వీటిలో డాక్టర్లు లేరు. మెరుగైన ప్రసూతి వైద్య సేవలు అందించాలని సీమాంక్ సెంటర్ల పేరిట సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేశారు. అయినా శిశు మరణాలు తగ్గలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రసూతి సౌకర్యాల కోసం 300 సీహెచ్‌సీలు (సామాజిక ఆరోగ్య కేంద్రాలు) ఏర్పాటు చేస్తే 90 శాతం ఆస్పత్రుల్లో వైద్యులు లేరు. రాష్ట్రంలో కనీసం 350 మంది శిక్షణ పొందిన పీడియాట్రిక్ వైద్యుల అవసరం ఉంటే.. ప్రస్తుతం 50 మంది కూడా లేరు. ఎన్ఆర్హెచ్ఎం పథకం నిధులతో ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు కొనుగోలు చేస్తున్న వైద్య పరికరాలు అధికారులు, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి తప్ప శిశు మరణాలను ఆపలేకపోతున్నాయి. శిశు మరణాలను అరికట్టండి: మంత్రి శ్రీనివాస్ రాష్ట్రంలో శిశు మరణాలను అరికట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శిశు మరణాలు జరగకుండా గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి రాసిన లేఖలో ఆదేశించారు. మాతా శిశుమరణాల నివారణకు అవసరమైన వైద్యులను నియమించాలని చెప్పారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు సరిగా పనిచేయడంలేదని, వీటిపై దృష్టి సారించాలని సూచించారు. ప్రధాన ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించి మెరుగైన సేవలు అందించాలన్నారు.