ప్రతీకాత్మక చిత్రం
వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 10 లక్షల మంది చిన్నారులు పుట్టినవెంటనే చనిపోతున్నారని యూనిసెఫ్ తెలిపింది. నెల రోజుల్లోపు వయసున్న చిన్నారులు ప్రతి ఏటా 26 లక్షల మంది కన్నుమూస్తున్నారని వెల్లడించింది. అభివృద్ధి చెందిన ధనిక దేశాలతో పోల్చుకుంటే పేద దేశాల్లో పుట్టే చిన్నారులు చనిపోయే అవకాశం 50 రెట్లు ఎక్కువని పేర్కొంది. ఈ మరణాలన్నీ మెరుగైన వైద్యంతో నివారించదగ్గవేనని యూనిసెఫ్ తెలిపింది.
గత పాతికేళ్లలో చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి పురోగతి సాధించినప్పటికీ, నెలరోజుల్లోపు వయసున్న నవజాత శిశువుల ఆరోగ్యం విషయంలో చాలా దేశాలు విఫలమయ్యామని వెల్లడించింది. భారత్‌లో ప్రతి ఏటా 6 లక్షల మంది చిన్నారులు పుట్టిన నెల రోజుల్లోపే కన్నుమూస్తున్నారని పేర్కొంది. ‘ఎవ్రీ చైల్డ్ అలైవ్’పేరుతో చేపట్టిన ప్రచార కార్యక్రమానికి అనుబంధంగా 184 దేశాల్లో చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి యూనిసెఫ్ ఈ నివేదికను మంగళవారం విడుదల చేసింది.
పాక్‌లోఅత్యధికం, జపాన్‌లో అత్యల్పం
నవజాత శిశువుల మరణాల్లో పాకిస్తాన్ తొలిస్థానంలో నిలిచిందనీ, అక్కడ పుట్టిన ప్రతి 22 మంది శిశువుల్లో ఒకరు చనిపోతున్నారని యూనిసెఫ్ తెలిపింది. శిశు మరణాలకు సంబంధించి 52 దిగువ మధ్యతరగతి దేశాల్లో భారత్ 12వ స్థానంలో నిలిచినట్లు యూనిసెఫ్ తెలిపింది. నవజాత శిశువుల మరణాలు జపాన్‌లో(ప్రతి 1,111 మందిలో ఒకరు) అత్యల్పంగా నమోదైనట్లు పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్న చిన్నారుల్లో 80 శాతం మందిని మెరుగైన వైద్యసౌకర్యాలతో రక్షించవచ్చని వెల్లడించింది. అమెరికా సైతం చిన్నారులకు సురక్షితమైన దేశాల్లో 41వ స్థానంలో నిలిచిందని తెలిపింది. అభివృద్ధి చెందినదేశాల్లో కూడా ధనికులతో పోల్చుకుంటే పేద కుటుంబాల్లో పుట్టిన చిన్నారులు చనిపోయే అవకాశం 40 శాతం ఎక్కువని వెల్లడించింది.
భారత్‌లో ఏటా 6 లక్షల మంది మృతి
భారత్‌లో పుట్టే చిన్నారుల్లో 6 లక్షల మందికిపైగా నెలరోజుల్లోపే కన్నుమూస్తున్నారని యూనిసెఫ్ తెలిపింది. ఇలా చనిపోతున్నవారిలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారంది. కేరళ, గోవా రాష్ట్రాల్లో పుట్టిన ప్రతి 1000 మంది చిన్నారుల్లో 10 మంది నెల రోజుల్లోపే చనిపోతుండగా, ఉత్తరాఖండ్, బిహార్‌లో ఇది 44గా ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం జననాల్లో ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల వాటా 46 శాతంగా ఉందంది.
అలాగే దేశవ్యాప్తంగా నెలరోజుల్లోపు చనిపోతున్న శిశువుల్లో ఈ రాష్ట్రాల్లోనే 57 శాతం మంది ఉన్నారని వెల్లడించింది. 2030 నాటికి నెల రోజుల్లోపు శిశు మరణాల రేటును ప్రతి వెయ్యిమందికి 12కు తగ్గించాలన్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని భారత్ అందుకోలేదని నివేదిక స్పష్టం చేసింది. అయితే ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలను ప్రతి వెయ్యిమందికి 25కు తగ్గించడంలో భాగంగా భారత్ మంచి పురోగతి సాధించిందని పేర్కొంది. ఈ జాబితాలో భారత్(31వ ర్యాంక్)తో పోల్చుకుంటే నేపాల్(50), బంగ్లాదేశ్(54 ), భూటాన్(60), శ్రీలంక(127) మెరుగైన ర్యాంకులు సాధించాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment