
అక్కడ పది నిమిషాలకో మృత్యువు
యెమెన్‌లో రెండేళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి బాల్యం బలవుతోంది.
సనా: యెమెన్‌లో రెండేళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి బాల్యం బలవుతోంది. పిల్లల ఎండిన డొక్కల్లో పేగులు ఆకలిదప్పులతో నకనకలాడుతున్నాయి. జీవచ్ఛవమవుతున్న బాల్యాన్ని మృత్యువు ఎప్పటికప్పుడు మింగేస్తుంది. ప్రస్తుతం యెమెన్‌లో 22 లక్షల మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారని యునిసెఫ్ ఓ నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. వారిలో నాలుగున్నర లక్షల మంది పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉందని పేర్కొంది.
సౌదీ మద్దతిస్తున్న ప్రభుత్వ దళాలకు, షియా తిరుగుబాటుదారుల మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధం వల్ల దేశం వైద్యరంగం కూడా పూర్తిగా కుప్పకూలిపోయింది. షియా తిరుగుబాటుదారుల ప్రాబల్యం ఎక్కువగావున్న సాదా ప్రావిన్స్‌లో ప్రతి పదిమంది పిల్లల్లో ఎనిమిది మంది పిల్లలు ఆహారం నోచుకోక అల్లాడిపోతున్నారు. ప్రపంచంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా యెమెన్ పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. అతిసారం, శ్వాస సంబంధిత సమస్యలతో పది నిమిషాలకు ఒక పిల్లా లేదా పిల్లాడు మరణిస్తున్నాడని పేర్కొంది.
ఈ ఏడాది యెమెన్‌లోని రెండు లక్షల మంది పిల్లలకు మాత్రమే తాము విటమిన్ సప్లిమెంట్లు, పౌష్టికాహారాన్ని అందజేయగలిగామాని యునిసెఫ్ అధికారి మెరిటెక్సెల్ రెలానో తెలిపారు. నిధుల కొరత యుద్ధ ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకపోవడం వల్ల ఇంతమందికన్నా ఎక్కువ మంది పిల్లలకు తాము సరఫరాలు అందించలేకపోయామని రెలానో ఆందోళన వ్యక్తం చేశారు. దయచేసి పిల్లలను ఆదుకునేందుకు తమకు సహకరించాలని యుద్ధం చేస్తున్న ఇరు వర్గాలకు విజ్ఞప్తి చేశారు.