
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోని దాదాపు 100 కోట్ల మంది పిల్లలు వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం మూలంగా తీవ్ర ప్రభావానికి గురయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 220 కోట్ల మంది పిల్లలు వాతావరణ మార్పులకు సంబంధించిన ఏదో ఒక ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా భారత్, నైజీరియా, ఫిలిప్పీన్స్ సహా 33 దేశాల పిల్లలు వేడిగాలులు, వరదలు, తుఫానులు, వ్యా«ధుల సంక్రమణ, కరువు, వాయు కాలుష్యంవంటి మూడు నుంచి నాలుగు వాతావరణ ప్రభావాలను ఒకేసారి ఎదుర్కొంటున్నారని యూనిసెఫ్ తెలిపింది. తాజాగా విడుదల చేసిన తొలి వాతావరణ ప్రమాద సూచిక (సీసీఆర్‌ఐ) నివేదికలో పేర్కొంది. సీసీఆర్‌ఐ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ దేశాల్లో 8.7 పాయింట్లతో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మొదటి స్థానంలో ఉంది. 7.7 పాయింట్లతో పాకిస్తాన్ 14వ స్థానంలో ఉండగా, 7.6 పాయింట్లతో అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లు 15వ స్థానంలో ఉన్నాయి. కాగా 7.4 పాయింట్లతో భారత్ 26వ స్థానంలో ఉంది. 6.7 పాయింట్లతో చైనా 40వ స్థానంలో, 5.4 పాయింట్లతో శ్రీలంక 61వ స్థానంలో, 5 పాయింట్లతో అమెరికా 80వ స్థానంలో ఉన్నాయి.
92 కోట్ల మంది పిల్లలకు తాగునీటి కొరత
వాతావరణ మార్పు, కాలుష్యం, పేదరికం, పిల్లలకు పరిశుభ్రమైన నీటి లభ్యత, ఆరోగ్యం, విద్యా సదుపాయాల లభ్యతవంటి అంశాలను పరిగణలోకి తీసుకొని యూనిసెఫ్ ఈ నివేదికను తయారుచేసింది. కాగా ఈ అంశాలపై గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ ప్రభావాల కారణంగా 33 దేశాల్లోని పిల్లల ఆరోగ్యం, విద్య, భద్రతకు సంబంధించిన పరిస్థితి భయంకరంగా ఉందని యూనిసెఫ్ అభివర్ణించింది. కాగా పిల్లల వాతావరణ ప్రమాద సూచిక (సీసీఆర్‌ఐ) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది పిల్లలు వాయు కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అంతేగాక 92 కోట్ల మంది పిల్లలు తాగునీటి కొరతతో బాధపడుతున్నారని, 82 కోట్ల మంది వేడిగాలులు, 60 కోట్ల మంది చిన్నారులు మలేరియా, డెంగ్యూ జ్వరం వంటి సంక్రమించే వ్యాధుల ప్రభావానికి గురవుతున్నారు. 24 కోట్ల మంది పిల్లలు తీరప్రాంత వరదలకు, 33 కోట్లమంది పిల్లలు నదీ ప్రవాహానికి, 40 కోట్లమంది పిల్లలు తుఫానులకు, 81.5 కోట్ల పిల్లలు లెడ్ (సీసం) కాలుష్య ప్రభావాలకు లోనవుతున్నారని నివేదిక తెలిపింది. సుమారు 100 కోట్ల మంది చిన్నారులు అత్యధిక స్థాయిలో ఉన్న వాయుకాలుష్య ప్రభావానికి గురవుతున్నారు.
4.09 లక్షల మలేరియా మరణాలు
వాతావరణపరంగా అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్న దేశాల్లో క్లీన్ ఎనర్జీపై పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి కోసం ప్రపంచవ్యాప్త వనరుల ద్వారా కేవలం 980 కోట్ల అమెరికన్ డాలర్లు అందాయని యూనిసెఫ్ పేర్కొంది. సురక్షిత తాగునీరు, పరిశుభ్రత వంటి అంశాలపై పెట్టుబడులను పెంచడం వల్ల కనీసం 41.5 కోట్ల మంది చిన్నారులను రక్షించే అవకాశం ఉంటుందని నివేదికలో తెలిపారు. అంతేగాక 2019లో ప్రపంచవ్యాప్తంగా 22.9 కోట్ల మలేరియా కేసులు నమోదుకాగా, సుమారు 4.09 లక్షల మరణాలు సంభవించాయి.
10 దేశాల నుంచి 70% కర్బన ఉద్గారాలు
కర్బన ఉద్గారాలు ఎక్కువగా ఉత్పన్నమౌతున్న దేశాల్లోని చిన్నారుల పరిస్థితులకు, వాతావరణంలోని అత్యంత తీవ్రమైన ప్రభావాలను ఎదుర్కొంటున్న దేశాల్లో పిల్లల పరిస్థితికి ఏ మాత్రం సంబంధంలేదని ఈ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని గ్రీన్‌హౌజ్ ఉద్గారాల్లో కేవలం 9 శాతం ఉద్గారాలు వాతావరణ ప్రభావానికి గురైన 33 అత్యంత ప్రమాదకర దేశాల్లో విడుదలవుతున్నాయి. కాగా ప్రపంచ ఉద్గారాలలో దాదాపు 70 శాతం కేవలం 10 దేశాల నుంచి విడుదలవుతున్నాయి. టాప్ 10 దేశాల్లో భారత్ మాత్రమే సీసీఆర్‌ఐ జాబితాలో అత్యంత ప్రమాదకర స్థానంలో ఉంది. టాప్ 10 దేశాల్లో 30.30%తో చైనా, 14.63%తో అమెరికా, 7.15%తో భారత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తక్షణమే చర్యలు తీసుకోని పక్షంలో ఎక్కువగా పిల్లలపై ప్రభావం ఉంటుందని యూనిసెఫ్ హెచ్చరించింది.
81.5 కోట్ల మంది పిల్లల్లో సీసం కాలుష్యం ప్రభావం
ఇతర విషపూరితమైన ప్రమాదాలలో సీసం కాలుష్యం ఎక్కువగా నమోదవుతోంది. ఇది తరచుగా నేల, నీటిలో కనిపిస్తుంది. ప్రపం చవ్యాప్తంగా దాదాపు 81.5 కోట్ల మంది పిల్లల్లో ఒక డెసి లీటర్‌కు 5 మైక్రోగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ స్థాయి సీసం రక్తంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కారణంగా పిల్లల్లో ఐక్యూ స్థాయి తగ్గడంతో పాటు వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం ఉంటుందని యూనిసెఫ్ సీసీఆర్‌ఐ నివేదికలో పేర్కొంది. అంతేగాక సీసం కాలు ష్యం ప్రభావం కేవలం పిల్లలకు మాత్రమే పరిమితం కాకుండా, దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది 9 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవిస్తున్నాయని తెలి పింది.
Comments
Please login to add a commentAdd a comment