ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో అధికార పార్టీ నాయకులు బజారున పడ్డారు. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు మంత్రి సత్యవతి రాథోడ్, సీఎం కేసిఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత సమక్షంలోనే బహిర్గతమయ్యాయి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ భవనం ప్రారంబోత్సవానికి హాజరైన మంత్రి సత్యవతి, ఎమ్మెల్సీ కవిత సమక్షంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి బలప్రదర్శనకు దిగారు.
రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేను తానేనని చాటిచెప్పేందుకు ఇదదరూ తీవ్రంగా ప్రయత్నించారు. అనుచరగణాన్ని రెచ్చగొట్టి వారిమధ్య ఉన్న వైరాన్ని బహిర్గతం చేసుకున్నారు. పార్టీ శ్రేణులను ఆయోమయానికి గురిచేశారు.
ఎవరి గోల వారిదే
బిఆర్ఎస్‌కు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ భవన శిలాఫలకం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసింది. శిలాఫలకంపై ఎమ్మెల్సీ మదుసూధనాచారి, జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణి పేరు లేకపోవడంతో వారిద్దరి అనుచరులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్సీ చారికి, జడ్పీ చైర్మన్ శ్రీహర్షిణికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానపరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
తామేమి తక్కువ కాదన్నట్లు గండ్ర అనుచరులు సైతం నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంత ఇరువర్గాల నినాదాలు, గోలతో కార్మికసంఘ భవనం వర్గపోరుకు వేదికలా మారిపోయింది. వేదికపై ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్, కేసిఆర్ తనయ కవిత అవాక్కయ్యారు. ఘర్షణ పడుతున్నవారిని వారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
నివురు గప్పిన నిప్పు
వాస్తవానికి భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి రాజకీయ ప్రత్యర్థులు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గండ్ర అధికార పార్టీ అభ్యర్థి మధుసూదనాచారిపై ఘన విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు చేయిచ్చి కేసిఆర్ సమక్షంలో కారెక్కారు గండ్ర వెంకటరమణారెడ్డి.
రాజకీయ ప్రత్యర్థులిద్దరూ ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నప్పటికీ అంతర్గత విబేధాలు మాత్రం అలానే ఉన్నాయి. గులాబీ దళపతి ఎవ్వరిని తక్కువ చేయకుండా ఓడిపోయిన మధుసూదనాచారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తగిన ప్రాధాన్యత కల్పించారు. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలో బయటపడడం పార్టీలో కలకలం సృష్టించింది. వీరి గొడవ పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేసింది.
కారులో అసంతృప్తి
ఎమ్మెల్యే గండ్ర మీద జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణి సైతం అసంతృప్తితో రగిలిపోతున్నారు. తనను భూపాలపల్లికి చెందిన పార్టీ నేతలు, అధికారులు పట్టించుకోవడంలేదని ఆమె బాహాటంగానే విమర్శలు చేశారు. భూపాలపల్లికి జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణి అయితే వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతికి భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చి స్థానికులకు ప్రాధాన్యత లేకుండా చేశారనే ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని నియోజకవర్గ ఇంఛార్జీ పుట్ట మధు అనుచరురాలుగా ముద్రపడ్డ శ్రీహర్షిణికి భూపాలపల్లిలో తగిన ప్రాధాన్యత లభించడం లేదనే చర్చ సాగుతోంది.
భూపాలపల్లి బీఆర్ఎస్‌లో విబేధాలకు రాబోయే ఎన్నికలే కారణంగా జనం భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గండ్ర బిఆర్ఎస్ నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమవుతుండగా ఎమ్మెల్సీ చారి సైతం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. అందులో భాగంగానే ఒకరిపై మరొకరిపై చేయి సాధించేందుకు పోరు సాగిస్తున్నారట. ఇప్పటికే సిట్టింగ్‌లకే టిక్కెట్ ఇస్తామని గులాబీ దళపతి ప్రకటించడంతో ఎమ్మెల్యే పై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకుని టిక్కెట్ పొందే పనిలో చారి ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
గండ్ర వెంకటరమణారెడ్డి సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ తన కుటుంబం నుంచి భూపాలపల్లి చేజారిపోకుండా అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ తనకు టిక్కెట్ ఇవ్వకపోతే...తన భార్య గండ్ర జ్యోతిని బరిలో నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment