విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. విశాఖ నుంచి గ్రామం వరకు నిరసనలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరాహార దీక్షలు, బంద్‌లతో జిల్లా హోరెత్తిపోతోంది. సోమవారం అర్ధరాత్రి నుంచి మరింత ఉధృతం కానుంది. ఉద్యోగుల సమ్మె బాటతో జిల్లాలో పాలన పూర్తిగా స్తం భించనుంది. అన్ని కార్యాలయాల్లో పౌర సేవలు నిలిచిపోనున్నాయి.
రాష్ట్ర విభజనపై యూపీఏ ప్ర భుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల 11 రోజులుగా జిల్లాలో తీవ్ర స్థాయిలో ఉద్యమాలు సాగుతున్నాయి. ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకున్న సమైక్యాం ధ్ర ఆందోళనకు అన్ని ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. వారం రోజులుగా విభిన్న రీతిలో తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం విభజన నిర్ణయాన్ని వెన క్కు తీసుకోకపోవడంతో ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతానికి నిర్ణయించాయి. పాలన స్తంభింప చేయడం ద్వారా యూపీఏ మెడలు వంచాలన్న భావనకు వచ్చాయి. అన్ని ఉద్యోగ సంఘాలు సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సమ్మెబాట పడుతున్నాయి.
ప్రధానంగా జిల్లాలో ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండడంతో పాటు, అత్యధికం గా పౌర సేవలు అందించే ఏపీఎన్‌జీవోలు, రెవె న్యూ, పంచాయతీ ఉద్యోగులు సమ్మెకు దిగుతుండడంతో పాలనపై తీవ్ర ప్రభావం పడనుంది. గ్రామా టల్లో పనిచేసే వీఆర్వోల నుంచి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లతో పాటు తహశీల్దార్లు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ మూడు విభాగాల నుంచి సుమారుగా 25 వేల మంది ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. దీంతో జిల్లాలో ఉన్న 43 తాలూకాఫీసులతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. గ్రామాల్లో మండల కార్యాలయాల్లో పౌర సేవలు స్తంభించనున్నాయి. కలెక్టరేట్‌లో కూడా డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ మినహా మిగిలిన అధికారులు, సిబ్బంది విధులకు హాజరుకారు.
ఇబ్బందులు తప్పవు : సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులందరూ సమ్మె బాట పడుతుండడంతో ఇబ్బందులు తప్పవు. ఏ ప్రభుత్వ కార్యాలయంలోను ఎటువంటి పనులు జరగవు. గ్రామాల్లో పారిశుద్ధ్యం నుంచి రెవెన్యూ భూముల వ్యవహారాల వరకు అన్ని పనులు స్తంభించనున్నాయి. ఫలితంగా ప్రజలు అవస్థలు పడే అవకాశాలు ఉన్నాయి.
ప్రజల సంపూర్ణ మద్దతు
సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారింది. రాష్ట్ర విభజన వల్ల భవిష్యత్ తరాలకు నష్టం జరుగుతుంది. అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలనే సమ్మె చేస్తున్నాం. దీనికి ప్రజల సహకారం పూర్తిగా ఉంది.
- ఎస్.నాగేశ్వరరెడ్డి, ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు
విభజన వల్ల అందరికీ నష్టం
రాష్ట్ర విభజన వల్ల ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఆ విషయం జిల్లా ప్రజలకు పూర్తిగా అర్ధమైంది. అందుకే నగరంలోనే కాకుండా గ్రామాల్లో కూడా సమైక్యాంధ్ర ఉద్యమం పెల్లుబుకుతోంది.
- కె.ఈశ్వరరావు, ఏపీఎన్‌జీఓస్ జిల్లా అధ్యక్షుడు
సకలం బంద్
Published Mon, Aug 12 2013 1:33 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
Advertisement
Advertisement