సాక్షి, ముంబై: ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) చేపడుతున్న మెట్రో, మోనోరైల్వే ప్రాజెక్టులు నగర పాలక సంస్థ (బీఎంసీ)కి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇరు సంస్థల మధ్య సమన్వయం లేకపోవడంతో బీఎంసీకి నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం మెట్రో, మోనో రైల్వే ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగడంతో వంతెన, పిల్లర్ల పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ప్లాట్‌ఫారాలు, ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు మెట్లు, ఇతర నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ పనులు ప్రారంభించే ముందు ఎమ్మెమ్మార్డీయే అధికారులు బీఎంసీతో సంప్రదించకుండానే తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో భూగర్భంలో ఉన్న నీటి పైపులు, మురుగునీరు, మరుగుదొడ్ల పైపులేన్లు దెబ్బతింటున్నాయి. పలు చోట్ల అవి ధ్వంసమవడంతో నీళ్లు సాఫీగా వెళ్లలేకపోతున్నాయి.
ఫలితంగా మ్యాన్‌హోల్స్ నుంచి బయటకు వచ్చిన మురుగునీరు నగర రహదారులపై పారుతున్నాయి. మెట్లు నిర్మించేందుకు ఫుట్‌పాత్‌లను వెడల్పు చేస్తుండడంతో రహదారులు కొంతమేర ఇరుగ్గా మారాయి. ఇప్పటికే పనులు జరుగుతున్న చోట విపరీతమైన ట్రాఫిక్‌జామ్ ఉంటోంది. దీనికి తోడు రోడ్లు ఇరుకుగా మారడం, వాటిపై నీళ్లు ప్రవహించడంతో సమస్య మరింత జటిలంగా మారింది. వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. ఏటా వర్షాకాలానికి ముందు నాలాలు, మురుగుకాల్వలు శుభ్రం చేస్తున్నప్పటికీ, రహదారులన్నీ జలమయమవుతున్నాయి. దీనికి తోడు భూగర్భంలో పగిలిపోయిన పైపుల వల్ల... వచ్చే వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత అధ్వానంగా మారే ప్రమాదముందని స్థానికులు చెబుతున్నారు. వాటికి మరమ్మతులు చేపట్టాలంటే బీఎంసీ ఖజానాపై అదనపు భారం పడనుంది.
ఎమ్మెమ్మార్డీయేతో బీఎంసీకి చిక్కులు
Published Tue, Dec 31 2013 11:42 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement