సాక్షి, ముంబై: తరచూ వాయిదాపడుతూ వస్తున్న ‘వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్’ మెట్రోరైలు ఈ ఏడాది డిసెంబరులో కచ్చితంగా పరుగులు తీస్తుందని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) భరోసా ఇచ్చింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎప్పడైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్) అమలు చేసేందుకు అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పనులను మరింత వేగవంతం చేయాలని ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ ముంబై మెట్రో-వన్ (రిలయన్స్ ఇన్‌ఫ్రా) కంపెనీని ఎమ్మెమ్మార్డీయే హెచ్చరించింది. కనీసం డిసెంబరు ఆఖరు వరకు మెట్రోరైళ్లను పరుగులు తీయించాలనే ధృడసంకల్పంతో ఈ సంస్థ ఉంది. దీనిపై చర్చించేందుకు బుధవారం పలువురు ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.
మెట్రోరైలు డిసెంబరు నుంచి కచ్చితంగా పరుగులు తీస్తుందని సమావేశం అనంతరం ఎమ్మెమ్మార్డీయే కమిషనర్ యు.పి.ఎస్.మదన్ స్పష్టం చేశారు. మెట్రోరైలు ప్రాజెక్టుపై ఇప్పటికే అధికారులు అనేక డెడ్‌లైన్లు విధించిన విషయం తెలిసిందే. అయితే ఏ ఒక్క డెడ్‌లైన్‌నూ రిలయన్స్ పాటించలేకపోయింది. అనుకున్న విధంగా పనులు పూర్తికాకపోవడంతో మెట్రోరైలు ప్రారంభం తరచూ వాయిదా పడుతుండడం తెలిసిందే. మోనో రైలు ప్రాజెక్టు పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. అసలు ఈ మెట్రో, మోనో రైళ్లు పరుగెత్తుతాయా..? అనే సందిగ్ధంలో ముంబైకర్లు పడిపోయారని బాంద్రావాసి ఒకరు అన్నారు. ఈ నేపథ్యంలో రెండు కీలక ప్రాజెక్టుల్లో ఒకటి డిసెంబరులోపే అందుబాటులోకి వస్తుందని ఎమ్మెమ్మార్డీయే కమిషనర్ మదన్ స్పష్టంగా ప్రకటించారు.
మోనోరైలు కూడా లేటే
మోనోరైలు ప్రాజెక్టు పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. అనుమతులు రాకపోవడం, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. నిర్వాసితులకు కూడా పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించకపోవడంతో సమస్యలు ఎదరవుతున్నాయి. ఇదిలా ఉంటే డెడ్‌లైన్లు పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎల్ అండ్ టీ కాంట్రాక్టు కంపెనీకి ఎమ్మెమ్మార్డీయే ఇటీవల రూ.25 వేలు జరిమానా విధించింది. అంతటితో ఊరుకోకుండా షోకాజ్ నోటీసు జారీచేసింది. చెంబూర్-వడాలా-సాత్‌రాస్తా మోనోరైలు ప్రాజెక్టు పనులు నగరంలో అక్కడక్కడ జరుగుతున్నాయి. అందులో భాగంగా జూలైలో బోయివాడ ప్రాంతంలో రెండు క్రేన్ల ద్వారా మోనో రైలు పిల్లర్లపై ఓ భారీ దిమ్మెను అమరుస్తుండగా అది అదుపుత ప్పి నేలపై పడిన విషయం తెలిసిందే. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఆ భారీ దిమ్మె క్రేన్‌పై పడడంతో అది పాక్షికంగా దెబ్బతింది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని హెచ్చరిస్తూ ఎల్ అండ్ టీకి జరిమానా, షోకాజ్ నోటీసు జారీచేసినట్లు ఎమ్మెమ్మార్డీయే సీనియర్ అధికారి ఒకరు వివరించారు.
డిసెంబర్‌లో ‘మెట్రో’ పరుగులు
Published Sat, Sep 14 2013 12:09 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement