- సిఫార్సు చేసిన సలహా కమిటీ
- చార్జీల పెంపునకు జాప్యమే కారణమని వివరణ
సాక్షి, ముంబై: పెంచిన మెట్రో చార్జీలను తగ్గించాలని చార్జీలు నిర్ణయించేందుకు కేంద్రం నియమించిన సలహా కమిటీ సిఫార్సు చేసింది. చార్జీలు పెంచడానికి మెట్రో నిర్మాణ వ్యయం కారణం కాదని, నిర్మాణంలో జాప్యమే కారణమని తేల్చి చెప్పింది. వర్సోవా-అంధేరి-ఘట్కోపర్ మెట్రో రైలు చార్జీలు నిర్ణయించేందుకు కేంద్రం సలహా కమిటీని నియమించిన సంగతి తెలిసింది. మెట్రో నిర్మాణానికి సంబంధించి ఎమ్మెమ్మార్డీయే, రిలయన్స్ ఇన్‌ఫ్రా మధ్య 2007లో ఒప్పందం కుదిరింది.
అయితే పనులు మాత్రం 2008లో ప్రారంభమయ్యాయి. దీంతో మొదట్లో అనుకున్న వ్యయం రూ. 2,356 కోట్లు జాప్యం కారణంగా రూ. 4,329 కోట్లకు చేరుకుంది. పెరిగిన వ్యయాన్ని రాబట్టుకోడానికి చార్జీలు పెంచాలనే ప్రతిపాదనను ఎమ్మెమ్మార్డీయే తెరమీదకు తెచ్చింది. ఆ ప్రకారం రూ.9, 11, 13 ఉన్న చార్జీలను పెంచి రూ.10, 20, 30, 40 అమలు చేసింది. ఇష్టానుసారంగా మెట్రో చార్జీలు పెంచడంతో అన్ని రంగాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో చార్జీలు ఎంతమేర ఉండాలనే విషయంపై కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది.
అయితే కమిటీ నియామకంపై తీవ్ర జాప్యం చేసిన కేంద్రం చివరకు రెండు నెలల కిందట ఏర్పాటు చేసింది. మెట్రో నిర్మాణంపై అధ్యయనం చేపట్టిన కమిటీ అందులోని లొసుగులు, వాస్తవాలను వెలికి తీసింది. ముంబైకర్లపై చార్జీల భారం మోపడానికి వ్యయం పెరగడం కారణం కాదని చెప్పింది. పెంచిన చార్జీలు ఉపసంహరించుకోవాలని సిఫార్సు చేసింది.
మెట్రో చార్జీలు తగ్గించాలి
Published Mon, May 4 2015 10:54 PM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM
Advertisement
Advertisement