భద్రత ఖర్చు తడిసి మోపెడు!
భారంగా మారుతోందంటున్న ఎమ్మెమ్మార్డీఏ
సాక్షి, ముంబై: నగరంలో సేవలు అందిస్తున్న మోనోతో పోలిస్తే ప్రయాణికుల భద్రత కోసం మెట్రో భారీగానే ఖర్చు చేస్తోంది. కేవలం భద్రత కోసం చేస్తున్న ఖర్చే నెలకు రూ. 2 కోట్ల వరకు ఉంటుందని మెట్రో అధికారులు అంచనా వేశారు. ఈ విషయమై ఎమ్మెమ్మార్డీఏ డెరైక్టర్ దిలీప్ కవట్కర్ మాట్లాడుతూ... ‘మెట్రో రైళ్ల వల్ల నెలకు వచ్చే ఆదాయంలో దాదాపు 25-50 శాతం భద్రతకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం దేశీయ, విదేశీ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ. 4,321 కోట్లు రుణాలు, ఈ మొత్తానికి వడ్డీ ఎమ్మెమ్మార్డీయే ఎలా చెల్లిస్తుందో తెలియడంలేదు. మెట్రో ప్రయాణికుల భద్రతకు వెచ్చిస్తున్న వ్యయం నెలకు రూ. రెండు కోట్ల వరకు అవుతుందని అంచనా వేశారు. వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీ మెట్రోరైలు మార్గంలో మొత్తం 11 స్టేషన్లు ఉన్నాయి.
స్టేషన్ పరిసరాల్లో, ప్లాట్‌ఫారాలపై, బోగీలలో 700 సీసీ కెమెరాలు, స్టేషన్‌లోకి ప్రవేశించగానే ప్రయాణికులను తనిఖీ చేసే సిబ్బంది, వారివద్ద హ్యాండ్ మెటల్ డిటెక్టర్లు, డోరు మెటల్ డిటెక్టర్లు, ప్రతీ స్టేషన్‌లో ఆరు డాగ్ స్కాడ్‌ల చొప్పున మొత్తం 72 డాగ్ స్కాడ్‌లు, 730 మంది వివిధ రకాల భద్రత దళాలు, సాయుధ పోలీసులు... ఇలా భారీ భద్రతకు ఎమ్మెమ్మార్డీయే నెలకు దాదాపు రూ. రెండు కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. అయితే మోనో, మెట్రో భద్రత బాధ్యతలు ‘మహారాష్ట్ర స్టేట్ సెక్యూరిటీ కార్పొరేషన్’ (ఎమ్మెస్సెసీ) కి అప్పగించింది. దీంతో మోనోతో పోలిస్తే మెట్రోకు భద్రత ఖర్చే తడిసి మోపెడవుతోంది. మోనో రైల్వే పరిధిలో 550 మంది భద్రతా సిబ్బంది, 500పైగా సీసీ కెమెరాలు ఉన్నాయి. అందుకు నెలకు సుమారు కోటి రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇలా మెట్రో, మోనోతో కలిపి ప్రతినెలా రూ.మూడు కోట్లు కేవలం భద్రత కోసం ఎమ్మెమ్మార్డీయే ఎమ్మెస్సెసీకి చెల్లించాల్సి ఉంటుంది.nn