‘మూడో’ మెట్రో ముమ్మరం
Published Fri, Aug 9 2013 11:24 PM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM
సాక్షి, ముంబై: మూడోదశ మెట్రోరైలు నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. ఈ ఏడాది చివరిలోగా టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి వచ్చే ఏడాది జనవరిలో ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) యోచిస్తోంది. కొలాబా నుంచి సీప్జ్ వరకు సుమారు 34 కిలోమీటర్ల మేర మెట్రో-3 ప్రాజెక్టు పనులు చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన నిధులను రుణంగా తీసుకునేందుకు రా్రష్ట్ర ప్రభుత్వం జపాన్ సహకార బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చోవడం తెలిసిందే. దీంతో టెండర్లు ఆహ్వానించేందుకు మార్గం సుగమమయిందని అధికారులు భావిస్తున్నారు. శివ్డీ-నవశేవా ముంబై ట్రాన్స్‌హార్బర్ లింకు ప్రాజెక్టు కోసం ఇటీవల టెండర్లు ఆహ్వానించినా ఏ ఒక్క కంపెనీ కూడా స్పందించకపోవడం తెలిసిందే. దీంతో ఆ ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతానికి దీనిని పక్కనబెట్టి, మెట్రో-3 ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇవ్వాలని అథారిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సొరంగమార్గం, స్టేషన్లు, రైల్వేట్రాక్స్, సిగ్నల్ పరికరాలు, రైళ్ల కొనుగోలుకు మొత్తం 23 రకాల టెండర్లను ఆహ్వానించనున్నారు. ఒకేసారి ఏడు వేర్వేరు చోట్ల పనులు ప్రారంభించనున్నారు.
చార్‌కోప్ ప్రాంతంలో కేంద్ర ప్రజాపనులశాఖ స్థలాన్ని కాస్టింగ్ యార్డ్ కోసం తాత్కాలికంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రభుత్వసాయంతో ప్రయత్నాలు చేస్తున్నామని ఎమ్మెమ్మార్డీయే సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇదిలా ఉండగా జపాన్ బ్యాంకులు ఈ ప్రాజెక్టు కోసం నాలుగుశాతం వడ్డీకి రుణాలు అందజేసేందుకు అంగీకరించాయి. అందుకు సంబంధించిన ఒప్పందపత్రాలు ప్రస్తుతం కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ వద్ద ఉన్నాయి. త్వరలోనే వాటికి ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాతే టెండర్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు. మెట్రో-3 ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు అనేక విదేశీ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. గోరేగావ్, కఫ్ పరేడ్ ప్రాంతాల్లో స్థల సేకరణ పూర్తికావడంతో 2014 జనవరిలో ఇక్కడ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మిగతా చోట్ల స్థల సేకరణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు వారు వివరించారు.
Advertisement
Advertisement