నత్తకు నడక నేర్పిస్తున్న ఎస్‌సీఎల్‌ఆర్..
సాక్షి, ముంబై: పశ్చిమ శివారు, సెంట్రల్ శివారు ప్రాంతాలను కలిపేందుకు పదేళ్ల కిందట ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శాంతాక్రజ్-చెంబూర్ లింకు రోడ్ (ఎస్‌సీఎల్‌ఆర్) ప్రాజెక్టు పనులు వాయిదాలకే పరిమితమవుతున్నాయి. తరచూ డెడ్‌లైన్‌లు వాయిదా పడుతుండడంతో ఇంతకీ ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ఇచ్చిన డెడ్‌లైన్ మరోసారి వాయిదా పడింది. ఈ పనులు 2014 మార్చిలో పూర్తయ్యే అవకాశాలున్నాయని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే), మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎమ్మెస్సార్డీసీ) ప్రకటించాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు ఎమ్మెమ్మార్డీయే, ఎమ్మెస్సార్డీసీ సంస్థలు సంయుక్తంగా చేపడుతున్నాయి.
జాప్యంపై విమర్శలు..
ఈ వంతెన పనులు ప్రారంభించి పదేళ్లు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఇంకా పూర్తికాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యధిక సమయం తీసుకున్న వంతెనలో దీనికి మొదటి స్థానం లభించింది. ఇప్పటికీ 11 సార్లు డెడ్‌లైన్ వాయిదా పడింది. రుణాలు అందజేసిన ప్రపంచ బ్యాంకుల నుంచి అవమానాలు తప్పలేదు. ముంబైలో ఉగ్రరూపం దాలుస్తున్న ట్రాఫిక్ జాం సమస్యను పరిష్కరించడంతోపాటు పశ్చిమ శివారు, సెంట్రల్ (మధ్య) శివారు ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరం చేసేందుకు ఎమ్మెమ్మార్డీయే 2003లో ఎస్‌సీఎల్‌ఆర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించింది.
ఈ ప్రాజెక్టు ఎమ్మెమ్మార్డీయేకు చెందినదే అయినప్పటికీ నిర్మాణ పనులు ఎమ్మెస్సార్డీసీ ద్వారా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టిన నాటి నుంచి అనేక అడ్డంకులు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, పునరావాసం, స్థానిక నాయకుల అభ్యంతరం ఇలా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీన్ని బట్టి ఎలాంటి ముందస్తు ప్రణాళికలు, అధ్యయనం పనులు చేపట్టకుండానే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించినట్లు స్పష్టమవుతోంది. కాని ప్రాజెక్టు బాధితులకు పునరావాసం, స్థలసేకరణ, భూగర్భంలో ఉన్న నీటి పైపులు, టెలిఫోన్, విద్యుత్ కేబుళ్ల స్థల మార్పిడి, ఇతర సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో జాప్యం వల్ల ప్రాజెక్టు పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. వాయిదాల ప్రాజెక్టుగా పేరు రావడంతో ఇప్పటికే రుణాలు ఇచ్చిన వివిధ బ్యాంకులు మళ్లీ రుణం ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నాయి. అలాగే ఎమ్మెమ్మార్డీయే పనితీరు కూడా విమర్శలకు గురవుతోంది. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని బ్యాంకులు ఎమ్మెమ్మార్డీయేను ఆదేశించినా ఉపయోగం లేదు.
ఆ సంస్థ పనితీరు మార లేదు. తీవ్ర విమర్శలు ఎదురవుతున్నా పనులు శీఘ్రగతిన పూర్తిచేసేందుకు యత్నించడంలేదు. ఇటీవల జారీచేసిన డెడ్‌లైన్ ప్రకారం డిసెంబర్ ఆఖరు వరకు ఈ ప్రాజెక్టు పనులు పూర్తికావాల్సి ఉంది. కాని తిరిగి 2014 మార్చికి వాయిదా వేశారు. పదేళ్ల కిందట ఈ ప్రాజెక్టు వ్యయం రూ.116 కోట్లు కాగా ఇప్పుడది ఏకంగా రూ.500 కోట్లకు చేరుకోవడంతో ఎమ్మెమ్మార్డీయేపై అదనపు భారం పడుతోంది.