
Photo Courtesy: BCCI
ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (ఏప్రిల్ 2) జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు. బ్రావో 158 ఇన్నింగ్స్‌ల్లో 183 వికెట్లు తీయగా.. ఈ మార్కు తాకడానికి భువీకి 178 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది.
చహల్ 161 ఇన్నింగ్స్‌ల్లో 206 వికెట్లు తీశాడు. చహల్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ఘనత పియూశ్ చావ్లాకు దక్కుతుంది. చావ్లా 191 ఇన్నింగ్స్‌ల్లో 912 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చహల్ , చావ్లా తర్వాత భువీ, బ్రావో ఉన్నారు. వీరిద్దరితో సమానంగా అశ్విన్ కూడా 183 వికెట్లు తన ఖాతాలో కలిగి ఉన్నాడు. యాష్‌కు 183 వికెట్ల మార్కును తాకడానికి 211 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.
కాగా, నిన్న సొంత మైదానంలో (చిన్నస్వామి స్టేడియం) గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ సీజన్‌లో ఆ జట్టుకు ఇదే తొలి ఓటమి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఆదిలోనే వికెట్లు కోల్పోయి నామమాత్రపు స్కోర్‌కు (169/8) పరిమితమైంది. లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) పోరాడటంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీసి ఆర్సీబీకి దెబ్బకొట్టాడు. సిరాజ్ తన మాజీ జట్టుపై మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. సిరాజ్‌తో పాటు సాయికిషోర్ (2), అర్షద్ ఖాన్ (1), ప్రసిద్ద్ కృష్ణ (1), ఇషాంత్ శర్మ (1) కూడా వికెట్లు తీశారు. సిరాజ్ తన కోటా 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) నిలకడగా ఆడి గుజరాత్‌ను గెలిపించారు. ఆఖర్లో బట్లర్, రూథర్‌ఫోర్డ్ బ్యాట్‌ను ఝులిపించారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.
ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌కు ముందు టాప్ ప్లేస్‌లో ఉండిన ఆర్సీబీ మూడో స్థానానికి పడిపోయింది.