
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (ఏప్రిల్ 2) జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా (బౌండరీని ఆపే క్రమంలో) విరాట్ చేతి బొటన వేలికి గాయమైంది. నొప్పితో విరాట్ విలవిలలాడిపోయాడు. విరాట్ ఇలా గాయపడటం చాలా అరుదుగా జరుగుతుంది. నొప్పి భరించలేక విరాట్ నేలకొరగడంతో చిన్నస్వామి స్టేడియం మొత్తం నిశ్శబ్దం ఆవహించింది. ఫిజియో ఫస్ట్ ఎయిడ్ చేయడంతో విరాట్ కొద్ది సేపటికే రికవర్ అయినట్లు కనిపించాడు.
అయినా విరాట్ అభిమానుల్లో ఆందోళన అలాగే ఉండింది. గాయం తర్వాత విరాట్‌లో ముందున్నంత యాక్టివ్‌నెస్ కనిపించలేదు. దీంతో అభిమానులు విరాట్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. విరాట్ గాయంపై ఆర్సీబీ ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ సానుకూల అప్‌డేట్ ఇవ్వడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. విరాట్ గాయం చిన్నదేనని ఫ్లవర్ ప్రకటించాడు. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 7న ముంబైని వాంఖడే మైదానంలో జరుగనుంది.
కాగా, నిన్నటి మ్యాచ్‌లో విరాట్ ఘోరంగా విఫలమయ్యాడు. 6 బంతుల్లో బౌండరీ సాయంతో 7 పరుగులు మాత్రమే చేసి అనామక అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. విరాట్ వికెట్ పడిన తర్వాత ఆర్సీబీ టాపార్డర్ అంతా పెవిలియన్‌కు క్యూ కట్టింది. పడిక్కల్ (4), సాల్ట్ (14), పాటిదార్ (12) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు.
ఈ దశలో జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్), లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో ఆర్సీబీ ఓ మోస్తరు స్కోర్ (169/8) చేయగలిగింది.
గుజరాత్ బౌలర్లలో సిరాజ్ అద్బుతంగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనకు గానూ అతడికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సాయి కిషోర్ (4-0-22-2), అర్షద్ ఖాన్ (2-0-17-1), ప్రసిద్ద్ కృష్ణ (4-0-26-1), ఇషాంత్ శర్మ (2-0-27-1) కూడా తలో చేయి వేసి ఆర్సీబీని కట్టడి చేశారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) నిలకడగా ఆడి గుజరాత్‌ను గెలిపించారు. ఆఖర్లో బట్లర్, రూథర్‌ఫోర్డ్ బ్యాట్‌ను ఝులిపించారు.
ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌కు ముందు టాప్ ప్లేస్‌లో ఉండిన ఆర్సీబీ మూడో స్థానానికి పడిపోయింది.