ధోని సారథ్యంలో? | Chennai Super Kings vs Delhi Capitals match today | Sakshi
Sakshi News home page

ధోని సారథ్యంలో?

Published Sat, Apr 5 2025 4:10 AM | Last Updated on Sat, Apr 5 2025 5:58 AM

Chennai Super Kings vs Delhi Capitals match today

నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ‘ఢీ’

గాయం నుంచి ఇంకా కోలుకోని చెన్నై కెప్టెన్‌ రుతురాజ్‌

మధ్యాహ్నం గం. 3:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం 

చెన్నై: వరుస విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు... ఐదుసార్లు చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 18వ సీజన్‌లో అక్షర్‌ పటేల్‌ సారథ్యంలోని ఢిల్లీ... ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించింది. మరోవైపు విజయంతో లీగ్‌ను ఆరంభించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌... ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయపడటంతో ఈ మ్యాచ్‌లో ‘మాస్టర్‌మైండ్‌’ మహేంద్ర సింగ్‌ ధోని చెన్నై జట్టును నడిపించే అవకాశాలున్నాయి. 

చెపాక్‌ స్టేడియంలో మెరుగైన రికార్డు ఉన్న చెన్నై జట్టు... చివరగా ఇక్కడ ఆడిన మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో పరాజయం పాలైంది. ఇరు జట్లలోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉండటంతో... ఈ మ్యాచ్‌లో స్పిన్‌ను సమర్థవంతంగా ఆడిన జట్టు ముందంజ వేయనుంది. రాజస్తాన్‌ రాయల్స్‌తో పోరులో గాయపడ్డ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో... అతడు బరిలోకి దిగడంపై సందేహాలు నెలకొన్నాయి. మ్యాచ్‌ సమయానికి అతడు సిద్ధంగా లేకుంటే... ధోని చెన్నై కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 

కాన్వే, రాహుల్‌ త్రిపాఠి, శివమ్‌ దూబే, విజయ్‌ శంకర్, రవీంద్ర జడేజా, ధోనితో చెన్నై బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది. బౌలింగ్‌లో నూర్‌ అహ్మద్‌ విజృంభిస్తుండగా... పతిరణ, ఖలీల్‌ అహ్మద్, అశ్విన్, జడేజా అతడికి అండగా నిలుస్తున్నారు. మరోవైపు ఢిల్లీ జట్టులో కూడా నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ముఖ్యంగా కుల్దీప్‌ యాదవ్, నూర్‌ అహ్మద్‌ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. 

డుప్లెసిస్, మెక్‌గుర్క్‌తో ఢిల్లీ ఓపెనింగ్‌ బలంగా ఉండగా... ఫామ్‌లో ఉన్న అభిషేక్‌ పొరెల్, కేఎల్‌ రాహుల్, అక్షర్, స్టబ్స్, అశుతోష్‌ శర్మ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు రానున్నారు. గతంలో చెన్నైకి ప్రాతినిధ్యం వహించిన డు ప్లెసిస్‌కు చెపాక్‌ పిచ్‌పై మంచి రికార్డు ఉంది. ఇక పేస్‌ బౌలింగ్‌ తురుపుముక్క మిచెల్‌ స్టార్క్‌ తన విలువ చాటుకుంటుండటం ఢిల్లీకి అదనపు ప్రయోజనం చేకూరుస్తోంది. చెపాక్‌ వేదికగా చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య 9 మ్యాచ్‌లు జరగగా... అందులో ఏడింట చెన్నై విజయం సాధించింది.  

తుది జట్లు (అంచనా) 
చెన్నై సూపర్‌ కింగ్స్‌: రుతురాజ్‌ (కెప్టెన్‌ ), కాన్వే, రాహుల్‌ త్రిపాఠి, శివమ్‌ దూబే, విజయ్‌ శంకర్, జడేజా, ఓవర్టన్‌/రచిన్‌ రవీంద్ర, ధోని, అశ్విన్, ఖలీల్, నూర్, పతిరణ. 
ఢిల్లీ క్యాపిటల్స్‌: అక్షర్‌ (కెప్టెన్‌ ), డు ప్లెసిస్, మెక్‌గుర్క్, అభిషేక్‌ పొరెల్, కేఎల్‌ రాహుల్, స్టబ్స్, అశుతోష్‌ శర్మ, విప్రాజ్‌ నిగమ్, కుల్దీప్, స్టార్క్, ముకేశ్, మోహిత్‌ శర్మ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement