
ఢిల్లీ చేతిలో ఓడిన చెన్నై
25 పరుగులతో క్యాపిటల్స్ గెలుపు
కేఎల్ రాహుల్ అర్ధసెంచరీ
చెన్నై: ఐపీఎల్‌లో తమకు కోటలాంటి చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ పట్టు చేజారిపోతోంది. 17 ఏళ్ల తర్వాత ఈ మైదానంలో బెంగళూరు చేతిలో ఓడిన సూపర్ కింగ్స్... ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత ఢిల్లీ చేతుల్లో పరాజయం పాలైంది. శనివారం జరిగిన పోరులో క్యాపిటల్స్ 25 పరుగుల తేడాతో చెన్నైని ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 77; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీకి తోడు అభిõÙక్ పొరేల్ (20 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.
అనంతరం చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులే చేసింది. విజయ్‌శంకర్ (54 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), ఎమ్మెస్ ధోని (26 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. తొలి ఓవర్లోనే జేక్ ఫ్రేజర్ (0) వెనుదిరగ్గా...రాహుల్, పొరేల్ 54 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యంలో ఢిల్లీ కోలుకుంది. ముకేశ్ చౌదరి ఓవర్లో పొరేల్ వరుసగా 4, 6, 4, 4తో చెలరేగిపోగా, పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 51 పరుగులకు చేరింది.
ఆరంభంలో కాస్త జాగ్రత్తగా ఆడిన రాహుల్ తొలి 20 బంతుల్లో 25 పరుగులే చేశాడు. ఆ తర్వాత ధాటిగా ఆడిన అతను తర్వాతి 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 పరుగులు సాధించాడు. పొరేల్ వెనుదిరిగిన తర్వాత అక్షర్ పటేల్ (14 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్), సమీర్ రిజ్వీ (15 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) కొద్ది సేపు రాహుల్‌కు అండగా నిలిచాడు. 33 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఒకే ఓవర్లో రాహుల్, అశుతోష్ (1) అవుటైనా...చివర్లో స్టబ్స్ (12 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక పరుగులు సాధించాడు.
సమష్టి వైఫల్యం...
ఛేదనలో చెన్నై ఆరంభం నుంచే తడబడింది. పిచ్ నెమ్మదిస్తూ పోవడంతో పరుగులు రావడంతో కష్టంగా మారిపోయింది. టాప్–6లో విజయ్‌శంకర్ మినహా అంతా విఫలమయ్యారు. ఆరు పరుగుల వ్యవధిలో రచిన్ (3), రుతురాజ్ (5) అవుట్ కాగా, కాన్వే (13) విఫలమయ్యాడు. ఆ తర్వాత 9 పరుగుల తేడాతో శివమ్ దూబే (18), రవీంద్ర జడేజా (2) కూడా వెనుదిరిగారు. ఆ తర్వాత విజయ్ బాగా నెమ్మదిగా ఆడగా, ధోని కూడా ప్రభావం చూపలేదు. తాను ఆడిన తొలి 31 బంతుల్లో విజయ్ ఒక్కటే ఫోర్ కొట్టగలిగాడు! వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు 57 బంతుల్లో 84 పరుగులు జోడించినా జట్టును గెలిపించలేకపోయారు.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: జేక్ ఫ్రేజర్ (సి) అశ్విన్ (బి) అహ్మద్ 0; రాహుల్ (సి) «ధోని (బి) పతిరణ 77; పొరేల్ (సి) పతిరణ (బి) జడేజా 33; అక్షర్ (బి) నూర్ 21; రిజ్వీ (సి) జడేజా (బి) అహ్మద్ 20; స్టబ్స్ (నాటౌట్) 24; అశుతోష్ (రనౌట్) 1; నిగమ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1–0, 2–54, 3–90, 4–146, 5–179, 6–180. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–25–2, ముకేశ్ చౌదరి 4–0–50–0, అశ్విన్ 3–0–21–0, జడేజా 2–0–19–1, నూర్ అహ్మద్ 3–0–36–1, పతిరణ 4–0–31–1.
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (సి) అండ్ (బి) ముకేశ్ 3; కాన్వే (సి) పటేల్ (బి) నిగమ్ 13; రుతురాజ్ (సి) జేక్ ఫ్రేజర్ (బి) స్టార్క్ 5; విజయ్‌శంకర్ (నాటౌట్) 69; దూబే (సి) స్టబ్స్ (బి) నిగమ్ 18; జడేజా (ఎల్బీ) (బి) కుల్దీప్ 2; ధోని (నాటౌట్) 30; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–14, 2–20, 3–41, 4–65, 5–74. బౌలింగ్: స్టార్క్ 4–0–27–1, ముకేశ్ కుమార్ 4–0–36–1, మోహిత్ శర్మ 3–0–27–0, విప్‌రాజ్ నిగమ్ 4–0–27–2, కుల్దీప్ యాదవ్ 4–0–30–1, అక్షర్ పటేల్ 1–0–5–0.
ధోని మళ్లీ అలాగే...
‘ధోని గతంలోలాగా ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయలేడు కాబట్టి కావాలనే ఆలస్యంగా వస్తున్నాడు’...చెన్నై కోచ్ ఫ్లెమింగ్ వివరణ ఇది. శనివారం తప్పనిసరి పరిస్థితుల్లో అతను 74/5 వద్ద 11వ ఓవర్ ఐదో బంతికే బ్యాటింగ్‌కు వచ్చాడు. 56 బంతుల్లో 110 పరుగులు చేయాల్సిన స్థితిలో అతనిపై పెద్ద బాధ్యత కనిపించింది. కానీ అతను భారీ షాట్లు ఆడలేక మళ్లీ అభిమానులను నిరాశపర్చాడు. 16 సింగిల్స్, 2 సార్లు రెండేసి పరుగులు తీసిన అతని బ్యాటింగ్‌లో ఆరు ‘డాట్‌బాల్స్’ ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనట్లు అతని తల్లిదండ్రులిద్దరూ ఈ మ్యాచ్‌కు హాజరు కావడం విశేషం! దాంతో అతని కెరీర్ ముగింపుపై మరోసారి చర్చ మొదలైంది.